సాక్షి, హైదరాబాద్: 2019లో ఇండియన్ నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిలో నగరవాసి, టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి రూపొందించిన కబీర్‌సింగ్ చిత్రం దుమ్మురేపింది. హీరో విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా మార్చిన అర్జున్‌రెడ్డి సినిమా బాలీవుడ్‌లో కబీర్‌సింగ్‌గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌కపూర్, అతడికి జంటగా కియారా అద్వానీ నటించిన ఈ చిత్రానికి కూడా సందీప్‌రెడ్డియే దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా.. తాజాగా దేశంలోనే గూగుల్‌లో ట్రెండింగ్ అయిన వాటిల్లో ఓవరాల్‌గా టాప్–5లో నాలుగో స్థానంలో నిలిచింది.
ఓవరాల్ టాప్‌లో క్రికెట్ కప్..
అత్యధికంగా నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ వరల్డ్ కప్ తొలి ప్లేస్‌లో నిలిచింది. దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికలు రెండో స్థానంలో, చంద్రయాన్–2 అంతరిక్ష ప్రయోగం 3వ స్థానం దక్కించుకోగా కబీర్ సింగ్ సినిమా 4వ స్థానాన్ని, ఎవెంజర్స్ ది ఎండ్‌గేమ్ 5వ స్థానాన్ని అందుకున్నాయి.
నృత్యం, అందం కోసం అన్వేషణ..
నగరాల్లో డ్యాన్స్ క్లాసెస్‌పై పెరుగుతున్న ఆసక్తికి గూగుల్ ట్రెండింగ్ జాబితా అద్దం పట్టింది. ఈ ఏడాది తమకు దగ్గర్లో ఉన్న వాటి గురించి నెటిజన్లు జరిపిన అన్వేషణలో నృత్య శిక్షణ తరగతులు మొదటి స్థానంలో ఉన్నాయి. అందాన్ని తీర్చిదిద్దే సెలూన్ల వెదుకులాట రెండో స్థానాన్ని ఆక్రమించగా.. ఆహార్యాన్ని మెరిపించే కాస్ట్యూమ్స్ (దుస్తులు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మొబైల్ ఫోన్లు 4వ స్థానంలో, చీరల షాపులు 5వ స్థానంలో నిలిచాయి.
సినిమాల్లో కబీర్‌సింగ్ టాప్..
నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రాల్లో తెలుగు దర్శకుడు రూపొందించిన కబీర్‌సింగ్ చిత్రం ఈ ఏటి మేటి సెర్చ్‌గా ప్రథమస్థానం అందుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్ ఎండ్‌గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, సూపర్ 30 నిలిచాయి.
పాటల్లో.. లే ఫొటో లే..
నెటిజన్లు ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన పాటల్లో రాజు రావల్, మహీందర్ చౌదరిలు పాడిన ఆల్బమ్ సాంగ్ ‘లే ఫొటో లే’తొలిస్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హిమేశ్ రేష్మియా పాడిన తెరీ మేరీ కహానీ, మోస్ట్ వాంటెడ్ ఆల్బమ్ కోసం బిందా అజులా, బాబీ లాయల్‌లు పాడిన తేరీ ప్యారీ ప్యారీ దో అఖియా, ధ్వని భన్సాలి, నిఖిల్ డిసౌజాలు పాడిన వాస్తే ఆల్బమ్‌లోని వాస్తే టైటిల్ సాంగ్, లూకా చుప్పి సినిమాలోని టోని కక్కర్ పాడిన కోకోకోలా తూ.. ఉన్నాయి.
క్రికెట్‌కే కిరీటం..
సహజంగానే క్రీడా పోటీలకు సంబంధించిన అన్వేషణలో క్రికెట్ వరల్డ్ కప్ నంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది. ఇక ప్రో కబడ్డీ లీగ్, వింబుల్డన్, కోపా అమెరికా, ఆస్ట్రేలియన్ ఓపెన్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఫలితాల వార్తలకే ప్రథమ తాంబూలం..
తాము తెలుసుకోవాలనుకున్న వార్తలకు సంబంధించి నెటిజన్లు అత్యధికంగా అన్వేషించిన వాటిలో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వార్తలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో.. చంద్రయాన్ 2, ఆర్టికల్ 370, ప్రధానమంత్రి కిసాన్ యోజన, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.
అభినందన్‌కి అగ్రస్థానం..
వ్యక్తుల గురిం చి నెటిజన్ల అన్వేషణలో పాక్ ముష్కరుల చేతికి చిక్కి క్షేమంగా విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ప్రముఖ సినీగాయని లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, సూపర్ 30 కోచింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఉచిత బోధన చేస్తూ, హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 బయోపిక్‌కు నేపథ్య కథానాయకుడిగా మారిన ఆనంద్‌కుమార్ 4వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ సంచలన యువ నటుడు విక్కీ కౌశల్ (యురి సినిమా ఫేమ్) 5వ స్థానం దక్కించుకున్నాడు.
ఆర్టికల్ 370 ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి? అనేది తెలుసుకోవాలని నెటిజన్లు బాగా ఆసక్తి చూపించారు. ఈ ఏడాది వాట్ ఈజ్... అంటూ నెటిజన్లు సెర్చ్ చేసిన వాటిల్లో ఆర్టికల్ 370 టాప్ ప్లేస్‌లో ఉంది. ఎన్నికల్లో పోలింగ్ అయిన వెంటనే వచ్చే ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటో తెలుసుకోవాలనే అంశం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బ్లాక్‌హోల్, హౌడీ మోడీ, ఈ–సిగరెట్‌లు ఉన్నాయి.
ఎలా ఓటు వేయాలి..?
తెలియని పనులు ఎలా చేయాలో తెలుసుకోవడం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన నెటిజన్లలో అత్యధికులు ‘హౌ టు ఓట్’అంటూ అన్వేషించారు. ఆ తర్వాత క్రమంలో వరుసగా ఆధార్‌ను పాన్‌కార్డ్‌కి ఎలా లింక్ చేయాలి? ఓటర్ జాబితాలో నా పేరు ఎలా చెక్ చేసుకోవాలి? నీట్ పరీక్ష ఫలితం ఎలా తెలుసుకోవాలి? ట్రాయ్ ప్రకారం చానల్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వంటివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment