‘ఏం జరుగుతోంది? బాంబుకు అమ్మ పేరేంటి?’
మిలాన్: అమెరికాను పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. బాంబులకు తల్లి పేరు పెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. విధ్వంసాలు సృష్టించే బాంబులను వర్ణించేందుకు అమ్మ అనే పదాన్ని ఉపయోగించరాదని ఆయన హితవు పలికారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోని అన్ని బాంబులకు తల్లి(మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్)గా పేర్కొంటూ అమెరికా ఓ పెద్ద బాంబును సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై జారవిడిచిన విషయం తెలిసిందే. అనంతరం ప్రపంచ బాంబులకు తండ్రిలాంటి బాంబు(ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్) రష్యా వద్ద ఉందంటూ చర్చ జరిగింది.
అయితే, అనూహ్యంగా శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన పోప్.. పేలుడు పదార్థాన్ని తల్లి పేరుతో వర్ణించరాదని అన్నారు. ‘ఆ పేరు నేను విన్నప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది. తల్లి జన్మనిస్తుంది. బాంబు మాత్రం చావునిస్తుంది. అయినా దీనిని తల్లిగా పిలుస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న పోప్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.