జైపూర్: ఓ కార్యక్రమానికి హాజరైన స్వామిజీ మహిళా ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని ఉండడం చూసి, సభలో ప్రసంగించకుండానే వెనుదిరిగిన ఘటన జైపూర్‌లో చోటు చేసుకొంది. జైపూర్ బిర్లా ఆడిటోరియంలో జూన్ 30న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గురువు స్వామి జ్ఞానవాత్సల్య, తన ప్రసంగాన్ని ప్రారంభించకుండానే వెనుదిరిగారు. తాను ప్రసంగించే ఆడిటోరియంలోని మొదటి మూడు వరుసలలో మహిళలను కూర్చోనివ్వడానికి అనుమతించకూడదని స్వామి జ్ఞానవాత్సల్య ముందుగానే సభ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తాను షరతు పెట్టినా కూడా నిర్వాహకులు మహిళలను ముందు వరుసలో కూర్చొనిచ్చిన కారణంగా.. స్వామిజీ ఈ కార్యక్రమం నుంచి వైదొలిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
'రాజ్ మెడికాన్ 2019' అనే ఈ కార్యక్రమాన్ని 'ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్ సర్వీస్ డాక్టర్స్ అసోసియేషన్ (అరిస్డా)' నిర్వహించింది. మహిళా వైద్యులు స్వామి జ్ఞానవాత్సల్య విధించిన షరతులపై కొందరు మహిళా డాక్టర్లు కలత చెందగా, మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్వామిజీ ప్రసంగాన్ని అడ్డుకుంటామని నిరసన తెలిపారు.
అయితే వైద్యులు, నిర్వాహకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు, మొదటి రెండు వరుసలను ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. కానీ, స్వామిజీ వేదిక వద్దకు రాగానే.. కొందరు మహిళలు ముందు వరుసలో వచ్చి కూర్చొన్నారు. ఈ సంఘటన గూర్చి డాక్టర్ రితు చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ ప్రసంగం వినడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చాలా మంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చున్నారు. హఠాత్తుగా మొదటి మూడు వరుసల్లో మహిళలు కూర్చొరాదని అనడంతో గందరగోళం నెలకొందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment