
శంక శ్యామ్‌జీ గ్రామం
అమ్మాయికి పురుటినొప్పులు మొదలయ్యాయనగానే ఆ ఊరివారు∙చేసేపని..ఆమెను వెంటనే ఊరి పొలిమేరల్లోకి తరలించడమే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 130 కి.మీ దూరంలోని రాజ్‌గర్‌లోని శంక శ్యామ్‌జీ గ్రామంలో ఏకంగా నాలుగు వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇక్కడ గర్భిణులు ఇంటిలో పిల్లలకు జన్మనివ్వరు. వీలయితే ఆసుపత్రి లేదంటే ఊరి బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోనే జన్మనివ్వాల్సిందే! అది ఎర్రగా మండే ఎండాకాలంలో కానీయండి, భోరున వర్షాలు కురిసేపుడు అవనివ్వండి, గజ్జున చలి మెలిపెట్టేసే రోజుల్లో కానీయండి...ఎలాంటి మినహాయింపు లేదు. ఈ కట్టుబాటుకు సంబంధించి లిఖిత శాసనాలేమి లేకపోయినా, ఇక్కడ స్త్రీలు ప్రసవించడాన్ని మాత్రం అనుమతించరు.
దీనికంతటికి ఓ మూఢవిశ్వాసమే కారణం...‘ 16వ శతాబ్దంలో ఈ గ్రామంలో ఓ గుడిని నిర్మిస్తున్న సందర్భంగా ఓ మహిళ గోధుమలతో పిండి పట్టించడం మొదలుపెట్టడంతో పనిచేసే వాళ్ల దృష్టి మళ్లి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. దాంతో దేవుళ్లకు కోపమొచ్చి ఈ గ్రామంపై శాపాలు కురిపించారు.. ఇక్కడ ఏ మహిళా బిడ్డకు జన్మనివ్వలేదంటూ శపించారు’ అంటూ ఈ ఊరి వయోధికులు వెల్లడించారు. ఈ మేరకు తమ గ్రామం శాపగ్రస్తమైందంటూ గ్రామస్థులు ఇప్పటికీ నమ్ముతున్నారు. దీనిని ఓ అంధ విశ్వాసంగా గ్రామస్థులు అంగీకరించరు.
గతంలో అనుకోకుండా కొన్ని ప్రసవాలు జరిగినా వికలాంగులుగానో, మృతశిశువులో జన్మించిన సందర్భాలను తాము స్వయంగా చూశామని వారు చెబుతుంటారు. ఒకవేళ ఏ మహిళ అయినా గ్రామం లోపలే ప్రసవిస్తే తల్లి లేదా బిడ్డలలో ఒకరు మరణిస్తారని లేదా పుట్టిన శిశువులు వైకల్యంతో పుడతారని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అత్యవసర పరిస్థితులను మరింత మెరుగ్గా ఎదుర్కునేందుకు వీలుగా ఊరవతల ప్రసవాల కోసమే ఓ గదిని గ్రామస్థులు నిర్మించారు. ‘దాదాపు 90 శాతం వరకు ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. తప్పని పరిస్థితుల్లోనే గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన గదిలో పురుడుపోస్తుంటారు’ అని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్ పేర్కొన్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment