![Mukesh Ambani Thank Corona Warriors on Janata Curfew - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/23/mukesh-ambani.jpg.webp?itok=w0E3IfdF)
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌కు కుల, మత, ప్రాంతీయ, వర్గ, ధనిక, పేద తారతమ్యాలు ఉండవు.. దానికి అందరూ సమానమే. ఈ మహమ్మారి పేరు చెబితే అంతా భయపడిపోవాల్సిందే. అదే విధంగా దానిని ఎదుర్కొనేందుకు, ఆ ప్రాణాంతక వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ‘యుద్ధరంగం’లోకి దిగిన ప్రతీ ఒక్కరికీ తప్పక సెల్యూట్ చేయాల్సిందే. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. స్వచ్ఛంద కర్ఫ్యూను విజయవంతం చేయడంతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్య, వియానయాన, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సాయంత్రం ఐదు గంటలకు ధన్యవాదాలు తెలిపారు. (భారత్‌లో 8కి చేరిన కరోనా మరణాలు)
ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, పూరి గుడిసెల్లో నివసించే పేదల నుంచి ఆంటిల్లాలో నివసించే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సహా ప్రతీ ఒక్కరూ చప్పట్లు, గంటలు మోగిస్తూ వారికి సంఘీభావం తెలిపారు. భారత ప్రజల ఐక్యతారాగాన్ని ప్రతిధ్వనింపజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్త్రృతంగా వైరల్ అవుతున్నాయి. కాగా ప్రాణాంతక కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ పకడ్బందీగా అమలైంది. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఈనెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.(తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు)
Comments
Please login to add a commentAdd a comment