'ఒట్టు.. పార్టీని నిలువునా చీలుస్తానన్నాడు'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్పై ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడై తిరిగి పార్టీలోకి వచ్చిన అమర్ సింగ్ కాలిగోటికి కూడా అఖిలేశ్ సరిపోడని పరుష వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని వేళలా పార్టీకోసం కష్టపడ్డానని, తాను ఏం చేసినా నేతాజీ(ములాయం సింగ్)కోసమే చేశానని చెప్పారు. సమాజ్ వాది పార్టీని చీలుస్తానని, కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానని తనతో అఖిలేశ్ స్వయంగా అన్నాడని, ఈ విషయం తాను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నానని అన్నారు. అమర్ సింగ్ తిరిగి అడుగుపెట్టడం, మంత్రి పదవి నుంచి శివపాల్ను తొలగించడం వంటి పరిణామాల తర్వాత ఎస్పీ దాదాపు నిట్టనిలువునా చీలిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన శివపాల్.. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోపక్క, తాజాగా ఏర్పడిన వివాదం విషయంలో సోమవారం ములాయంతో శివపాల్, అఖిలేశ్ వేర్వేరుగా భేటీ అయ్యి పలు విషయాలు కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా ములాయం ముందు శివపాల్ భావోద్వేగానికి లోనయ్యారు. 'సమాజ్ వాది పార్టీకి నేను చేసిన సేవలు చిన్నవా?అఖిలేశ్ను సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు మద్దతిచ్చాను. కానీ, నన్ను ఎప్పుడైతే అధ్యక్షుడిగా చేశారో అతడు నా వద్ద ఉన్న ఇతర శాఖలు లాక్కున్నాడు. నేను అఖిలేశ్ కన్నా తక్కువ పనిచేశానా? ముఖ్యమంత్రిగా అతడు చెప్పిన ప్రతీది విన్నాను. అలాగే నేతాజీ చెప్పింది చేశాను. నేను అమర్ సింగ్ తో టచ్ లో ఉన్నది నిజమే. అయితే, ఈ విషయం నేను ఎప్పుడూ దాచలేదు' అని చెప్పాడు.
అదే సమయంలో తండ్రి ములాయంకు అఖిలేశ్ కూడా గట్టి వివరణ ఇచ్చాడు. పార్టీ చీఫ్ (శివపాల్) ఏం చేశాడో అందుకు ప్రతిఫలమే ఇదంతా. నేను మీవల్లే(ములాయం వల్లే) ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉన్నాను. మీకు వ్యతిరేకంగా కుట్ర చేసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించబోను. పార్టీనిగానీ, ములాయంను గానీ బలహీన పరచాలని కుట్ర చేసేవారిపై నేను వెంటనే చర్యలు తీసుకుంటాను' అని అఖిలేశ్ అన్నారు. కాగా, వీరిద్దరితో కలిసి ములాయం సాయంత్రం మరోసారి భేటీ అవనున్నారు.