
ప్రతీకాత్మకచిత్రం
భోపాల్ : దేశంలో మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని ఓ గుహలో తలదాచుకున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో నర్మదా పరిక్రమ యాత్రలో ఉన్న ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అటవీ ప్రాంతంలో చిక్కుకుని, అప్పటి నుంచి అక్కడి గుహలో ఉంటున్నారు. ఆ వ్యక్తిని గుర్తించిన మధ్యప్రదేశ్ పోలీసులు అతని బంధువులకు అప్పగించారు. ఉదయ్‌పుర ప్రాంతంలోని అడవుల్లోని ఓ గుహలో నివసిస్తున్న వీరేంద్ర సింగ్ డోగ్రాను ఆదివారం సాయంత్రం పోలీసులు కనుగొన్నారు. ఆ వ్యక్తి వద్ద కొన్ని దుస్తులు, చేతిలో మహాభారతం పుస్తకం ఉన్నాయని తెలిపారు.
నర్మదా పరిక్రమలో ఉన్న వీరేంద్ర సింగ్ మార్గమధ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో చిక్కుకుపోయారని రైసెన్ జిల్లా ఎస్పీ మోనికా శుక్లా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ నుంచి గుజరాత్ వరకూ నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో ఆయన పర్యటన చేపట్టారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మార్చి 22న లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు వీరేంద్ర సింగ్ కందర్వి గ్రామంలోని తమ బంధువు శశిభూషణ్ ఇంట్లో ఆగారని అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోని గుహలో వీరేంద్ర సింగ్‌ను అక్కడి పశువుల కాపరులు గుర్తించి అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. కాగా తాను నవీ ముంబైలో ఉంటానని, తమ సోదరి హైదరాబాద్‌లో ఉంటారని వీరేంద్ర పోలీసులకు వివరించగా, ఆయనను పోలీసులు కందర్వి గ్రామంలోని బంధువు ఇంటికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment