
పాక్ గాయకుడు అద్నాన్ సమీకి సమన్లు
ముంబై: పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. అతని వీసా గడువు ముగిసినా భారత్ లో ఉండటంతో సమన్లు పంపక తప్పలేదు. సమీకి భారత రాయబార కార్యాలయం గత ఏడాది సెప్టెంబర్ 26 నుంచి ఈ ఏడాది అక్టోబర్ ఆరు వరకు వీసా మంజూరు చేసింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లోనూ ఇతడు పలు పాటలు పాడాడు. వీసా గడువు ముగిసిన నేపథ్యంలో దేశం విడిచివెళ్లిపోవాలన్న డిమాండ్ కూడా ఎక్కువైంది. అంతకముందు వీసా కాలపరిమితి ముగిసినా ముంబైలోనే ఉంటున్న పాక్ గాయకుడు అద్నన్ సమీ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఎమ్మెన్నెస్ హెచ్చరించింది.
సమీ మమ్మల్ని శనివారం మా కార్యాలయంలోనే కలుసుకొని సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడని ఎమ్మెన్నెస్ సినిమా విభాగం చిత్రపత్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ తెలిపారు. వీసా పరిమితి ముగిసింది కాబట్టి భారత్‌ను వీడివెళ్లాలని మేం ఆయనకు సూచించాం అని వివరించారు. సమీ స్వచ్ఛం దంగా మీ కార్యాలయానికి వచ్చారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో తామే పిలిపించామని తెలిపారు. తనకు పాకిస్థాన్ పాస్‌పోర్టు ఉందని, సమయానుగుణంగా జారీ అయ్యే వీసాతో భారత్‌లో నివసిస్తున్నానని ఈ గాయకుడు ముంబైలోని కుటుంబ న్యాయస్థానికి తెలిపారు.