ఇస్లామాబాద్: భారత్‌లో కొన్నాళ్లు పెరిగినప్పటికీ పాకిస్తాన్‌ను మాత్రమే తన సొంతిళ్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడతానని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ కుమారుడు అజాన్ సమీ పేర్కొన్నాడు. తన తండ్రి భారత పౌరసత్వం తీసుకున్నప్పటికీ తానెప్పటికీ పాక్ పౌరుడిగానే ఉంటానని తెలిపాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజాన్ మాట్లాడుతూ...‘ మా నాన్న అంటే నాకు ఇష్టంతో పాటు గౌరవం కూడా ఉంది. తను ఏ దేశంలో నివసించాలనుకుంటున్నానో నాన్న చెప్పినపుడు..ఆయన నిర్ణయాన్ని గౌరవించాను. అంతేతప్ప వ్యతిరేకంగా మాట్లాడలేదు. భారత్‌లో ఉండాలని ఆయన అనుకున్నారు. నేను పాకిస్తాన్‌ను ఎంచుకున్నాను. నిజానికి నా టీనేజ్‌లో చాలా ఏళ్లు ఇండియాలోనే పెరిగాను. అక్కడ నాకు అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. అయినప్పటికీ పాక్‌నే నా సొంత ఇంటిలా భావిస్తాను. అక్కడి ఇండస్ట్రీ నాకు కుటుంబం లాంటిది. పాక్ ఇండస్ట్రీలో భాగమైనందుకు గర్వపడుతున్నా’ అని ఈ మ్యూజిక్ కంపోజర్ చెప్పుకొచ్చాడు.
ఇక తన తండ్రితో అనుబంధం గురించి చెబుతూ...‘ఒక్కోసారి నెలల పాటు నాన్నను చూసే అవకాశం ఉండేది కాదు. అయినా తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలు చెప్పకూడదు కదా. అమ్మానాన్నా విడిపోయిన తర్వాత నేను అమ్మ దగ్గరే పెరిగాను. నాన్నతో స్నేహితుడిలా మెలిగేవాడిని. ప్రస్తుతం మేమిద్దరం ఎన్నో విషయాల గురించి చర్చిస్తాం. కెరీర్‌కు సంబంధించి ఆయన సలహాలు, సూచనలు ఇస్తారు. నా దృష్టిలో ఆయనో మ్యూజిక్ లెజెండ్. నా పాటలకు మొదటి విమర్శకుడు ఆయనే. తన ప్రభావం నా మీద పడకుండా సొంత శైలి అలవరచుకోమని ప్రోత్సహిస్తారు’ అని అజాన్ పేర్కొన్నాడు. కాగా అజాజ్.. అద్నాన్ సమీ- పాక్ నటి జేబా భక్తీర్‌ల సంతానం. ఇక పాకిస్తాన్‌లో పుట్టిన అద్నాన్ భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే నివసిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment