దానకర్ణుల నగరం.. ముంబై!
మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం.. దానకర్ణులకు కూడా రాజధానిగా మారిపోతోంది. ఈ విషయం హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ విడుదలతో తేలింది. దేశంలో మొత్తం 50 మంది దానకర్ణులను చూస్తే అందులో 15 మంది కేవలం ముంబై నగరం నుంచే ఉన్నారు. వాళ్లు నగదు రూపంలో గానీ, వస్తువుల రూపంలో గానీ 2013 ఏప్రిల్ 1 నుంచి 2014 అక్టోబర్ 31 వరకు చేసిన దానాలను లెక్కలోకి తీసుకున్నారు. కనీసం రూ. 10 కోట్ల దానం నుంచే లెక్కించారు.
వీళ్లలో రతన్ టాటా నాలుగో ర్యాంకుతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం రూ. 620 కోట్లు దానం చేశారు. ఐదో ర్యాంకులో ఉన్న ముకేష్ అంబానీ రూ. 603 కోట్లు ఇవ్వగా.. 33వ ర్యాంకులో ఉన్న షారుక్ ఖాన్ రూ. 25 కోట్లు మాత్రమే దానం చేశారు. ఇక 47వ ర్యాంకు సాధించిన సల్లూ భాయ్ రూ. 11 కోట్ల విరాళాలు ఇచ్చారు. ముంబైలో ఉన్న మొత్తం దానకర్ణులంతా కలిపి రూ. 2,129 కోట్లు దానం చేశారు. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్థానాన్ని బెంగళూరు నగరం ఆక్రమించింది. అక్కడ మొత్తం 8 మంది దానకర్ణులున్నారు. అయితే దానం మొత్తం చూస్తే మాత్రం ముంబై కంటే బెంగళూరే ఎక్కువ. అక్కడ విప్రో చీఫ్ అజీం ప్రేమ్జీ ఒక్కరే రూ. 12,316 కోట్లు దానం చేయడంతో మొత్తం నగరం అంతా కలిపి రూ. 13,200 కోట్ల విరాళాలు ఇచ్చినట్లయింది.
ఇక మొత్తం కుబేరుల్లో అజీం ప్రేమ్జీ తర్వాత వేదాంత గ్రూపు అధినేత అనిల్ అగర్వాల్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత విరాళాలు రూ. 1,796 కోట్లకు చేరుకున్నాయి. హెచ్సీఎల్ చీఫ్ శివ్ నాడార్ రూ. 1,136 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.