అసోంలో ముస్లింలు ఎందుకు పెరిగారో తెలుసా! | Muslims population raised in Assam with some reasons | Sakshi
Sakshi News home page

అసోంలో ముస్లింలు ఎందుకు పెరిగారో తెలుసా!

Published Tue, Jan 16 2018 5:09 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

Muslims population raised in Assam with some reasons - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అసోం రాజకీయాలకు ఎప్పుడూ జనాభా లెక్కలే కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చాయి. ఈ లెక్కల ఆధారంగానే బంగ్లాదేశ్‌ నుంచి ముస్లింల వలసలు పెరిగాయంటూ అసోంలో తరచుగా ఆందోళనకు కూడా చెలరేగాయి. విదేశీ వలసలు వ్యతిరేకంగా 1979–1980లో ‘ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌’ చేపట్టిన ఆందోళన రక్తపాతానికి దారితీయడమే కాకుండా ఎంతో మంది అమాయకుల మరణానికి దారి తీసింది.

1951లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం అసోం జనాభాలో ముస్లింల సంఖ్య  24.68 శాతం ఉండగా, 1991 నాటికి 28.43 శాతానికి 2011లో 34.22 శాతానికి పెరిగింది. అఖిల అసోం విద్యార్థుల సంఘం ఆందోళన కారణంగా 1981లో అసోంలో జనభా లెక్కల కార్యక్రమాన్ని చేపట్ట లేదు. 1951లో 24.68 శాతం ఉన్న ముస్లింలు, 2011 నాటికి 34.22 శాతానికి పెరగడానికి కారణం బంగ్లాదేశ్‌ నుంచి ముస్లింల వలసలు పెరగడమే కారణమని పలు రకాల సూత్రీకరణలు ప్రచారంలోకి వచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చెలరేగాయి. ఈ సందర్భంగా ముస్లింలపై దాడులు కూడా కొనసాగాయి.

ఇలాంటి సూత్రీకరణలను ప్రచారంలోకి తేవడంలో ఇద్దరు అసోం పోలీసులు, ఆరెస్సెస్‌ పాత్ర ఉందన్న విషయం నాడే వెలుగులోకి వచ్చింది. ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా సరే ముస్లింల వలసలు పెరిగాయన్న వార్తలపైనే అసోం ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. వాస్తవానికి అసోం నుంచి ముస్లింల వలసలు పెరగలేదని, ముస్లింలలో సంతానోత్పత్తి పెరిగిందని గౌహతి యూనివర్శిటీలో గణాంకాల ప్రొఫెసర్‌గా పనిచేసిన అబ్దుల్‌ మన్నన్‌ నిరూపించారు. ఈ మేరకు ఆయన ‘ఇన్‌ఫిల్ట్రేషన్‌: జెనసిస్‌ ఆఫ్‌ అసోం మూవ్‌మెంట్‌’ అన్న పుస్తకంలో తన వాదనను అన్ని ఆధారాలతో పాటకులు ముందుకుతెచ్చారు.  

ఈ అంశాన్ని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త అఖిల్‌ రంజన్‌ దత్తా ‘ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’లో ఇటీవలనే చర్చించి మన్నన్‌ వాదన సరైనదేనని ధ్రువీకరించారు. ఎగువ అసోంలోని జార్‌హట్, శివసాగర్‌ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో ముస్లింల జనాభా పెరుగుదల 68 శాతానికి పైగా ఉందని మన్నన్‌ తెలిపారు. జార్‌హట్‌లో 60 శాతం, శివసాగర్‌లో 59 శాతం ఉంది. ఈ రెండు జిల్లాల్లో ముస్లింల సంతానోత్పత్తి తక్కువగా ఉండిందని, అందుకు కారణం ఆ రెండు జిల్లాల్లో అక్షరాస్యత ఎక్కువగా ఉండడమే కారణమని ఆయన చెప్పారు.

ముస్లింలతో పోలిస్తే ఎస్సీలు, ఎస్టీల జనాభా పెరుగుదల కూడా కొంత ఎక్కువగానే ఉందని ఆయన వివరించారు. అయితే ముస్లిం చిన్నారుల మరణాల సంఖ్య తక్కువగా ఉంటే ఎస్సీ, ఎస్టీ చిన్నారుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు పౌష్టికాహార లోపం ప్రధాన కారణమని కూడా తేల్చారు. ఏ జిల్లాలో, ఏ మతం వాళ్లు,ఏ కులం వాళ్లు ఎలా పెరుగుతూ వచ్చారో చెబుతూ అందుకు సాక్ష్యంగా ఆయన జనాభా లెక్కల్లోని పలు అంశాలనే ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రాష్ట్రాల వివరాలను కూడా వెల్లడించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement