అల్లర్ల బాధితులు కూడా అఖిలేష్‌కే మద్దతు
లక్నో: అక్కడ కర్రల గూడుపై ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బియ్యం బస్తాలతో వేసిన గుడిసెలు ఉన్నాయి. వాటిలో ఎన్నో ముస్లిం కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. వారందరికి కలసి అక్కడ ఓ బోరింగ్, మురుకి నీరు పోయేందుకు ఓ కాలువ ఉన్నాయి. నిజంగా వారంతా అభివృద్ధికి ఆమడ దూరం కాదు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. అయినప్పటికీ వారు అభివృద్ధి మంత్రం పఠిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, అంటే అఖిలేష్ యాదవ్‌కు, తమ ఈ దుస్థితికి కారణమైన ఆయనకు ఓటేస్తామని గట్టిగా చెబుతున్నారు. కారణం ఏమిటీ? ఎందుకు ?
ఉత్తరప్రదేశ్‌లోని కైరానా పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోవున్న మున్నావర్ శిబిరంలో 20కిపైగా ఇలాంటి గుడిశెలు ఉన్నాయి. వారంతా ముజాఫర్ నగర్, శామ్లీ ప్రాంతంలో 2013లో జరిగిన మతకల్లోలంలో నిరాశ్రీయులైన వారే. ఆ నగరాల్లో శక్తివంతమైన జాట్ కులస్థులు దాడులు జరిపి మానవ హననానికి పాల్పడడంతో వారు నిరాశ్రీయులయ్యారు. ఈ అల్లర్లు నివారించడంలో అఖిలేష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అల్లర్లకు సంబంధించి ఎన్ని కేసులో నమోదైనా వేటిపైనా సరైన విచారణ జరగలేదని, ఎవరికి ఎలాంటి శిక్షలు పడలేదని హర్ష మందర్, అక్రమ్ అక్తర్, జాఫర్ ఇక్బాల్, రాజన్య బోస్ లాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సామాజిక కార్యకర్తలు తెలిపారు. నిజమైన దోషుల పేర్లను నమోదు చేయకుండా నిందితులను గుర్తుతెలియని వ్యక్తులుగా పేర్కొనడం, ప్రత్యక్ష సాక్షులను బెదిరించడం వల్ల దోషులెవరికి శిక్ష పడలేదని వారు తెలిపారు.
అయినా అఖిలేష్ పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారని శిబిరంలోని వారిని ప్రశ్నించగా, తమను ఆదుకునేందుకు ఎవరూ ముందుకురాని సమయంలో కైరానాలోని సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే నహీద్ హాసన్ ముందుకు వచ్చి తమకు ఈ పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఈ స్థలం ఆయనదేనని, అందుకు కృతజ్ఞతగా ఆయన పార్టీకి ఓటేస్తామని షర్ఫుద్దీన్ అనే వ్యక్తి తెలిపారు. అఖిలేష్ ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించిందని, అందుకే ఆయనకు ఓటేస్తామని మరి కొంత మంది తెలిపారు. ఆనాటి అల్లర్లకు పోలీసులు, అధికారులే బాధ్యులని జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్ 2015లో తప్పుపట్టినప్పటికీ ముస్లింలు అఖిలేష్ ప్రభుత్వానికే మద్దతు పలుకుతుండడం ఆశ్చర్యం.
నిరాశ్రీయులైన ముస్లిం కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని తొలుత ప్రకటించిన అఖిలేష్ ప్రభుత్వం, ఆ తర్వాత గల్లంతైన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. మున్నావర్ శిబిరంలో తలదాచుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కొంత పరిహారం చెల్లించగా, ముస్లింలు ఎక్కువగా ఉండే పాల్దా గ్రామంలో ముస్లిం బాధిత కుటుంబాలకు అఖిలేష్ ప్రభుత్వం చౌకైన పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అయితే వారికి నష్టపరిహారం మాత్రం ఇంతవరకు చెల్లించలేదు.
అక్కడ యూనస్ జమాలుద్దీన్ అనే బాధితుడిని ప్రశ్నించగా సమాజ్‌వాది పార్టీకే ఓటేస్తామని చెప్పారు. తనకు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చినందున అఖిలేష్‌కే ఓటేస్తానని, ఆయన వర్గం పార్టీ నుంచి చీలిపోయినా ఆయనకే ఓటేసే వాడినని ఆయన తెలిపారు. రావాల్సిన నష్టపరిహారం గురించి ప్రశ్నించగా, పక్కా ఇల్లు ఇచ్చారుగదా అని అన్నారు. పశ్చిమ యూపీలో కుల, మతాలతో సంబంధంలేకుండా యువత అఖిలేష్ వైపే మొగ్గుచూపుతోంది. అఖిలేష్ హయాంలో తాము అభివృద్ధిని చూస్తున్నామని, ఇప్పుడు తాము లాప్‌టాప్‌లను ఉపయోగించే స్థితికి వచ్చామంటే ఆయన కారణమని యువకులు భావిస్తున్నారు.