న్యూఢిల్లీ: భారత్ నుంచి విదేశాలకు తరలిన నల్లధనం దాదాపు రూ. 50 వేల కోట్లు ఉంటుందనేది కేవలం అపోహ మాత్రమేనని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) విభాగం నల్లధనంపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి ఆదివారం విన్నవించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ షా ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పడింది. వాషింగ్టన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎటువంటి లాభాపేక్షా లేని గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటెగ్రిటీ(జీఎఫ్‌ఐ) సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల నల్లధనంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం తెలిసిందే. 2004 నుంచి 2013 వరకు భారత్ నుంచి ఇతర దేశాలకు తరలిన నల్లధనం విలువ 50 వేల కోట్లకు పైగానే ఉంటుందని జీఎఫ్‌ఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నల్లధనం వివరాలను రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం జీఎఫ్‌ఐని కోరింది. జీఎఫ్‌ఐ వెల్లడించిన వివరాలు సరిగా లేవని, ప్రకటించిన సమాచారానికి ఇచ్చిన వివరాలకు తారతమ్యాలున్నాయని డీఆర్‌ఐ సుప్రీంకు స్పష్టం చేసింది.
కేంద్రం విఫలం: యోగా గురు రాందేవ్
చండీగఢ్: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో తనతోపాటు దేశప్రజలు అసంతృప్తిగా ఉన్నారని యోగా గురు రాందేవ్‌బాబా వ్యాఖ్యానించారు. చట్టసభ సభ్యులు ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చిస్తే.. తామెవరమూ వీధుల్లో మాట్లాడాల్సిన అవసరం రాదని స్పష్టం చేశారు. అదేసమయంలో అవినీతి లేకుండా కేంద్రప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని ప్రశంసించారు.
‘50వేల కోట్ల నల్లధనం అపోహే’
Published Mon, Jun 13 2016 2:20 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement