శుభవార్త.. ఇక 584కి.మీ మూడుగంటల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : రెండు ప్రముఖ వాణిజ్య నగరాలు హైదరాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య ప్రయాణించేందుకు ప్రస్తుతం పట్టే సమయం(తొమ్మిది గంటలు) కాస్త అమాంతం తగ్గిపోనుంది. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 584 కి.మీల దూరాన్ని బాహుబలిలాంటి సినిమాను చూసినంత సమయంలో అంటే మూడే మూడు గంటల్లో రైలు ప్రయాణం ద్వారా ముగించే అవకాశం కలగనుంది. అందుకోసం ప్రత్యేక రైల్వే కారిడార్‌ను సిద్ధం చేసేందుకు బ్లూప్రింట్ కూడా రెడీ అయిందట.
ఈ మేరకు రైల్వేశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయం చెప్పారు. 'రష్యన్ రైల్వేస్ సహకారంతో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టు వివరాలను రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపించాల్సి ఉంది' అని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేవు. వేరే ప్రాంతం గుండా విమానంలో వచ్చినా దాదాపు నాలుగు గంటల సమయంలో పడుతుంది.
ఈ విషయాన్ని తమకు అవకాశంగా రైల్వే శాఖ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న రైల్వే లైన్‌ను గంటకు 160-200కిలో మీటర్ల వేగంతో (సెమీ-హైస్పీడ్ కారిడార్) వెళ్లేందుకు అనువుగా రూపొందించడం ద్వారా మూడుగంటల్లో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం పూర్తి చేసేలా చూడొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే, హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య ప్రయాణం కాస్త.. హైదరాబాద్ - సూర్యాపేట మధ్య బస్సులో వెళ్లినంత సేపట్లో ముగించేయొచ్చు.