ఇంటి నుంచి కాలు బయట పెడితే విమానాలు ఎక్కడమే వారికి తెలుసు. రయ్యిమంటూ గాల్లో తేలిపోతూ గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు వారిలో కూడా మార్పు వస్తోంది. హాయిగా రాత్రిపూట రైలెక్కి బెర్త్ వాల్చితే ఉదయానికల్లా ఊరు చేరుకోవడంలో ఎంత సదుపాయముందో యూరప్ వాసులు గ్రహించారు. చుకు బుకు చుకు బుకు రైలును, అదిరిపోయే దాని స్టైలును, ఆ ప్రయాణంలోని మజాను ఆస్వాదిస్తున్నారు. విమాన ప్రయాణాలతో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి యూరప్‌లో పలు దేశాలు కూడా రైలు ప్రయాణాలకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో వారు కూడా తక్కువ దూరాలకు విమానానికి బదులుగా రైలు వైపే మొగ్గు చూపిస్తున్నారు...
యూరప్‌లో రైలు ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని డచ్ విమానయాన సంస్థ కేఎల్‌ఎమ్ వంటివి రైలు రవాణా నెట్‌వర్క్‌లో భాగస్వాములవుతున్నాయి. యూరోపియన్ కమిషన్ కూడా 2021ని ఇయర్ ఆఫ్ యూరోపియన్ రైల్‌గా ప్రకటించి రైలు ప్రయాణికులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పించింది. హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం, రైలు టికెట్ ధరల్ని తగ్గించడం వంటి చర్యలతో ఇప్పుడు చాలామంది రైలు జర్నీయే సో బెటరని అంటున్నారు. ముఖ్యంగా స్వల్ప దూర ప్రయాణాలకు రైళ్లల్లో వెళ్లడానికి యూరప్ పౌరుల్లో 62% మంది ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. 1990 తర్వాత మళ్లీ ఇప్పుడు రాత్రిళ్లు ప్రయాణించే స్లీపర్ రైళ్లకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు...
యూరప్‌లో విమాన ప్రయాణాల వల్ల వెలువడుతున్న కాలుష్యం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల 2013–2019 మధ్య ఏడాదికి సగటున 5% చొప్పున నమోదైంది! ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కేవలం స్వల్ప దూరాల విమానాలను మాత్రమే నిరుత్సాహపరుస్తూ అధిక దూరం ప్రయాణించే విమానాలకు ప్రోత్సాహకాలు కొనసాగించడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వచ్చే పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పెదవి విరుస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
వాటి కాలుష్యమే అధికం
ప్రపంచవ్యాప్తంగా అధిక దూరాలు ప్రయాణించే విమానాల నుంచి వెలువడే కాలుష్యమే ఎక్కువ! జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ జియోగ్రఫీ తాజా నివేదిక ప్రకారం 500 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాల యూరోపియన్ యూనియన్‌లో 27.9 % కాగా వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 5.9%. 4 వేల కి.మీ. కంటే అధిక దూరం వెళ్లే విమానాలు కేవలం 6.2% మాత్రమే. కానీ వాటినుంచి వెలువడే కాలుష్యం ఏకంగా 47 శాతం! అలాంటప్పుడు కేవలం తక్కువ దూరాలు ప్రయాణించే విమానాల రద్దుతో ఒరిగే ప్రయోజనాలేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.
రైల్వేలకున్న అడ్డంకులివే..!
కొన్ని దశాబ్దాలుగా విమాన ప్రయాణానికే అలవాటు పడడంతో చాలా మార్గాల్లో రైలు సదుపాయం లేదు. కొత్త ట్రాక్‌లు నిర్మించడం, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడం వంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. చాలా దేశాల్లో విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాలు ఎక్కువ ఖరీదు. అధిక చార్జీలు కూడా రైలు ప్రయాణానికి అడ్డంకిగా మారింది. యూరప్ రైలు ఆపరేటర్లకు లాభార్జనే ధ్యేయం. మార్కెట్ షేర్ కంటే అధిక లాభాలు ప్రజల నుంచి గుంజాలని చూస్తుంటాయి. ఇవన్నీ రైల్వేల విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయి.
ఫ్లైట్ షేమ్ ఉద్యమంతో దశ మారిన రైల్వే
యూరప్‌లో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గుచూపించడానికి ఫ్లైట్ షేమ్ ఉద్యమం ప్రధాన కారణం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వీడన్‌కు చెందిన టీనేజ్ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్ 2019లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్యసమితి పర్యావరణ సదస్సుకి హాజరవడానికి ఆమె విమాన ప్రయాణం చెయ్యకుండా అట్లాంటిక్ సముద్రంలో నౌకలో కొద్ది రోజుల పాటు ప్రయాణించి మరీ అమెరికా చేరుకున్నారు. విమానం నడపడానికి భారీగా చమురు ఖర్చు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని అందుకే విమానానికి బదులుగా పడవలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలని గ్రేటా థెన్‌బర్గ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ప్రభావంతో యూరప్ వాసులు విమానాలకి బదులుగా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.
యూరప్ దేశాలు తీసుకుంటున్న చర్యలివే...
► జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలన్నీ రైలు ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.
► తక్కువ దూరం ఉండే మార్గాల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. ఆయా మార్గాల్లో కొత్త రైళ్లను నడపడం ప్రారంభించింది.
► రెండున్నర గంటల కంటే తక్కువ సమయం పట్టే రెండు ఊళ్ల మధ్య రైళ్లలోనే ప్రయాణం చేయడం తప్పనిసరి చేసింది.
► దీని వల్ల దేశీయంగా విమానం ద్వారా వెలువడే గ్రీన్‌హౌస్ వాయువుల్ని 3% తగ్గించగలిగింది.
► 2020లో ఆస్ట్రియా ప్రభుత్వం రైలులో ప్రయాణిస్తే మూడు గంటల కంటే తక్కువ సమయం పట్టే అన్ని మార్గాల్లోనూ విమానాలను రద్దు చేసింది.
► ఆస్ట్రియాలో 350 కి.మీ. కంటే తక్కువ దూరం విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి 30 యూరోల పన్ను వసూలు చేస్తోంది.
► మరోవైపు 2050 నాటికి 2.5 గంటల కంటే తక్కువ సమయాల్లో వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడానికి స్పెయిన్ సన్నాహాలు చేస్తోంది.
కొత్త పోకడ...రైలెక్కి రయ్.. రయ్
Published Thu, Mar 9 2023 4:29 AM | Last Updated on Thu, Mar 9 2023 7:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment