ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు చొరవ చూపండి
గవర్నర్ నరసింహన్‌కు ప్రధాని మార్గదర్శనం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సమన్వయ పరచాలని, వివాదాస్పద అంశాలపై చర్చలే మార్గంగా పరిష్కరించుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు సూచించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన గవర్నర్ శుక్రవారం మధ్యాహ్నం రేసు కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీని కలిశారు. దాదాపు అరగంటసేపు ఈ భేటీ కొనసాగింది. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణమవుతున్న విద్యుత్, నీరు, సిబ్బంది పంపిణీ అంశాలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకునేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గవర్నర్‌కు మార్గదర్శనం చేశారు.
ఆయా అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని చర్చించుకునేలా చొరవ తీసుకోవాలని నరసింహన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదం సమసిన తీరును, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి వివిధ అంశాలపై చర్చించుకున్న తీరును గవర్నర్.. ప్రధానికి వివరించారు. కాగా రాష్ట్ర స్థాయి అధికారులు, సివిల్ సర్వీసెస్ అధికారుల విభజనను త్వరితగతిన పూర్తిచేసేలా చూస్తామని ప్రధానమంత్రి ఆయనతో చెప్పినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ సమగ్ర సర్వేపై వచ్చిన అపోహల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులు, వాస్తవాలను మోడీ.. గవర్నర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి రాజధాని పరిధిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, భయాందోళనలు నెలకొనకుండా తగిన జాగ్రత్త వహించాలని ఆయనీ సందర్భంగా నరసింహన్‌కు సూచించారు.