రెండు రాష్ట్రాల్లోనూ సమస్యలేమీ లేవు
ప్రధాని నరేంద్రమోదీకి అదే వివరించా: గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు ఎంతో బాగుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శుక్రవారమిక్కడ ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి వివ రించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ప్రధానిని కలిశాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయనకు వివరించా. అన్ని విషయాలు సావధానంగా విన్నారు. ఇది సాధారణ సమావేశమే’’ అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో సమస్యలేమీ లేవని ప్రధానికి వివరించినట్టు చెప్పారు. అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన ఆలస్యం కావడంతో రెండు రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి.. దీనిపై ప్రధానితో చర్చించారా అని విలేకరులు ప్రశ్నించగా... ‘ఈ విషయం సీఎస్‌లను అడగాలి’ అని సూచించారు.
ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించే అంశంపై స్పందిస్తూ.. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి ఢోకా లేదని వ్యాఖ్యానించారు. ‘ఇద్దరు సీఎంలు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎలాంటి సమస్యలు రావనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రినే అడగాలని సూచించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించినా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదేమైనా విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని స్పష్టంచేశారు. వృత్తి విద్యా కళాశాలలకు మాత్రమే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విభజన చట్టంలో ఉందన్నారు. ఎంసెట్ పరీక్షకు ఇంకా సమయం ఉన్నందున ఉమ్మడిగా నిర్వహించొచ్చని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.