సాక్షి, విశాఖపట్నం : దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.
ఆయనకు నేనంటే చాలా ఇష్టం...
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్‌బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పాలన పరమైన విషయాల్లో కిరణ్‌బేడి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేకంటే ఓ చౌకీదార్‌లా ఉండేందుకే ఆమె ఉత్సాహం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment