26న ప్రధాని పీఠంపై మోడీ | Narendra Modi appointed Prime Minister, swearing in on May 26 | Sakshi
Sakshi News home page

26న ప్రధాని పీఠంపై మోడీ

Published Wed, May 21 2014 1:21 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

26న ప్రధాని పీఠంపై మోడీ - Sakshi

26న ప్రధాని పీఠంపై మోడీ

దేశ 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం
రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో కార్యక్రమం; 3 వేల మందికి ఆహ్వానం
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును ప్రతిపాదించిన అద్వానీ; ఏకగ్రీవ ఆమోదం
ఎన్‌డీఏ పక్ష నేతగా కూడా మోడీ ఏకగ్రీవం

 
 సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ యవనికపై కొత్త చిత్రం ఆవిష్కృతం కానుంది. భారతదేశ నూతన ప్రధానమంత్రిగా మే 26, సోమవారం నాడు నరేంద్ర మోడీ(63) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో దేశ 14వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ‘మే 26 సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు’ అని మంగళవారం రాష్ట్రపతితో భేటీ అనంతరం నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధానిగా నియమిస్తూ రాష్ట్రపతి తనకందించిన లేఖను మీడియాకు చూపించారు. మోడీ ప్రచార నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి.. మొదటిసారి పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెసేతర పార్టీగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
 
 రాష్ట్రపతితో మోడీ భేటీ అనంతరం రాష్ట్రపతి భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘నరేంద్రమోడీని తమ పార్లమెంటరీ పక్ష నేతగా బీజేపీ ఎన్నుకున్నందువల్ల, ఆ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్నందువల్ల, మోడీని భారతదేశ ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. అలాగే, మంత్రివర్గ సహచరుల పేర్లను సూచించాల్సిందిగా మోడీని కోరారు’ అని అందులో పేర్కొన్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యుల సంఖ్య 336గా ఉన్నప్పటికీ ప్రధానిగా మోడీ నియామకానికి సంబంధించి బీజేపీ మెజార్టీనే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. బీజేపీ ఎంపీల సంఖ్య 282 ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 272 కన్నా పది ఎక్కువగా ఉంది. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పక్ష నేతగా మోడీని పార్టీ ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు.
 
 ఆ తరువాత 29 పార్టీల సంకీర్ణం ‘నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్(ఎన్‌డీఏ)’ కూడా మోడీని  నాయకుడిగా ఎన్నుకుంది. అనంతరం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీల నేతృత్వంలో ఎన్‌డీఏ సంకీర్ణ పక్ష నేతలు రాష్ట్రపతిని కలిసి.. బీజేపీ, ఎన్‌డీఏలు నరేంద్రమోడీని తమ నేతగా ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు. మోడీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించాల ని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల రాజ్‌నాథ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 335 మంది ఎంపీలున్న 10 ఎన్‌డీఏ పక్ష పార్టీల మద్దతు లేఖలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3,000 మందిని ఆహ్వానించాలనుకుంటున్నామని తెలిపారు. అనంతరం మోడీ రాష్ట్రపతి ప్రణబ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ విజయాన్ని సాధించిన మోడీని ప్రణబ్  స్వాగతించి అభినందించారు. మోడీ పుష్పగుచ్ఛాన్ని రాష్ట్రపతికి అందజేయగా, ప్రతిగా రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని మోడీకి అందజేసి అభినందనలు తెలిపారు.
 
 మోడీ పేరును ప్రతిపాదించిన అద్వానీ
 దేశ రాజధానిలో మంగళవారం ఉదయం నుంచి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై పలు కీలక సమావేశాలు జరిగాయి. గుజరాత్ భవన్ నుంచి ఉదయం 11.45 గంటలకు బయలుదేరిన మోడీ 12 గంటల సమయంలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు.  తొలిసారిగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు వచ్చిన మోడీకి పార్టీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ పక్ష సమావేశం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత పేరును ప్రతిపాదించే బాధ్యతను  ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాజ్‌నాథ్.. అద్వానీకి అప్పగించారు. ఎన్నికల ప్రచార సారథిగా, ప్రధాని అభ్యర్థిగా మోడీని పార్టీ ఎన్నికల కన్నా ముందే ప్రకటించిందని, అదే నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని చెబుతూ అద్వానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ప్రతిపాదించారు.
 
 భారత్‌మాతాకీ జై
 అనంతరం, అద్వానీ ప్రతిపాదనకు మురళీ మనోహర్ జోషీ, వెంకయ్యనాయుడు,  గడ్కారీ, సుష్మ, అరుణ్ జైట్లీ తదితరులు ఆమోదం తెలిపారు. సభ్యులు కూడా మోడీని ప్రధానిగా సమర్థిస్తూ అంతా నిల్చొని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును అద్వానీ ప్రతిపాదించారు. సీనియర్ నేతలతో సహా పార్టీ పార్లమెంటరీ పార్టీ మొత్తం మద్దతు తెలిపింది(మధ్యలో మోడీ కలుగచేసుకుని అందరినీ అడగండి అని రాజ్‌నాథ్‌కు సూచించగా.. రాజ్‌నాథ్ నవ్వుతూ ‘నేను అందరి చేతులను చూస్తున్నా. అందరూ చప్పట్లు కొడుతున్నారు’ అని  సమాధానమిచ్చారు).
 
  ఏకగ్రీవ తీర్మానం మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని పేరును ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు.  మోడీకి పుష్పగుచ్ఛాలు అందించి రాజ్‌నాథ్, అద్వానీలు అభినందించారు. పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీని అభినందించారు. కొత్త ఎంపీలు తమ స్థానాల్లో బల్లలను చరుస్తూ,  నిల్చొని మోడీని అభినందించారు. భారత్‌మాతా కీ జై అనే నినాదాలతో సెంట్రల్ హాల్ హోరెత్తింది. బీజేపీ ఎంపీలు 282 మందితో పాటు ఇతర నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
 
 మోడీనే మా నాయకుడు: ఎన్‌డీఏ
 బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 29 పార్టీల ఎన్‌డీఏ సమావేశం జరిగింది. ఎన్‌డీఏ చైర్మన్ అద్వానీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కూటమి నేతగా ఎన్నుకున్న మోడీని మిత్రపక్షాల నేతలు అభినందించారు. రాజ్‌నాథ్ ఎన్‌డీఏ పక్షాల పేర్లను చదువుతూ మోడీకి, సభ్యులకు పరిచయం చేశారు. టీడీపీ చీఫ్  చంద్రబాబు,  డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్‌లను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ‘విజయ్‌కాంత్ సతీమణి ఎక్కడ? ఆమెను పరిచయం చేయాలి. ఎన్నికల్లో కష్టపడ్డార ’ంటూ మోడీ ఆమెను సభికులకు పరిచయం చేశారు. పవన్ కల్యాణ్ కూడా మోడీని కలిశారు. మోడీ నేతృత్వంలో దేశం ప్రగతిపథంలో పయనిస్తుందన్న నమ్మకం ఉందని ఎన్‌డీఏ పక్ష నేతలు అన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. ‘బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఒకవేళ పూర్తి మెజారిటీ రాకపోతే ఎన్‌డీఏ మిత్రపక్షాలు ఎంత ముఖ్యమో.. ఇప్పుడూ అంతే ముఖ్యమైనవి. ఈ ప్రభుత్వం మీది. దీన్ని సమష్టిగా నడిపించాలి’ అన్నారు. ఏపీలో విజయం సాధించిన చంద్రబాబును మోడీ ప్రత్యేకంగా అభినందించారు. సీమాంధ్రలో బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు తెలుపుతున్నామన్నారు.
 
మిత్రపక్ష నేతల ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు..
 ‘మోడీ నేతృత్వంలో ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల సరసన భారత్ చేరుతుంది. ఎంతోమంది నాయకులను చూశాను.  కానీ మోడీలో ఉన్న పట్టుదల, పని పూర్తి చేయాలన్న ఉత్సాహం అద్భుతం. మోడీలో అసాధారణ శక్తిసామర్థ్యాలు ఉన్నాయి.  2019లోనూ.. ఆ తరువాత అనేక పర్యాయాలు కూడా మోడీనే ప్రధాని అవుతారన్న నమ్మకం నాకుంది. అదే మా ఆశ.. ఆకాంక్ష’
- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
 ‘బీజేపీ నేతృత్వంలో 25 ఏళ్లుగా పోరాడుతూ వచ్చాం. ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి’     
 - శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే
 ‘మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్లే ఎన్‌డీఏకు అత్యధిక స్థానాలు లభించడమనే అద్భుతం జరగింది’
 - లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్‌పాశ్వాన్
 ‘బీజేపీ, అకాలీదళ్‌లు పాత మిత్రులు. మా అనుబంధం ‘కిచిడీ’ లాంటిది’         
 - అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్
 
 కాషాయ రెపరెపలు
 పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాషాయం రంగే ప్రముఖంగా కనిపించింది. బీజేపీకి, హిందూ మతానికి సంబంధించిన రంగుగా కాషాయాన్ని గుర్తిస్తారు. కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యులు చాలామంది కాషాయరంగు కుర్తాలు, స్కార్ఫ్‌లు, జాకెట్లు ధరించి సమావేశానికి హాజరయ్యారు. మహిళా సభ్యులు పలువురు కాషాయ వర్ణపు చీరలు ధరించారు.
 
 రాష్ట్రపతిభవన్ ఆవరణలో ప్రమాణం
 సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో ప్రమాణ స్వీకారం నిర్వహిస్తుంటారు.  500 మందికన్నా మంది అతిథులను ఆహ్వానిస్తే అక్కడ కార్యక్రమం నిర్వహించడం కుదరదు. మోడీ ప్రమాణానికి 3,000 మందిని ఆహ్వానించాలనుకుంటున్నారు. కాబట్టి అంతమంది  సౌకర్యంగా కూర్చోవడానికి రాష్ట్రపతి భవన్ ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని మోడీ భావన. మోడీ కన్నా ముందు ఈ ప్రాంగణంలో వాజ్‌పేయి, చంద్రశేఖర్‌లు ప్రమాణం చేశారు.
 
 మారిన పీఎంవో ‘ట్విట్టర్’ హ్యాండిల్
  మోడీ కొద్దిరోజుల్లో ప్రధాని కానుండగా, ప్రధాని కార్యాలయం మంగళవారం తన ‘ట్విట్టర్’ హ్యాండిల్‌ను మార్చుకుంది. మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో ఉండగా ప్రారంభించిన ట్విట్టర్ హ్యాండిల్ ‘పీఎంవో ఇండియా’@P MOIndiaను ‘పీఎంవో ఇండియా ఆర్కైవ్స్’ @PMOIndiaArchive గా మార్చుకుంది. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలనలోను, ప్రభుత్వ ఆస్తులలోను కొనసాగింపు భారత రాజ్యాంగ లక్షణమన్నారు. ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ఖాతా జాతీయ ఆస్తి అని, ప్రధాని కార్యాలయం నుంచి వైదొలగుతున్న బృందం దానిని మార్చడం అనైతికం, అమర్యాదకరం, చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement