న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కారణంగానే రాజ్యసభలో విలువైన సమయం వృ«థా అవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇది ఆందోళనకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ ఎంపీలను ఈ విషయమై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సభా సమయం వృథా కావడంపై నిలదీయాలని సూచించారు. తద్వారా జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలపై ఒత్తిడి తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్–2019’లో మాట్లాడిన మోదీ.. పలువురు యువతీయువకులకు అవార్డులను అందజేశారు.
మెజారిటీ వల్లే సాధ్యమైంది
పార్లమెంటులో విలువైన చర్చా సమయం దుర్వినియోగం కావడంపై మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న 16వ లోక్‌సభలో ఉత్పాదకత 85 శాతంగా ఉంది. గత లోక్‌సభ సమావేశాల కంటే ఇది 20 శాతం అధికం. ఈ లోక్‌సభ సమావేశాల సందర్భంగా 205 బిల్లులను ఆమోదించాం. ఇదంతా సభలో పూర్తి మెజారిటీ ఉన్నందువల్లే సాధ్యమైంది. అదే ఇటీవల జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేవలం 8 శాతం ఉత్పాదకత మాత్రమే నమోదైంది’అని తెలిపారు.
చర్చలతోనే ప్రజాస్వామ్యం పటిష్టం
యూత్ ఫెస్టివల్‌లో యువతీయువకులకు అవార్డులు అందించిన అనంతరం ప్రధాని స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం నవభారతాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్ అభివృద్ధి, సమాజ నిర్మాణం లో మరింత కీలకపాత్ర పోషించేలా చొరవ తీసుకోవాలని యువతను కోరుతున్నా. ఇప్పటి యువతకు కొత్త ఆలోచనలు, సరికొత్త ఉత్సాహంతో పాటు మల్టీటాస్కింగ్‌కు సిద్ధంగా ఉంది. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ద్వారా యువతీయువకులు తమ శక్తిని సరైన దిశలో కేంద్రీకృతం చేసేందుకు వీలవుతుంది. చర్చలే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తాయి. పార్లమెంటుకు ఎన్నికవ్వాలనుకునే వ్యక్తులకు ఈ వేదిక ఉపకరిస్తుంది. ఇకపై పార్లమెంటుకు రావాలనుకునే వ్యక్తులు ఎవరైనా తొలుత యూత్ పార్లమెంటుకు హాజరవ్వాలనుకోవాలి. ఈ విషయాన్ని తమ ప్రొఫైల్‌లో పెట్టుకోవాలి’అని వ్యాఖ్యానించారు.
10 శాతం రిజర్వేషన్ అందుకే ఇచ్చాం
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం పై మాట్లాడుతూ.. ‘యువతకు సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఎన్డీయే ప్రభు త్వం 10 శాతం రిజర్వేషన్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల నిజంగా నైపుణ్యవంతులైన యువతీయువకులు తమ కలల ను నెరవేర్చుకోవడం వీలవుతుంది. యూత్ ఫెస్టి వల్‌కు హాజరై న యువతను ఈ సందర్భం గా ఒక్కటే కోరుతున్నా.. మీ స్వస్థలాలకు వెళ్లాక కార్యక్రమా లు నిర్వహించి స్థానిక రాజ్య సభ ఎంపీలను ఆహ్వానించండి. రాజ్యసభలో విలువైన సమయం దుర్వినియోగంపై ప్రశ్నించండి. తద్వారా జాతీ య స్థాయిలో ఈ విషయ మై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ఢిల్లీలోని జాతీ య యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకాన్ని సందర్శించాల్సిందిగా కోరుతున్నా’అని పేర్కొన్నారు.
‘ఖేలో ఇండియా’యాప్ ఆవిష్కరణ..
యూత్ పార్లమెంట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఖేలో ఇండియా యాప్‌ను ఆవిష్కరించారు. భారత క్రీడా ప్రాధికార సం స్థ(సాయ్) దీన్ని అభివృద్ధి చేసినట్లు మోదీ తెలిపారు. ఈ యాప్ ద్వారా దేశం లోని క్రీడా ప్రాంగణాలు, వాటిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, క్రీడల నిబంధనలు, ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. యువతీయువకులందరూ ఓటు కోసం తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ సూచించారు.
అర్ధంతరంగా వెనుదిరిగిన మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం జరిగిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్–2019’కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ భారత గగనతలాన్ని ఉల్లంఘించిన విషయాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంవో)కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఓ కాగితంపై మోదీకి అందించారు. దాన్ని చూసిన మోదీ వేదిక మధ్యలోకి వచ్చి సభికులకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి హుటాహుటిన తన కార్యాలయానికి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment