పంచెకట్టులో ఆకట్టుకున్న మోడీ
రజనీతో మోడీ భేటీ
చెన్నైలో రజనీ ఇంటికి వెళ్లి అరగంటపాటు సమావేశం
పంచెకట్టులో ఆకట్టుకున్న మోడీ
తమ భేటీ మర్యాదపూర్వకమేనన్న సూపర్ స్టార్
సాక్షి, చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తమిళుల సంప్రదాయ పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకట్టుకున్న మోడీని రజనీకాంత్ సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు. సుమారు 30 నిమిషాలపాటు వారిద్దరూ సమావేశమయ్యారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన బీజేపీ నేతృత్వంలోని ఆరు పార్టీల కూటమి తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన సందర్భంగా రజనీని మోడీ కలుసుకున్నారు. భేటీ అనంతరం మోడీతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ వెలుపలకు వచ్చిన రజనీ మీడియాతో మాట్లాడుతూ తమ భేటీ మర్యాదపూర్వకమేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీ స్పష్టం చేశారు. గతంలో తాను ఆస్పత్రిపాలైనప్పుడు మోడీ తనను పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. చెన్నై వచ్చినప్పుడు తన ఇంటికి తేనీరు సేవించేందుకు రావాల్సిందిగా ఆహ్వానించానని, ఆ ఆహ్వానం మేరకే మోడీ తన ఇంటికి వచ్చారన్నారు.
మోడీ పాలనాదక్షుడు...ఆయన కోరిక నెరవేరాలి
‘‘మోడీ సమర్థ పాలనాదక్షుడు, దృఢ నాయకుడని అందరికీ తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషి. ఆయన నా శ్రేయోభిలాషి. ఆయనకు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. దేవుడు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆయన ఎప్పుడు, ఏం జరగాలనుకుంటున్నారో అది జరగాలని కోరుకుంటున్నా’’ అని పరోక్షంగా ప్రధాని కావాలనే మోడీ కోరిక నెరవేరాలని రజనీ ఆకాంక్షించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని, తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని రజనీకి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. రజనీతో దిగిన ఫొటోను మోడీ ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. కాగా, అనంతరం చెన్నైలోని మీనంబాక్కంలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ అన్నాడీఎంకే, డీఎంకే లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పరస్పరం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ప్రజలను విస్మరిస్తున్నాయని దుయ్యబట్టారు. రీ కౌంటింగ్ మంత్రి ఓటమి భయంతోనే ఈసారి ఎన్నికల నుంచి తప్పుకున్నారంటూ కేంద్ర మంత్రి చిదంబరాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.