మురికి చేసి పెట్టారు!
యూపీఏపై మోదీ ధ్వజం
కెనడాలో కాంగ్రెస్‌పై విమర్శలు
దేశాన్ని శుభ్రం చేయాల్సి ఉంది
‘స్కామ్ ఇండియా’ను
‘స్కిల్డ్ ఇండియా’గా మార్చాలి
టొరంటో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విదేశీ గడ్డపైనా కాంగ్రెస్‌ను వదల్లేదు. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ పాలనను కెనడాలోనూ ఎండగట్టారు. ‘దేశాన్ని ఎంత మురికి చేయాలో అంత చేసి వెళ్లిపోయారు. ఇప్పుడిక నేను దాన్ని శుభ్రం చేయాలి’ అంటూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. కెనడాలోని టొరంటోలో గురువారం భారీగా హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో మోదీతో పాటు కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ దంపతులు కూడా హాజరయ్యారు. హార్పర్ భార్య ముదురు నీలంరంగు చీర ధరించి రావడం విశేషం.
ఖేం చొ?: ‘ఖేం చొ(గుజరాతీలో ఎలా ఉన్నారు?)’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీకి సభికుల నుంచి భారీగా స్పందన లభించింది. ‘భారత్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది.. ఆ సమస్యలకు ఒకటే పరిష్కారం.. ఒకటే మందు’ అని మోదీ అనగానే.. ‘మోదీ.. మోదీ’ అంటూ సభికులు కేకలు ప్రారంభించారు. ‘ఆ పరిష్కారం మోదీ కాదు.. అభివృద్ధి. ప్రగతి మాత్రమే భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలదు’ అని సమాధానమిచ్చారు. అమెరికాలోని మేడిసన్ స్క్వేర్ కార్యక్రమాన్ని గుర్తుకుతెచ్చేలా భారీగా హాజరైన సభికులు మోదీ మాటలకు హర్షాతిరేకాలతో స్పందించారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ.. ‘దేశంలో మురికి పేరుకుపోయింది. దాన్నంతా శుభ్రం చేయాలి. స్కామ్ ఇండియాగా పేరుగాంచిన భారత్‌ను నైపుణ్య భారత్(స్కిల్డ్ ఇండియా)గా మార్చాల్సి ఉంది’ అన్నారు. ‘కిత్నా బదల్‌గయా ఇన్సాన్’ అనే బాలీవుడ్ పాటను ఉటంకిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల ఆలోచనల్లో మార్పొచ్చిందని, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పగలిగామని చెప్పారు. ‘ఈ విమానాలయు గంలో భారత్ నుంచి కెనడా రావడానికి 15-20 గంటలు పడ్తుంది. అయినా 42ఏళ్లుగా ఒక్క ప్రధానీ కెనడా పర్యటనకు రాలేదు’ అన్నారు. మోదీ పర్యటన చరిత్రాత్మకమని హార్పర్ పేర్కొన్నారు.
దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నారు: కాంగ్రెస్
కెనడాలో మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. విదేశాల్లో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, అవి ప్రధాని స్థాయికి తగ్గట్లుగా అవి లేవని విమర్శించింది. ఎన్నికల ప్రచార హ్యాంగోవర్ నుంచి మోదీ ఇంకా బయటపడినట్లు లేదని గురువారం కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. దేశాన్ని విదేశాల్లో నవ్వులపాలు చేస్తున్నారని మరో అధికార ప్రతినిధి సంజయ్ ఝా ఆక్షేపించారు. ‘మోదీ వ్యాఖ్యలు అమర్యాదకరంగా, వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని మరో నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
‘కనిష్క’ మృతులకు నివాళి
1985లో కనిష్క విమానాన్ని పేల్చివేసిన ఘటనలో మృతిచెందిన 329 మందికి మోదీ, స్టీఫెన్ హార్పర్ నివాళులర్పించారు. టొరంటోలోని హంబర్ బే పార్క్‌లోని ఎయిర్ ఇండియా స్మారక కేంద్రం వద్ద మృతుల బంధువులు పలువురితో మాట్లాడారు. అనంతరం మోదీ వాంకూవర్ వెళ్లారు.
మోదీకి కెనడా కోర్టు సమన్లు!
న్యూయార్క్: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి కెనడా లోని ఒంటారియో కోర్టు సమన్లు జారీ చేసిందని, అయితే ఆ ఉత్తర్వులను కెనడా అటార్నీ జనరల్ నిలిపేశారని గురువారం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే)’ సంస్థ ఆరోపించింది. విదేశాల్లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి.. కెనడాకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని విచారించడానికి అవకాశం కల్పించే చట్టం ఒకటి కెనడాలో అమల్లో ఉంది.