గుజరాతీలంటే ‘గాంధీ’లకు పడదు! | Narendra Modi says Gujaratis an eyesore for Congress, Gandhi family | Sakshi
Sakshi News home page

గుజరాతీలంటే ‘గాంధీ’లకు పడదు!

Published Tue, Oct 17 2017 1:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Narendra Modi says Gujaratis an eyesore for Congress, Gandhi family  - Sakshi

గాంధీనగర్‌:  కాంగ్రెస్, నెహ్రూ–గాంధీ కుటుం బంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ.. గుజరాత్‌ అన్నా, గుజరాత్‌ ప్రజలన్నా వారికి ఇష్టం లేదని, కంటగింపుగా చూసేవారని విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జాతీయ నేతలు వల్లభాయ్‌ పటేల్, మొరార్జీ దేశాయ్‌లను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం వారిని నిర్లక్ష్యం చేసిందని మోదీ తప్పుపట్టారు. గుజరాత్‌ గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తనను జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేసిందని పేర్కొన్న ప్రధాని.. గోధ్రా అల్లర్ల అనంతరం తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణల్ని ఉదహరించారు. గుజరాత్‌ ఎన్నికలకు శంఖారావం పూరిస్తూ అభివృద్ధే ప్రచారాస్త్రంగా పోటీచేయాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. గుజరాత్‌ ఎన్నికలు అభివృద్ధికి, వారసత్వానికి మధ్య జరుగుతున్న పోరుగా మోదీ పోల్చారు.  

ఎప్పుడూ అసూయతోనే చూసేవారు
‘గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీకి అభివృద్ధి జ్వరం పట్టుకుంది. గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌ను ఎప్పుడూ అసూయతోనే చూసేవి. సర్దార్‌ పటేల్, మొరార్జీ దేశాయ్‌ల విషయంలో వారేం చేశారో నేను మళ్లీ చెప్పను. మొరార్జీ దేశాయ్‌ కృషి, అంకిత భావం, నిబద్ధత గురించి వారు మాట్లాడరు. దానికి బదులు ఆయనేం తిన్నాడో, తాగాడో అన్న విషయాల్ని ప్రస్తావిస్తారు’ అని ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధే విజయం సాధిస్తుంది.. వారసత్వ రాజకీయాలకు ఓటమి తప్పదని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీసారి ఎన్నికల్లో మతతత్వం, కులతత్వం అంశాల్ని తెరపైకి తీసుకొస్తున్నారని.. అభివృద్ధి అంశంపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్నటికీ ధైర్యం లేదని ధ్వజమెత్తారు.  

నన్ను జైల్లో పెట్టేందుకు కుట్ర చేశారు
తనపై విమర్శల దాడి చేసేందుకు కాంగ్రెస్‌ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని ప్రధాని విమర్శించారు. ‘నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నన్ను జైల్లో పెట్టేందుకు కుట్ర చేసింది. అమిత్‌ షాను జైలుకు పంపితే గానీ అది సాధ్యం కాదని వారికి తెలుసు. ఆ పనిని కూడా చేశారు’ అని పేర్కొన్నారు.  ఒకవేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి బాగుంటే .. ఎన్నికలకు ముందు 25 శాతం ఎమ్మెల్యేలు ఎందుకు ఆ పార్టీ వదిలి వెళ్లారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ను అవినీతికి మారుపేరుగా ఆయన అభివర్ణించారు.  ‘దేశానికి ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రుల్ని అందించిన కాంగ్రెస్‌ ప్రస్తుతం అసత్యాల్ని ప్రచారం చేయడంపై దృష్టి పెట్టింది. దేశంలో నిరాశావాద వాతావరణాన్ని సృష్టిస్తోంది. సానుకూల ఆలోచనా సామర్థ్యాన్ని ప్రతిపక్షం కోల్పోయింది. ఆ పార్టీ ప్రస్తుత దుస్థితికి అదే కారణం’ అని మోదీ తప్పుపట్టారు. బీజేపీని దళిత, ఆదీవాసీ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్‌ చిత్రీకరించే ప్రయత్నం చేసిందని, అయితే ఎక్కువ మంది దళిత, ఆదివాసీ ఎంపీలు బీజేపీలోనే ఉన్నారని చెప్పారు.   

జీఎస్టీలో కాంగ్రెస్‌కూ పాత్ర
జీఎస్టీని సమర్థిస్తూ.. ‘సంస్కరణల అమలు నిర్ణయాన్ని నేనొక్కడినే తీసుకోలేదు. దాదాపు 30 పార్టీల్ని సంప్రదించాం. ఈ కొత్త పన్ను విధానం అమలులో ఆ పార్టీల పాత్ర కూడ ఉంది. జీఎస్టీ నిర్ణయాల్లో కాంగ్రెస్‌కు సమాన భాగస్వామ్యం ఉంది. జీఎస్టీ మీద వాళ్లు అసత్యాల్ని ప్రచారం చేయకూడదు’ అని చెప్పారు. రూ. 50 వేల కోట్లతో కాంగ్రెస్‌ హయాం నాటి 90 సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నామని, అలాగే రూ. 12 లక్షల కోట్ల విలువైన పెండింగ్‌ అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని మోదీ వెల్లడించారు.  

గుజరాత్‌పై వరాల జల్లు: ట్విటర్‌లో రాహుల్‌ వెదర్‌ రిపోర్ట్‌  
ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటనపై రాహుల్‌ గాంధీ ట్వీటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోదీ ప్రజలపై వరాల వర్షం కురిపించనున్నారనే అర్థంలో... ‘వెదర్‌ రిపోర్ట్‌ : గుజరాత్‌ ఎన్నికల వేళ.. నేడు ఆ రాష్ట్రంపై తన వాక్చా తుర్యంతో వరాల జల్లు కురిపిస్తారు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న వేళ.. దాదాపు రూ. 12,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆ రాష్ట్రానికి దక్కాయి’ అంటూ ఒక నివేదికను కూడా ట్వీట్‌కు జతచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement