మోదీతో పాటు ఎవరు వెళ్లారు?
సాధారణంగా ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని తమ ప్రచారానికి వాడుకోవడం నాయకులకు అలవాటు. పర్యటనలకు వెళ్లేటప్పుడు వెంట మీడియా ప్రతినిధులను అందుకే తీసుకెళ్తారు. కానీ, ప్రధాని నరేంద్రమోదీ మాత్రం సాధారణ నాయకుల కంటే భిన్నంగా ప్రవర్తించారు. కేరళలోని కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించి వందకు పైగా మరణించడంతో అక్కడకు ఆయన వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బయల్దేరేటపుడు ఆయన తనతో పాటు మీడియా బృందాన్ని కాకుండా.. రాజధానిలోని మూడు పెద్ద ఆస్పత్రుల నుంచి వైద్య నిపుణులను అక్కడకు తీసుకెళ్లారు. ఎయిమ్స్, రాం మనోహర్ లోహియా, సఫ్దర్ జంగ్ ఆస్పత్రుల నుంచి ఈ వైద్యులు వెళ్లారు.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా నేతృత్వంలోని ఈ బృందం అత్యవసర మందులు కూడా తీసుకుని మోదీతో పాటు అదే విమానంలో కొల్లాం వెళ్లింది. వీరిలో సఫ్దర్ జంగ్ ఆస్పత్రి నుంచి 10 మంది, ఎయిమ్స్ నుంచి 11 మంది, ఆర్ఎంఎల్ ఆస్పత్రి నుంచి ఐదుగురు ప్రత్యేక నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. కాలిన గాయాలకు చికిత్స అందించే నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్లు, బర్న్స్ సర్జన్లు, సాంకేతిక నిపుణులు, అనెస్థటిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఈ బృందంలో ఉన్నారు. అత్యవసర మందులు, ఆయింట్‌మెంట్లను కూడా తీసుకెళ్లి, అప్పటికే కొల్లాంలో ఉన్న వైద్య నిపుణులకు సాయంగా అక్కడే మకాం చేశారు.