‘డిజిటల్’తో పేదల చెంతకు వైద్యం
* వైద్య రంగంలోఎఫ్‌డీఐలు రావాలి
* హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ
ముంబై: పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను సమర్థంగా వినియోగించుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా కంపెనీలు భారత్‌కు రావాలని, అత్యుత్తమ వైద్య సేవలకు ఉపయోగపడే ఖరీదైన పరికరాలను ఇక్కడ తయారు చేసి తక్కువ ధరకు అందించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం వైద్య రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రావాలన్నారు. కొత్తగా పునరుద్ధరించిన హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టెలీమెడిసిన్ మాధ్యమం ద్వారా ఇటువంటి ఆస్పత్రులు వైద్య సలహాలు అందించగలిగితే..మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా మెరుగైన వైద్య సేవలు లభించగలవని మోదీ చెప్పారు. ఈ విధంగా వైద్యం, విద్య రంగాలను మెరుగుపర్చేందుకు డిజిటల్ ఇండియా నినాదం తోడ్పడగలదన్నారు. శుచి, శుభ్రతల ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ఆరోగ్య సంరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. తల్లి, శిశు మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం వందల మంది తల్లులు, పిల్లలు ప్రాథమిక చికిత్స అందక కన్నుమూస్తున్న సంగతి చాలా మందికి తెలియదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.