
న్యూఢిల్లీ: అన్ని మంత్రిత్వ శాఖలు వచ్చే అయిదేళ్లలో ప్రజాభీష్టం మేరకు వారి జీవితాలను మెరుగుపరిచే ప్రభావవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం ఆయన అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభావశీల ప్రణాళికతో ముందుకు వస్తే వందరోజుల్లోనే అమలయ్యేలా అనుమతులు మంజూరు చేస్తాం’ అని ప్రధాని అధికారులను కోరారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశంలో పని చేయగలిగే వారి సంఖ్య ఎక్కువగా మంది ఉన్నందున వారిని సమర్థంగా వాడుకోవాలి.
కేంద్రంలోని ప్రతి శాఖ, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చేందుకు కీలకమైనవి. ఎంతో కీలకమైన ‘భారత్‌లో తయారీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చిన్న వ్యాపారాలు, సంస్థల విషయంలో సులభతర వాణిజ్య విధానం ప్రతిఫలించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు పరిపాలనపరమైన నిర్ణయాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్యం, పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాల్లో కొన్ని సూచనలు, సలహాలు చేశారు. 2014లోనూ ఇఏదేవిధంగా కార్యదర్శుల స్థాయి అధికారులతో మోదీ సమావేశమ య్యారు.
మోదీ విమానానికి పాక్ ఓకే
కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో జూన్ 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తికి పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ వెళ్లేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. కాగా, జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన విజ్ఞప్తికి మోదీ అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని బియర్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకూ జరిగే 45వ జీ7 సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించారు.