ఇక టుస్సాడ్స్ లో మోదీ మైనపు బొమ్మ
న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, రాయల్ కుటుంబీకుల సరసన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే చేరబోతున్నారు. ఆయన మైనపు విగ్రహాలను ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం రూపొందిస్తోంది. ఆ విగ్రహాలను లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాగ్ బ్రాంచిల్లో ఏర్పాటు చేయనుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాల్లో బ్రాంచ్ మ్యూజియమ్స్ ఉన్న విషయం తెల్సిందే.
ప్రజలకు నమస్కరిస్తున్నట్టు ఉండే నరేంద్ర మోదీ మైనపు విగ్రహాలను రూపొందించేందుకు మోది ఇట్లో ఇప్పటికే పలు సిట్టింగ్‌లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మ్యూజియం వర్గాలు వివిధ భంగిమల్లో మోదీ కొలతలను తీసుకున్నారు. మ్యూజియంలో ఇప్పటికే ఉన్న పలువురు ప్రముఖ నేతల సరసన తన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను తగునా అని కూడా తమతో మోదీ సందేహం వ్యక్తం చేశారని మ్యూజియం వర్గాలు తెలిపాయి. ‘ప్రజల మనోభావాల మేరకు మీరీ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు కనుక నాకు అభ్యంతరం లేదు’ అని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారట.
తాను మూడు, నాలుగు సార్లు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను సందర్శించానని, వృత్తి పట్ల అంకిత భావం, కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని కూడా మోదీ మ్యూజియం వర్గాలతో వ్యాఖ్యానించారట. మోదీ తన సహజసిద్ధ శైలిలో అంటే క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ ధరించి నమస్కరిస్తున్నట్లుగా ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విషయంలో మోదీ సిట్టింగ్స్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
భారత్‌కు చెందిన జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొన్న విషయం తెల్సిందే.