జపాన్ భాష ట్వీట్స్ తో ఆకట్టుకున్న ప్రధాని!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఆసరాతో ప్రజలందరికి ప్రధాని నరేంద్రమోడీ అందరికి అందుబాటులోకి ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ను ఆసరాగా చేసుకుని జపాన్ ప్రజలతో చేరువయ్యారు. గురువారం ట్విటర్ లో మోడీ జపాన్ భాషలో ట్వీట్స్ చేశారు. జపాన్ లోని తన మిత్రుల కోరిక మేరకు.. ఆదేశ ప్రజలకు చేరువయ్యేందుకే ట్విటర్ లో జపాన్ భాషలో ట్వీట్ చేశానని ప్రధాని మోడీ తెలిపారు. ఆగస్టు 30 తేది నుంచి సెప్టెంబర్ 3 తేది వరకు మోడీ జపాన్ లో పర్యటించనున్న నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు తన పర్యటన దోహద పడుతుందనే విషయాన్ని తెలుపడానికి తనకు సంతోషంగా ఉంది. షింజో అబే నాయకత్వం పట్ట ఎంతో గౌరవం ఉంది. ముఖ్యంగా అబేను కలువడానికి ఉత్సాహంగా ఉన్నాను అని మోడీ ట్వీట్ చేశారు. తన మిత్రులు జపాన్ భాషలో ట్వీట్ చేయాలని కోరారు. ట్రాన్స్ లేషన్ కు సహకరించిన నా మిత్రులకు ధన్యవాదాలు అంటూ మరో ట్విట్ చేశారు.