* 30 నుంచి జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని ఉత్సాహం
* జపనీయుల మనసు దోచుకునే యత్నం
న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ.. గురువారం జపనీస్ భాషలో పలు ట్వీట్లు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో తన గత పర్యటనను గుర్తు చేసుకుంటూ మలి పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ శనివారం(30న) నాడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఆయన ప్రధాని అయిన తర్వాత భారత ఉపఖండం దాటి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జపాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్లు చేశారు. ‘జపాన్ ప్రజలతో నేరుగా జపనీస్‌లో మాట్లాడాలని అక్కడి నా మిత్రులు కోరారు.అనువాదం చేయడానికి సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు. జపాన్ ప్రజల సృజనాత్మకత, కచ్చితత్వం అద్భుతం. ప్రధాని షింజో అబేని కలిసేందుకు ఉద్వేగంగా ఉన్నాను’ అని ‘పీఎంవో ఇండియా’ఖాతా ద్వారా మోడీ జపనీస్‌లో ట్వీట్ చేశారు.
కీలక ఒప్పందాలకు రంగం సిద్ధం: ఈ పర్యటనలో భాగంగా రక్షణ, అణు ఇంధనం, మౌలిక వసతుల కల్పన, ఖనిజ వనరులతో పాటు వాణిజ్యంపై ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఏటా రెండు వేల టన్నులకుపైగా అరుదైన ఖనిజాలను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు జపాన్ సిద్ధంగా ఉంది. ఇది ఆ దేశం వినియోగించే ఖనిజ సంపదలో 15 శాతం కావడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్లు, కారు బ్యాటరీలు, టర్బైన్లు తదితరాల తయారీలో 18 రకాల అరుదైన ఖనిజాలు కీలకం.
ఈ ఒప్పందం దాదాపు ఖరారైందని, మోడీ పర్యటనతో జపాన్‌తో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నెల 30న మోడీ నేరుగా జపాన్‌లోని స్మార్ట్ సిటీ క్యోటోకు వెళ్లనున్నారు. ఆయన్ను స్వాగతించేందుకు ఆ దేశ ప్రధాని షింజో అబే కూడా క్యోటోకి రానున్నారు. భారత్‌లో వంద స్మార్ట్ సిటీల అభివృద్ధికి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో క్యోటో నగర ప్రణాళిక, నిర్మాణాన్ని మోడీ అధ్యయనం చేయనున్నారు. అందుకే మొదట రాజధాని టోక్యోకు కాకుండా స్మార్ట్ సిటీకే వెళ్లాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
జపనీస్‌లో మోడీ ట్వీట్స్
Published Fri, Aug 29 2014 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement