ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు | National Best Teacher Awards presentation at Vignyan Bhavan in Delhi | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

Published Thu, Sep 6 2018 1:07 AM | Last Updated on Thu, Sep 6 2018 5:23 AM

National Best Teacher Awards presentation at Vignyan Bhavan in Delhi - Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి పురస్కారాలు అందుకుంటున్న రామారావు, రవి, రమేశ్, శేష ప్రసాద్, సుసత్య రేఖ

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథులుగా హాజరై అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి నలుగులు, ఏపీ నుంచి ఒకరిని పురస్కారాలు వరించాయి. అవార్డు గ్రహీతల కు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు. విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో విద్యాబోధన, సృజనాత్మకత పెంపులో, పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య పెంచడం వంటి అంశాల్లో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేస్తోంది. విద్యాబోధనలో అధ్యాపకులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఉపరాష్ట్రపతి  ప్రశంసించారు.  

శేష ప్రసాద్‌ నుడుపల్లి,ఆంగ్ల అధ్యాపకురాలు, బేగంపేట 
బేగంపేట కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న ఆంగ్ల అధ్యాపకురాలు శేష ప్రసాద్‌ నుడుపల్లికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. కేవలం మార్కుల కోసమే కాకుండా నిజజీవితంలో ఆంగ్లం ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులను సమాయత్తం చేస్తున్నందుకు కేంద్రం పురస్కారాన్ని ప్రదానం చేసిం ది. ఆంగ్లంపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు, ఇతర కార్యక్రమాల్లో ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తున్న విధానాలను కేంద్రం గుర్తించింది. 

బీఎస్‌ రవి, హెడ్‌మాస్టర్, జోగులాంబ గద్వాల జిల్లా 
పాఠశాలలో విద్యార్థుల చేరిక సంఖ్యను పెంచి విద్యా బోధనలో సులువైన సంక్షిప్త విధానాలను రూపొందించడంలో కృషి చేసినందుకు జోగులాంబ గద్వాల జిల్లా అమరావతి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌ బీఎస్‌ రవి పురస్కారాన్ని అందుకున్నారు. లైబ్రరీ, సైన్స్, కంప్యూటర్‌ ల్యాబ్స్‌పై అవగాహన కల్పిస్తున్నందుకు ఈ పురస్కారం వరించింది.  

నర్రా రామారావు, హెడ్‌మాస్టర్, నిజామాబాద్‌ 
వీధిబాలలను, పేదరికంలో ఉన్న వారిని విద్యావంతులను చేయడంలో విశేష కృషి చేస్తున్నందుకుగాను నిజామాబాద్‌ జిల్లా బోర్గాం (పి) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌ నర్రా రామారావును పురస్కారం వరించింది. కార్మికుల పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్పించి విద్యావంతులను చేస్తున్న తీరును కేంద్రం గుర్తించింది. 

బండారి రమేశ్, స్కూల్‌ అసిస్టెంట్, వరంగల్‌ అర్బన్‌ 
సెకండరీ స్థాయిలో గణితం బోధనలో 150 సంక్షిప్త విధానాలను ప్రవేశపెట్టి, సులువైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా వెంకటాపురం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ బండారి రమేశ్‌ను పురస్కారం వరించింది. 

సుసత్యరేఖ, గణితం అధ్యాపకురాలు, రాజమహేంద్రవరం 
గణితం, సైన్స్‌ బోధనలో టెక్నాలజీని ఉపయోగించి నూతన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల అధ్యాపకురాలు మేకా సుసత్యరేఖ పురస్కారాన్ని అందుకున్నారు. యాప్‌తో పాటు యూట్యూబ్‌ వీడియోలు, బ్లాగ్స్‌ ద్వారా సృజనాత్మక ధోరణిలో  ఆమె అవలంబిస్తున్న విద్యా బోధనను కేంద్రం గుర్తించింది. ఈ విధానాల ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించటం పట్ల ప్రశంసించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement