నిర్లక్ష్యమే జవాన్ల ప్రాణాలను తీసింది
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించడానికి విధుల నిర్వహణలో జవాన్లు నిర్లక్ష్యం వహించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమూ ఉంది. ఆ రోజున రోడ్డు నిర్మాణ పనులకు రక్షణగా ఉన్న బృందంలోని 36 మంది జవాన్లలో ఇద్దరు, ముగ్గురు మినహా అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, అదే అదనుగా భావించిన మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
సీఆర్‌పీఎఫ్‌లోని 76వ బెటాలియన్‌కు చెందిన 99 మంది జవాన్లు మూడు బృందాలుగా విడిపోయి రోడ్డు నిర్మాణ పనులకు కాపలా కాస్తున్నారు. ఒక్కో బందంలో 30 నుంచి 36 మంది జవాన్లు ఉన్నారు. ఒక్కో బృందంలోని సభ్యులు భోజన విరామానికి వెళ్లాలంటే అతి తక్కువ సంఖ్యలో వెళ్లాలి. దాన్నే ఆపరేషన్ అప్రమత్తత అంటారు. అలా అప్రమత్తంగా వ్యవహరించక పోవడం వల్ల అనసరంగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 2010లో పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించడానికి కారణం కూడా ఆపరేషన్ నిబంధనలను పాటించక పోవడమే కారణం.
ఆ రోజున తెల్లవారు జామున మావోయిస్టులు దాడి జరిపినప్పుడు ఎక్కువ మంది జవాన్లు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలలకే అలసి పోయిన జవాన్ల బృందం కలసికట్టుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే మావోయిస్టులు కాల్పులు జరపడంతో 26 మంది జవాన్లు మరణించారు. ముగ్గురు, నలుగురు చొప్పున బృందాలుగా విడిపోయి వెళ్లాల్సిన జవాన్లు అలా చేయకుండా ఒకే గుంపుగా వెళ్లడం ఒక పొరపాటైతే వెళ్లిన దారినే వెనక్కి రావడం రెండో పొరపాటు.
గుణపాఠం నేర్చుకోలేదు
ఈ రెండు సంఘటనల నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే ఈ రోజున కూడా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడి జరిపిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీనియర్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. తాము కూడా మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు జరిపామని గాయాలతో బయటపడిన జవాన్లు చెప్పిన మాటలను వారి సీనియర్ అధికారులే నమ్మడం లేదు. 12 ఏకే–47 రైఫిళ్లు, 31 ఇన్సాస్ రైఫిళ్లు, 3000 బుల్లెట్లను సంఘటన స్థలం నుంచి మావోయిస్టులు ఎత్తుకెళ్లారంటే ఎదురు కాల్పులు జరిగి ఉండే అవకాశం లేదు.
సీఆర్‌పీఎఫ్‌కు అధిపతి లేరు
సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దుర్గా ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది.