'విపత్తు నిర్వహణను విస్మరిస్తున్నారు'
న్యూఢిల్లీ: భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణకోసం 2005లో ఏర్పాటయిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) కార్యకలపాలను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నీరుకారుస్తోందని ఆ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.
తన రాజీనామా తరువాత ఏడాది కాలంగా ఖాళీగా ఉంటోన్న ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ పదవిలో నేటికీ నియామకం చేపట్టకపోవడం, సభ్యుల సంఖ్యను కూడా కుదించడం, ఇటీవల వరదలు సంభవించిన ప్రాంతాల్లో ఎన్డీఎంఏకు పని కల్పించకపోవడం వంటి నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. చార్ధామ్ వరదలు, ఫైలిన్ తుఫాను సందర్భంలో పౌరుల ప్రాణాలు కాపాడేందుకు ఎన్డీఎంఏ కనబర్చిన చొరవను ప్రస్తుత ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు.
గతంలో క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగిన ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ పదవిని క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి తగ్గించడంపైనా మర్రి మండిపడ్డారు. ఎన్డీఎంఏ లాంటి సంస్థల అవసరం దేశానికి అన్నివేళలా అవసరం ఉంటుందని పేర్కొన్నారు.