ఢిల్లీ ఆస్పత్రుల్లో ఇ-హెల్త్ సౌకర్యం..
న్యూఢిల్లీః పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఇ-హెల్త్ సేవలు ప్రవేశ పెట్టాలని ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలను సైతం ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి పరచనున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రులు, చికిత్సాలయాల్లో ప్రత్యేక ఇ-హెల్త్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వైస్ ఛైర్ పర్సన్ కరణ్ సింగ్ తన్వార్ తెలిపారు. ఈ కొత్త సౌకర్యంతో స్మార్ట్ హెల్త్ కేర్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎన్డీఎంసీ ఛైర్మన్ నరేష్ కుమార్ తెలిపారు. మోతీ బాగ్ లోని చరక్ పాలిక ఆస్పత్రిలో కొత్త బ్లాక్ శంకుస్థాపన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్ఐసీ సహకారంతో ఎన్డీఎంసీ క్లౌడ్ బేస్డ్ ఇ-హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టనుందని, ఈ తరహా సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం దేశంలోనే మొదటిసారి అని ఆయన తెలిపారు.
చరక్ పాలికా ఆస్పత్రిలో అదనంగా నిర్మిస్తున్న బ్లాక్ లో అన్ని సౌకర్యాలతోపాటు, జీవరసాయన పరిశోధనలకు వీలుగా పాథాలజీ కమ్ బయో కెమిస్ట్రీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నరేష్ కుమార్ తెలిపారు. ఒక సంవత్సరం వ్యవధిలో మొత్తం 7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.