dispensaries
-
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిస్పెన్సరీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, రిటైరైన సిబ్బంది ఇకపై ఉచిత చికిత్సల కోసం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వరకు రావాల్సిన బాధ తప్పనుంది. ఆర్టీసీ ఆసుపత్రికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలను ఆసుపత్రులుగా మారుస్తుండటమే అందుకు కారణం. నిధుల సమస్యతో ఇంతకాలం డిస్పెన్సరీలను బాగుచేయలేని పరిస్థితి నెలకొనగా తాజాగా వాటిని ఉద్యోగులకు చేరువ చేసేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. వైద్యులు.. పరికరాలు.. మందులు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ఆర్టీసీ డిస్పెన్సరీలున్నాయి. వాటిల్లో నాలుగు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కానీ కొన్ని డిస్పెన్సరీల్లో వైద్యులు లేరు. అలాగే ఎక్కడా కూడా వైద్య పరికరాలు లేవు. ఇప్పుడు అన్ని డిస్పెన్సరీలకూ వైద్యులను కేటాయించారు. నలుగురు వైద్యులను ప్రభుత్వం కేటాయించగా మిగతా వైద్యులను, టెక్నీíÙయన్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీ సమకూర్చుకుంది. వారు స్థానికంగా అందుబాటులో ఉంటూ సాధారణ చికిత్సలకు పూర్తిస్థాయిలో సేవలందించనున్నారు. అయితే ఎమర్జెన్సీ కేసులకు మాత్రం కీలక చికిత్సలు డిస్పెన్సరీల్లో ఉండవు. అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగులు ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రికో లేదా ఆర్టీసీ రిఫరల్ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రులకో వెళ్లే వరకు అవసరమయ్యే ప్రాథమిక చికిత్సలు అందిస్తారు. అలాగే అన్ని రకాల మందులను కూడా డిస్పెన్సరీల్లో సమకూరుస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారు మందుల కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. ఇకపై డిస్పెన్సరీల్లోనే ఉచితంగా మందులు అందిస్తారు. మరోవైపు కొత్తగా ఏర్పడ్డ పెద్ద జిల్లా కేంద్రాల్లో కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా తాజాగా నాగర్‌కర్నూల్‌లో డిస్పెన్సరీ ఏర్పాటైంది. మిగతా వాటిల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఈఎస్ఐ డిస్పెన్సరీలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అన్ని రకాల వసతులతో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. ఇవిగాకుండా కొత్తగా 14 డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ప్రస్తుతమున్న డిస్పెన్సరీల్లో 65 డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె కాంట్రాక్టు గడువు ముగియడంతో కొన్నింటిని పలుమార్లు మార్పు చేసిన సందర్భాలున్నాయి. డిస్పెన్సరీల మార్పులతో అటు రోగులకు, ఇటు వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత భవనాల నిర్మాణానికి కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి డిస్పెన్సరీకి శాశ్వత భవనంకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు అనువైన స్థలాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. స్థలాలు గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణం.. ప్రస్తుతం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది. స్థలాలను గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు కార్మిక శాఖ సిద్ధంగా ఉంది. గతవారం ఈఎస్ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్పెన్సరీలకు శాశ్వత నిర్మాణాలపైనా చర్చించారు. ఈ క్రమంలో ఈఐఎస్‌ఐసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. చందాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
వర్గోన్నతి సరే.. వైద్యులు ఏరి..!
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్ జిల్లావ్యాప్తంగా ఉన్న 12 పశు చికిత్సా కేంద్రాలను పశువైద్యశాలలుగా, 15 గ్రామీణ పశువైద్య కేంద్రాల ను (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు) పశు చి కిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి కల్పిం చిం ది. అయితే ఆ స్థాయిలో వైద్యుల ని యా మకం జరగలేదు. ప్రస్తుతం 31 మంది ఏడీలకు 19 మంది మాత్రమే సేవలం దిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్గోన్నతి పొందిన వైద్యశాలలకు నిధులు, మందులు, సౌకర్యాలు పెంచినా ఫలితం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏడీల కొరత నిబంధనల మేరకు వర్గోన్నతి పొం దిన పశు వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. పశు చికిత్సా కేంద్రాలకు పశు వైద్యాధికారులను నియమించాలి. అయితే జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 31 మంది ఏడీలకు గాను 19 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకూ వారితోనే ఎలాగోలా నెట్టుకొచ్చేస్తుం డగా, ఇప్పుడు వర్గోన్నతి పొందిన పశువైద్యశాలలకు మరో 12 మంది ఏడీల అవసరం ఉంది. ఇప్పటికే 12 మంది ఏడీల కొరత ఉండగా అదనంగా 12 మంది ఏడీలను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పశు చికిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి పొందినా ఇప్పటివరకూ కాంపౌండర్ స్థాయి ఉద్యోగులతో నడుస్తున్న కేంద్రాలకు వారినే ఇన్చార్జిలుగా వాడుకోవాల్సిన ప రిస్థితి ఏర్పడింది. వర్గోన్నతి పొందిన చికిత్సా కేంద్రాలివే.. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ పశు చికిత్సా కేంద్రాలుగా సేవలందిస్తున్న నిడదవోలు, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, ఉండి, పోడూరు, అత్తిలి, గణపవరం, పెనుగొండ, నల్ల జర్ల, ధర్మాజీగూడెం, దెందులూరు కేంద్రాలు పశు వైద్యశాలలుగా మారనున్నాయి. వీటితో పాటు గ్రామీణ పశువైద్య కేంద్రాలుగా ఉన్న ఆచంట వేమవరం, మత్స్యపురి, తడికలపూడి, పెదకడిమి, శనివారపు పేట, పోతవరం, పశి వేదల, ఎల్బీ చర్ల, కోరుమామిడి, వెంకటాపురం, దొరమామిడి, ఆరుగొల ను, రేలంగి, మోగల్లు, ఆగడాలలంక కేం ద్రాలు పశు చికిత్సా కేంద్రాలుగా రూ పాంతరం చెందనున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఉన్న 11 పశువైద్యశాలలతో వర్గోన్నతి పొందిన 12 కలిపి మొత్తం 23 పశు వైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా లో 102 పశు చికిత్సా కేంద్రాల్లో వర్గోన్నతి పొందిన 12 కేంద్రాలు పోను 95 చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. వీటికి వర్గోన్నతి పొందిన మరో 15 గ్రామీణ కేంద్రాలు కలిపి మొత్తంగా 105 కేంద్రాలు సేవలందించనున్నాయి. -
ఢిల్లీ ఆస్పత్రుల్లో ఇ-హెల్త్ సౌకర్యం..
న్యూఢిల్లీః పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఇ-హెల్త్ సేవలు ప్రవేశ పెట్టాలని ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సౌకర్యాలను సైతం ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి పరచనున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రులు, చికిత్సాలయాల్లో ప్రత్యేక ఇ-హెల్త్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వైస్ ఛైర్ పర్సన్ కరణ్ సింగ్ తన్వార్ తెలిపారు. ఈ కొత్త సౌకర్యంతో స్మార్ట్ హెల్త్ కేర్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎన్డీఎంసీ ఛైర్మన్ నరేష్ కుమార్ తెలిపారు. మోతీ బాగ్ లోని చరక్ పాలిక ఆస్పత్రిలో కొత్త బ్లాక్ శంకుస్థాపన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్ఐసీ సహకారంతో ఎన్డీఎంసీ క్లౌడ్ బేస్డ్ ఇ-హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టనుందని, ఈ తరహా సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం దేశంలోనే మొదటిసారి అని ఆయన తెలిపారు. చరక్ పాలికా ఆస్పత్రిలో అదనంగా నిర్మిస్తున్న బ్లాక్ లో అన్ని సౌకర్యాలతోపాటు, జీవరసాయన పరిశోధనలకు వీలుగా పాథాలజీ కమ్ బయో కెమిస్ట్రీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నరేష్ కుమార్ తెలిపారు. ఒక సంవత్సరం వ్యవధిలో మొత్తం 7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. -
పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్!
మానవ జనాభా ఎక్కువైతేనే కాదు.. పశుపక్ష్యాదుల జనాభా ఎక్కువైనా మనకు ఇబ్బందులు తప్పవు. స్పెయిన్‌లోని కాటలాన్ పట్టణంలో పావురాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు తెగ ఇబ్బంది పడుతున్నారట. అందుకే.. ఎలాగైనా వాటి జనాభాను నియంత్రించాలని భావించిన అధికారులు వాటి సంతాన నియంత్రణపై దృష్టిపెట్టారు. ఒక్కో పావురాన్ని పట్టుకుని ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి.. సింపుల్‌గా గర్భనిరోధక మాత్రలను తినిపించాలని ప్లాన్ చేశారు. పక్షులకు గర్భనిరోధకంగా పనిచేసే మొక్కజొన్నల నుంచి తీసిన ఒవిస్టాప్ అనే మందును ప్రతిరోజూ ఉదయం పది గ్రాముల మోతాదులో పావురాలకు తినిపించేందుకు రంగం సిద్ధం చేశారు. పట్టణంలోని సివిల్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్ వద్ద తొలి డిస్పెన్సనరీని బుధవారమే ప్రారంభించగా, వచ్చే వారం నుంచి రెండు పాఠశాలల పైకప్పులపై కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక పావురం ఏడాదికి 48 పావురాలకు జన్మనిస్తుందట. అందుకే వీటి సంతతి ఎక్కువగా వృద్ధి అయ్యే జూలై-డిసెంబర్ మధ్యలో ఈ మాత్రలు వేయనున్నారు. అయితే.. ఒక్కో పావురం సరిగ్గా పది గ్రాముల మాత్రతోనే సరిపెడతాయా? డోసు ఎక్కువైతే శాంతి కపోతాలకు ప్రమాద మేమీ లేదా? అన్నదానిపై మాత్రం అధికారులు వివరాలు వెల్లడించలేదు. -
మార్కెట్లలో డిస్పెన్సరీలు?
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: వ్యవసాయ మార్కెట్లలో ప్రాథమిక వైద్యం అందించేందుకు డిస్పెన్సరీల ఏర్పాటు అంశాన్ని మార్కెటింగ్ శాఖ పరిశీలిస్తోంది. తాజాగా దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు. మార్కెట్ వర్గాలకు తక్షణ వైద్యసహాయం అందించేందుకు డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాసరి శ్రీనివాసులు ఇటీవల ఈ శాఖాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి జిల్లా నుంచి మార్కెటింగ్ శాఖ జేడీ సుధాకర్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లలో లావాదేవీలు సాగుతున్నాయి. మార్కెట్లలో సరుకుల విక్రయానికి వచ్చే రైతులు, పనిచేసే దడువాయిలు, గుమాస్తాలు, ఎడ్లబండ్ల కార్మికులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ సంఖ్య సీజన్లో ఐదారువేల మందికి చేరుతోంది. ఇతర మార్కెట్లలో కూడా రెండు నుంచి మూడు వేల మంది ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యార్డుల్లోనే వీరంతా వివిధ పనులు చేస్తూంటారు. ముఖ్యంగా ధాన్యం, ఇతరత్రా పంట ఉత్పత్తుల తూకం, బస్తాలను తరలించే సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి, మిర్చితో పాటు పంట ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన సమయంలో యార్డుల్లో దుమ్ముదూళి పెరుగుతోంది. మిర్చి సీజన్లో ఎండ వేడి, మంటతో ఊపరాడని పరిస్థితులు నెలకొంటాయి. ఒకరిద్దరు రైతులు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. దుమ్ముధూళి ఇతరత్రా వాటితో ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరికి తక్షణం వైద్యసహాయం అందించేందుకు ఈ డిస్పెన్సరీలు దోహదం చేసే అవకాశం ఉంది. ఎదైనా సంఘటన జరిగితే ప్రాథమిక వైద్యం అందించేందుకు అక్కడే వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. దీనికి మార్కెట్ కమిటీలు, అధికారుల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ మార్కెట్లకు రైతుల పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలపై ఆధారపడి ఆదాయం లభిస్తోంది. గణనీయంగానే ఈ ఆదాయం ఉన్నప్పటికీ రైతులకు తగిన సేవలందించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక వైద్యం అందించేందుకు చర్యలు చేపడితే రైతుల నుంచి మన్ననలు పొందవచ్చు. ప్రస్తుతం ఎనుమాముల లాంటి పెద్ద మార్కెట్లలో మెడికల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసి నిర్ధిష్ట వేళల్లో వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ జిల్లాలో మిగిలిన మార్కెట్లలో ఈ పరిస్థితిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సి ఉన్నందున విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రాథమిక స్థాయిలో చర్చించినట్లు తెలుస్తోంది. డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తే వైద్యం అందించడం, ఉచితంగా మందులు అందించడం, డాక్టర్, వసతి తదితర అంశాలన్నీంటిని పరిగణలోకి తీసుకొని వాటికి అయ్యే వ్యయాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.