పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్!
మానవ జనాభా ఎక్కువైతేనే కాదు.. పశుపక్ష్యాదుల జనాభా ఎక్కువైనా మనకు ఇబ్బందులు తప్పవు. స్పెయిన్‌లోని కాటలాన్ పట్టణంలో పావురాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు తెగ ఇబ్బంది పడుతున్నారట. అందుకే.. ఎలాగైనా వాటి జనాభాను నియంత్రించాలని భావించిన అధికారులు వాటి సంతాన నియంత్రణపై దృష్టిపెట్టారు. ఒక్కో పావురాన్ని పట్టుకుని ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి.. సింపుల్‌గా గర్భనిరోధక మాత్రలను తినిపించాలని ప్లాన్ చేశారు.
పక్షులకు గర్భనిరోధకంగా పనిచేసే మొక్కజొన్నల నుంచి తీసిన ఒవిస్టాప్ అనే మందును ప్రతిరోజూ ఉదయం పది గ్రాముల మోతాదులో పావురాలకు తినిపించేందుకు రంగం సిద్ధం చేశారు. పట్టణంలోని సివిల్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్ వద్ద తొలి డిస్పెన్సనరీని బుధవారమే ప్రారంభించగా, వచ్చే వారం నుంచి రెండు పాఠశాలల పైకప్పులపై కూడా డిస్పెన్సరీలు ఏర్పాటు చేయనున్నారు.
ఒక పావురం ఏడాదికి 48 పావురాలకు జన్మనిస్తుందట. అందుకే వీటి సంతతి ఎక్కువగా వృద్ధి అయ్యే జూలై-డిసెంబర్ మధ్యలో ఈ మాత్రలు వేయనున్నారు. అయితే.. ఒక్కో పావురం సరిగ్గా పది గ్రాముల మాత్రతోనే సరిపెడతాయా? డోసు ఎక్కువైతే శాంతి కపోతాలకు ప్రమాద మేమీ లేదా? అన్నదానిపై మాత్రం అధికారులు వివరాలు వెల్లడించలేదు.