వివాహేతర సంబంధమే కారణం
మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. పీర్జాదిగూడలోని మల్లికార్జున నగర్‌లో పద్మ(40) అనే మహిళ అనురాగ్ రెడ్డి బాయిస్ హాస్టల్ నిర్వహిస్తోంది. ఈ హాస్టల్‌లో జనగామ జిల్లా బండ్లగూడెం గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ మహేందర్ రెడ్డి (38) ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండటంతో మహేందర్ రెడ్డి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం హాస్టల్‌కు రావాలని పద్మ పిలువగా శనివారం రాత్రి వెళ్లాడు. ఆ సమయంలో హాస్టల్ గదిలో సూర్యాపేటకు చెందిన కిరణ్ రెడ్డి(35),పద్మ కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురికీ మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ గొడవలో కిరణ్ రెడ్డి, పద్మలు వంటకు ఉపయోగించే గంటె, కూరగాయలు కోసే కత్తితో మహేందర్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment