నెహ్రూ విధానాలను వక్రీకరిస్తున్నారు
- లౌకికత్వం లేకుండా దేశానికి అస్తిత్వం లేదు: సోనియా
- నెహ్రూ విధానాలను తక్కువగా చూపే ప్రయత్నం జరుగుతోంది
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మనకు వారసత్వంగా అందించిన లౌకికత్వం (సెక్యులరిజం) వంటి విధానాలు ఇప్పుడు తప్పుడు వ్యక్తీకరణకు, వక్రీకరణకు గురవుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం లేకుండా భారతదేశానికి అస్తిత్వం లేదన్నారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సోమవారం నెహ్రూ స్మారక అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ప్రధాని నరేంద్ర మోదీని, ఇతర బీజేపీ నేతలను ఆహ్వానించకుండా నిర్వహిస్తున్న ఈ సదస్సు సాక్షిగా సోనియా బీజేపీ, సంఘ్‌పరివార్ పేర్లు ప్రస్తావించకుండా కాషా య శక్తులపై మండిపడ్డారు. ఎన్డీఏయేతర పార్టీలకు చేరువ కావడానికి కాంగ్రెస్ వినియోగించుకుంటున్న ఈ సదస్సుకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నుంచి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, జేడీయూ అధ్యక్షడు శరద్‌యాదవ్, సీపీఐ నుంచి డి.రాజా, ఎన్సీపీ ప్రధానకార్యదర్శి డి.పి.త్రిపా ఠి, ఆర్జేడీ నేత జైప్రకాశ్ నారాయణ్ యాదవ్‌తో పాటు అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఘనా నుంచి జాన్ కుఫోర్, నైజీరియా నుంచి ఒబాసాంజో, నేపాల్ మాజీ ప్రధాని మాధవ్, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త ఆస్మా జహంగీర్‌లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభం అనంతరం సోనియాగాంధీ ప్రసంగించారు. ‘నెహ్రూ జీవితాన్ని, ఆయన చేసిన కృషిని తక్కువచేసే ప్రయత్నం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఆయన విధానాలు తప్పుడు వ్యక్తీకరణకు గురవుతున్నాయి. అందు లో నెహ్రూ నమ్మి, పాటించిన లౌకకవాదం కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది. మత విషయాల్లో తటస్థంగా ఉండే రాజ్యం, అన్ని మతాలకు సమాన గౌరవం నెహ్రూ లౌకికవాద భావనకు కీలకం. లౌకికత్వం లేకుండా భారత్‌గాని, భారతీయతగాని లేవు. ఇది ఒక లక్ష్యం కంటే గొప్పది. ఎంతో విభిన్న పరిస్థితులున్న మన దేశానికి అది ఎంతో అత్యవసరం.’ అని ఆమె పేర్కొన్నారు. వేర్వేరు సంస్కృతులు, మతాలు, భాషలు, ప్రాంతీయతలు ఉన్న మన దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్లమెంటరీప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం దోహదపడతాయని నెహ్రూ విశ్వసించారని.. ఇదే సరైన విధానమని నిరూపణ అయిందన్నారు.
సరైన మార్గంలో ఓటమి ఎదురైనా సరే..
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి బయటపడలేకపోతున్న నేపథ్యంలో.. సోనియా నెహ్రూను ఉటంకిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో గెలిచినవారు దానిని తలకు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదని, ఓడినవారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని నెహ్రూ చెప్పేవారు. గెలిచామా? ఓడామా? అన్న ఫలితం కంటే.. అందుకు అనుసరించిన మార్గమే ముఖ్యమని.. తప్పుడు మార్గంలో గెలిచే బదులు, సరైన మార్గంలో వెళ్లి ఓడిపోవడమే నయమని నెహ్రూ చెప్పేవారు.’’ అని ఆమె పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి మతం ప్రవేశిస్తే వచ్చే పరిణామాలను గురించి నెహ్రూ ముందుగానే హెచ్చరించారన్నారు. నెహ్రూ తన విధానాలతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి హీరోగా మారారన్నారు. నెహ్రూ విధానాలు ఆచరణీయమని హమీద్ కర్జాయ్ సహా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ సదస్సు మంగళవారం సాయంత్రం ముగియనుంది.
క్షీణిస్తున్న అదృష్టానికి నిదర్శనం: బీజేపీ
నెహ్రూ స్మారక సదస్సుకు ఆహ్వానితుల జాబితాను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అధికార బీజేపీ ఎద్దేవా చేసింది. నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించినవారిని ఆ సదస్సుకు ఆహ్వానించడం.. క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదృష్టానికి చిహ్నంగా కనబడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించిన వామపక్షాలను, రాంమనోహర్ లోహి యా అనుచరులను ఈ సదస్సుకు ఆహ్వానించ డం ఏమిటన్నారు. కాగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకొనేందుకే కాంగ్రెస్, లెఫ్ట్ లతో వేదిక పంచుకున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఒక అంతర్జాతీయ సదస్సులో కాంగ్రెస్, తృణమూల్‌తో వేదిక పంచుకోవడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్ పేర్కొన్నారు.