భూవిలయం నేపాల్ నేలమట్టం
నేపాల్‌లో పెను భూకంపం.. 1,500 మందికిపైగా మృతి
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.9
భారత్ లో 51 మంది మృతి
► వేలాది మందికి గాయాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు
► మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
► వణికిపోయిన కఠ్మాండు.. ఆస్తి, ప్రాణనష్టం ఇక్కడే ఎక్కువ
► ఎటు చూసినా మట్టి దిబ్బలు.. మొండి గోడలు.. చీలిన దారులు
► రోడ్డు, రవాణా, సమాచార వ్యవస్థలు ఛిన్నాభిన్నం
► దర్హారా టవర్ నేలమట్టం.. శిథిలాల కింద 200 మంది మృతి
► తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ వారసత్వ సంపద ‘దర్బార్ స్క్వేర్’
► పలు ఆలయాలు ధ్వంసమైనా చెక్కుచెదరని పశుపతినాథ్ ఆలయం
► ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోనూ ప్రకంపనలు
► చైనా, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనూ ప్రభావం
నేపాల్ గుండె చెదిరింది! కాళ్ల కింది నేలే కాలరేకపై కన్నీళ్ల చరిత్రను లిఖించింది!
హిమాలయ రాజ్యాన్ని మృత్యువులా చుట్టుముట్టి నిలువునా వణికించింది. ప్రకృతి ఒడిలో ఒద్దికగా ఒదిగిన దేశం పంచప్రాణాలను పిండేసింది. పుడమితల్లి ప్రకోపంలో 1,500 మందికి పైగా ప్రాణాలు మట్టి దిబ్బల కింద ముగిసిపోయాయి. నేపాల్‌లో గత 81 ఏళ్లలో కనీవినీ ఎరుగని ఘోర విపత్తు ఇది!! భూకంప ధాటికి చారిత్రక భవనాలు నామరూపాల్లేకుండా కూలిపోయాయి. జనావాసాలు మొండి గోడల్లా మిగిలిపోయాయి. శిథిలాల కింద నలిగి వేలాది మంది గాయాలపాలయ్యారు. భూకంప కోరలు భారత్‌కూ విస్తరించాయి. వివిధ రాష్ట్రాల్లో 51 మంది చనిపోయారు. బిహార్‌లోనే 23 మంది మృత్యువాత పడ్డారు. నేపాల్‌లో మట్టి దిబ్బల కింద నుంచి అభాగ్యుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. శనివారం నేపాల్ రాజధాని కఠ్మాండుకు 80 కిలోమీటర్ల దూరంలోని లమ్‌జంగ్ కేంద్రంగా పెను భూకంపం మిగిల్చిన విషాద ఛాయలివి!
కఠ్మాండు: నేపాల్‌లో పెను భూకంపం మంచు నేలను మట్టి దిబ్బలా మార్చేసింది. ఉదయం సరిగ్గా 11.56 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. 1934లో నేపాల్-బిహార్ సరిహద్దుల్లో 8.4 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత మళ్లీ అంతటిస్థాయిలో భూమి కంపించడం ఇదే తొలిసారి. మొదటిసారి భూమి కంపించిన తర్వాత కూడా వెంట వెంటనే వచ్చిన ప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తించాయి. 4.5, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో 25 సార్లు భూమి కంపించింది. ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత నేపాల్‌కే పరిమితం కాలేదు. భారత్‌లోని బిహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలతోపాటు ఈశాన్య ప్రాంతాలనూ కుదిపేసింది. చైనా, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో కూడా ప్రభావం కనిపించింది. ‘ఈ ఘోర విపత్తులో కనీసం 1,457 మంది చనిపోయి ఉంటారు. వందల మంది ఆచూకీ గల్లంతైంది. బర్పాక్ లర్పాక్ ప్రాంతంలోనే దాదాపు వెయ్యి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి’ అని నేపాల్ ఆర్థిక మంత్రి రాం శరణ్ మహత్ తెలిపారు. సహాయ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా ఆలయాలు దెబ్బతిన్నా ఆశ్చర్యకరంగా కఠ్మాండులోని ఐదో శతాబ్దం నాటి ప్రఖ్యాత పశుపతినాథ్ దేవాలయం చెక్కుచెదరకుండా నిలిచింది. నగరంలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేిశారు. ఇప్పటివరకు భక్తపూర్‌లో 150, సింధులో 250, లలిత్‌పూర్‌లో 67, ధడింగ్ జిల్లాలో 37 మంది మృత్యువాత పడ్డట్టు హోంశాఖ వెల్లడించింది. ఓ పర్వతారోహకుడు సహా నలుగురు చైనీయులు కూడా మరణించారు. ఈ ఘోర విపత్తులో ప్రపంచ దేశాలు తమకు ఉదారంగా సాయపడాలని నేపాల్ సమాచార శాఖ మంత్రి మినేంద్ర రిజాల్ కోరారు.
కఠ్మాండు.. కకావికలం
కఠ్మాండులోని పురాతన భవనాలన్నీ భూకంపం దెబ్బకు నేలమట్టమయ్యాయి. ఎటు చూసినా మొండిగోడలు, శిథిలాలు, పక్కకు ఒరిగిన భవనాలు, నైచ్చిన దారులు కనిపిస్తున్నాయి. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. జనసాంద్రత ఎక్కువున్న ఈ నగరంలోనే ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద 876 మందికి పైగా చనిపోగా ఒక్క కఠ్మాండులోనే కనీసం 250 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆర్మీ, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో నగరంలోని వేలాది మంది రాత్రి ఆరుబయటే నిద్రించారు.
దెబ్బతిన్న రాయబార కార్యాలయం
కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయ భవనం కూడా దెబ్బతింది. కాంప్లెక్సులోని ఓ ఇల్లు కూలిపోవడంతో ఎంబసీ ఉద్యోగి మదన్ కూతురు చనిపోయిందని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో వెల్లడించారు. తమ తరఫున రెండు హెల్ప్‌లైన్లు(+977 98511 07021, +977 98511 35141) ఏర్పాటు చేసినట్లు ఎంబసీ ప్రతినిధి అభయ్ కుమార్ తెలిపారు. బీర్ ఆసుపత్రిలో మరో భారతీయుడు మరణించారు. భూకంప కేంద్రమైన లమ్‌జంగ్ జిల్లాలో కూడా పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఈ జిల్లాలో 1.8 లక్షల మంది జనాభా ఉంది. జిల్లా కేంద్రమైన బెసిసహర్ లో నష్టం ఎక్కువగా ఉంది. అత్యవసర సేవలు అందించేందుకు భారత్ నుంచి 50 మంది వైద్యుల బృందం కఠ్మాండుకు చేరుకుంది.
ప్రమాదం నుంచి బయపడిన రాందేవ్
యోగా క్యాంపు కోసం కఠ్మాండు వచ్చిన బాబా రాందేవ్ భూకంపం నుంచి త్రుటిలో బయటపడినట్లు ఆయన ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా తెలిపారు. ‘‘మా యోగా శిబిరం ఉదయం 5 గంటలకు మొదలైంది. అది ముగిసిన తర్వాత అక్కడ్నుంచి రాందేవ్ వేరే శిబిరానికి బయల్దేరారు. అంతలోనే ఆయన బయటకు వచ్చిన భవనం కూలింది. ఆయన ముందున్న మరో భవనం కూడా అదే సమయంలో కుప్పకూలింది’’ అని ఆయన చెప్పారు. రాందేవ్‌తో మాట్లాడామని, ఆయన క్షేమంగానే ఉన్నారని మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు.