కఠ్మాండు లోయలోని ప్రధాన నగరమైన భక్తాపూర్‌లో భూకంపానికి శిథిలమైన బౌద్ధాలయం.
మాధవ్ శింగరాజు
నేపాల్ మనకు ప్రత్యేకం. అక్కడికి వెళ్లడానికి వీసా అక్కర్లేదు. పాస్‌పోర్ట్ ఉండనక్కర్లేదు. అందుక్కాదు ప్రత్యేకం. నేపాల్ ఒక దేశంలా ఉండదు. మనింటి పూదోటలా ఉంటుంది. మనం వెళ్లే గుడిలా ఉంటుంది. మనం ఆడుకునే మైదానంలా, మనం ఎక్కిదిగే కొండలా ఉంటుంది. మన శీతాకాలపు వెచ్చదనంలా, మన కునుకుతీతల కావలి నేస్తంలా ఉంటుంది. నేపాల్ స్వతంత్ర దేశం అయితే కావచ్చు. ప్రపంచ దేశాలన్నిటికీ అది సొంత దేశం. టూరిస్ట్ కంట్రీ. నేపాల్ ఎక్కడుందీ అంటే 26-31 డిగ్రీల ఉత్తర అక్షాంశాలకు, 80-89 డిగ్రీల తూర్పు రేఖాంశాలకు మధ్య దక్షిణాసియాలో ఉందని చెప్పగలం. నేపాల్ అందం ఎక్కడుందీ అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేం. అక్కడి లోయల్లోనా, హిమాలయాల్లోనా, మనుషుల్లోనా చెప్పలేం. అయితే నేపాల్ ఇప్పుడు పూదోటలా లేదు. గుడిలానూ, మైదానంలానూ, కొండలానూ లేదు. శిథిల రాజ్యంలానూ లేదు. అలా పడి ఉంది. అంతే. ఎవరైనా వెళ్లి వెచ్చదనం ఇవ్వాలి. ఎవరైనా వెళ్లి ఆసరాగా నిలవాలి.
వేల ప్రాణాలు పోయాయి. ప్రాణ సమానమైన సాంస్కృతిక వారసత్వపు కట్టడాలు నేల కూలాయి. ఈ రోజుకీ నేపాలీల గుండెల్లో ప్రకంపనలే! కఠ్మాండు వాలీలోని మూడు దర్బార్ భవంతులు; స్వయంభూనాథ్, బౌద్ధనాథ్‌లలోని బౌద్ధ స్థూపాలు; పశుపతినాథ్, ఛంగునారాయణ్‌లలోని హిందూ ఆలయ ప్రాంగణాలు రాళ్ల దిబ్బలుగా మిగిలాయి. అంత పోగొట్టుకున్నా నేపాల్ ‘అందం’గానే ఉంది! కష్టకాలంలో మనిషికి మనిషి అండగా ఉండడంలోని అందం అది!!
విపత్తు వచ్చింది. వెళ్లింది. మనిషే మనిషికోసం మిగిలాడు. మనిషే మనిషికోసం పరుగెత్తుకొస్తున్నాడు. విలవిలలాడుతున్న మనిషిని చేతులకెత్తుకుంటున్నాడు. ఆ పక్కనే విలపిస్తూ కూర్చున్న మనిషి భుజం మీద చెయ్యి వేస్తున్నాడు. మంచినీళ్లు అందిస్తున్నాడు. అంబులెన్స్ ఎక్కిస్తున్నాడు. ‘‘గుట్టల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా?’’ అని అరుస్తున్నాడు. నేపాల్ నిండా ఇప్పుడు మనుషులు, మనుషులు, ఒకటే మనుషులు. ప్రభుత్వం ఒక మనిషి. ఆర్మీ ఒక మనిషి. ఎన్జీవో ఒక మనిషి, అమెరికా ఒక మనిషి. ఇండియా ఒక మనిషి. పాకిస్తాన్ ఒక మనిషి.
హిమాలయమంత దుఃఖం. ఇప్పట్లో కరగకపోవచ్చు. చల్లబడిన నేపాల్ చేతుల్ని, పాదాల్ని అరిచేతులతో రుద్ది వెచ్చబరుస్తున్నారు ఈ మనుషులంతా కలిసి. జీవితంలోని అందానికి నేపాల్ ఇప్పుడు కొత్త నిర్వచనం. భూకంపాలను రిక్టర్ స్కేళ్లతో కొలవచ్చు. మానవత్వపు సౌందర్యాన్ని కొలిచే స్కేళ్లు మౌంట్ ఎవరెస్టులో ఎవరికైనా, ఎప్పటికైనా దొరుకుతాయేమో చూడాలి.