నేపాల్ పీఠంపై ప్రచండ!
కఠ్మాండు: నేపాల్ మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రచండ రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. నేడు ప్రధాని పదవికి ఎన్నిక జరగనుండగా చివరి నిమిషంలో సీపీఎన్-యూఎంఎల్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధేసి ప్రాంత పార్టీల నుంచి కీలక మద్దతు లభించడంతో మంగళవారం ఆయన నామినేషన్ వేశారు. ప్రచండ అభ్యర్థిత్వాన్ని నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) నేత దేవ్‌బా ప్రతిపాదించగా మావోయిస్టు నేత మహరా బలపరిచారు.
కొత్త ప్రభుత్వానికి మధేసి పార్టీలు మద్దతిచ్చేలా, మావోయిస్టు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. 595 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో మధేసీ పార్టీల బలం 42 మంది. ప్రభుత్వంలోనూ చేరతామని ఇవి సంకేతాలిచ్చాయి. మావోయిస్టు పార్టీ మద్దతు వాపసుతో యూఎంఎల్ నేత ఓలి ప్రధాని పదవికి గతవారం రాజీనామా చేశారు.