రూ.500, 1000 నోట్ల కట్టలు.. కేజీ 12 రూపాయలే! | netizen reactions on banning of 500 and 1000 rupee notes | Sakshi
Sakshi News home page

రూ.500, 1000 నోట్ల కట్టలు.. కేజీ 12 రూపాయలే!

Published Tue, Nov 8 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

రూ.500, 1000 నోట్ల కట్టలు.. కేజీ 12 రూపాయలే!

రూ.500, 1000 నోట్ల కట్టలు.. కేజీ 12 రూపాయలే!

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన మరుక్షణం నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందించారు. కొందరు జోకులు పేల్చితే మరికొందరు సెటైర్లు వేశారు. రేపటి నుంచి ఎందుకూ పనికి రాని నోట్లను పల్లీలు కట్టే పొట్లాలుగా మలిచి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు ఈ చర్యను ఆర్థిక ఎమర్జెన్సీగా అభివర్ణించారు.

పాత నోట్లను చుట్టి అందులో పల్లీ బఠానీ అమ్ముతున్నట్టుగా నెటిజన్లు ఫోటోలను పోస్టు చేయగా, 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదనీ, కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామంటూ కొందరు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఆపితే వెంటనే వెయ్యి రూపాయల నోటు ఇచ్చేమని మరికొందరు ఇలా పలువురు సెటైర్లు వేశారు. అమెరికాలో ఓట్ల లొల్లి... ఇండియాలో నోట్ల లొల్లి అంటూ ఇంకొందరు ఇలా తాజా ప్రకటనపై రకరకాలుగా స్పందించారు.



ప్రతి ఇంట్లో గృహిణి తమ భర్త ముందు బ్లాక్ మనీని బయటపెట్టనుందని, ఇంతకాలం భర్తకు తెలియకుండా ఇంట్లో అప్పుడో ఇప్పుడో దాచుకున్న ఈ నోట్లను ఒక్కసారిగా బయటకు తీసి వెల్లడించనున్నారంటూ కొందరు జోకులు పేల్చారు. 'రెస్ట్ ఇన్ పీస్' అంటూ పాత నోట్లకు నివాళులర్పిస్తూ పలువురు పోస్టులు పెట్టారు. వృథా పోవు... తిరుపతి హుండీలో వేసుకోండని కొందరు సలహా ఇచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితేంటని కొందరు ప్రశ్నిస్తే మరికొందరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి వెంటనే మీరు ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లకు వెళ్లండని మరికొందరు సలహాలిచ్చారు.



నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి పలువురు ఆస్పత్రుల్లో చేరిపోతున్నారని (ఆస్పత్రుల్లో పాత నోట్లను అనుమతిస్తారు కాబట్టి), అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూలు నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు దర్శనమిచ్చాయి. మీ వద్ద ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలు... ఇప్పుడు మీకు ఓ కొత్త ఉద్యోగం దొరికనట్టే... రేపటి నుంచి బ్యాంకుల వద్ద నిలబడి మీరు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు.

అచానక్ చుట్టీ యోజన
రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉంటాయన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది ప్రధానమంత్రి కొత్త పథకంగా అభివర్ణించారు. దీన్ని ప్రధానమంత్రి అచానక్ చుట్టీ యోజన (పీఎంఏసీవై) గా పేర్కొన్నారు. మోదీ ప్లేడ్ ది ట్రంప్ కార్డు... ఔర్ పూరీ ఇండియా హిల్లరీ హై అంటూ సెటైర్లు జోరుగా ఊపందుకున్నాయి.

నిజానికి 500, 1000 నోట్లను రద్దు చేయాలన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి అర్థరాత్రి దాటిపోయే వరకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూనే ఉన్నారు. చిల్లర ఇవ్వలేక నిత్యం చికాకు పడుతున్న చిన్న చిన్న వ్యాపారులకు తలనొప్పి పోయిందని కొందరు, జేబుల్లో వ్యాలెట్లకు బదులుగా ఇక నుంచి బ్యాగులు కొనుగోలు చేసుకోవాలని మరికొందరు... బిల్డర్లు, పొలిటీషియన్లు ఇకనుంచి బ్రీఫ్ కేసులకు బదులు సూట్ కేసులకు కొనుగోలు చేయాలి... ఇలా రకరకాల జోకులు పేల్చూతూనే ఉన్నారు.



ఇక 2000 నోట్ల కట్టలు
వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2000 నోట్లను జారీ చేయడమంటే... నల్లధనం సమకూర్చుకునే వారికి మరింత సహాయం చేసినట్టేనని కొందరు వ్యాఖ్యానించారు. ఇది ఆర్థిక ఎమర్జెన్సీగా అభివర్ణించగా, ఈ చర్య ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పెదవి విరిచారు. ఈ నిర్ణయాన్ని రాత్రి సమయంలో ప్రకటించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలలో కొత్త 500 నోట్లు 2000 నోట్లు దర్శనమిచ్చాయంటే ప్రభుత్వం ముందే కొందరికి ఈ విషయం లీక్ చేసిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement