వ్యర్థానికి కొత్త అర్థం
మలాన్ని ఎరువుగా మార్చిన గంగదేవిపల్లి
⇒ వ్యక్తిగత మరుగుదొడ్లలో ట్విన్ పిట్ టెక్నాలజీ
⇒ ఇక్కడి అనుభవం.. దేశానికే పాఠం
గీసుకొండ(పరకాల): వరంగల్ రూరల్ జిల్లా గంగదేవిపల్లి పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ తన ‘మన్‌కీ బాత్’కార్యక్రమంలో ఈ పల్లెను అభినందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, యునెస్కో, స్వచ్ఛభారత్ ప్రతినిధులు ఈ పల్లె ప్రజలు అవలంబించిన విధానాన్ని మెచ్చుకున్నారు. దేశానికి నిర్దేశం చేసే విధంగా ఇక్కడివారు వ్యక్తిగత మరుగుదొడ్ల ట్విన్‌పిట్ (రెండు గుంతల) టెక్నాలజీ పాటించారు. ఈ గుంతల నుంచి తీసిన మట్టిగా మారిన మలంను పంట చేలకు వేయవచ్చని, పుష్కలమైన పోషకాలు ఉన్న ఎరువుగా ఉపయోగపడుతుందని గుర్తిం చారు. దీంతో గంగదేవిపల్లె.. కొత్త ఆలోచనలకు, సాంకేతికతకు ప్రయోగశాలగా మారిం ది. ఇక్కడి వ్యక్తిగత మరుగుదొడ్ల ట్విన్ పిట్ టెక్నాలజీ దేశప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి..
అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ చెల్లప్ప, కలెక్టర్ ఆదిత్యనాథ్‌దాస్, డీపీవో సురేశ్‌కుమార్‌లు 1999 నవంబర్‌లో గంగదేవిపల్లిని సందర్శించారు. అన్ని కుటుంబాల వారు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. దీంతో 2000లో గ్రామంలోని అన్ని కుటుంబాల వారు (256) వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తే రూ.500 జరిమానా విధిస్తామని నిబంధన పెట్టారు. దీంతో 2003 నాటికి ప్రజలందరూ బయటకు వెళ్లకుండా వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. ఇలా ఓ గ్రామంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని.. వినియోగిస్తుండడంతో గంగదేవిపల్లి ‘నిర్మల్ గ్రామ పురస్కారానికి ఎంపికైంది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2007 మే 4న ఈ పురస్కారాన్ని అందజేశారు. అలాగే, 2008 నవంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామానికి ‘శుభ్రం’అవార్డును అందజేశారు.
ఏమిటీ ఈ ట్విన్‌పిట్ టెక్నాలజీ...?
గంగదేవిపల్లిలో ప్రతీ వ్యక్తిగత మరుగుదొడ్డి పక్కనే రెండు గుంతలను తవ్వుకున్నారు. వాటికి సిమెంట్ ఓడలు(రింగ్‌లు) వేసి పైన మూత పెట్టారు. ముందుగా మరుగుదొడ్డి నుంచి మలం వెల్లడానికి రెండింటిలో ఒక దానికి కనెక్షన్ ఇచ్చారు. ఇలా మొదటి పిట్‌లో 12 సంవత్సరాల తర్వాత మలం నిండడంతో దాని పక్కనే ఉన్న మరో పిట్‌కు కనెక్షన్ ఇచ్చి వాడుకున్నారు. ఏడాది పాటు మలం నిండిన పిట్‌ను అలాగే ఉంచడంతో అందులోని తడి పూర్తిగా ఆరిపోయి, మలం పూర్తిగా మట్టిలా మారిపోయింది. దానిని పంట చేలకు ఎరువుగా వేసుకుంటున్నారు.
తొలగిన అపోహ..
మొదటి పిట్‌లో నిండిన మలంపై గతంలో అపోహలుండేవి. దానిని తోడి బయటకు పోయడానికి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్‌ను తెప్పించేవారు. దీని కోసం రూ. 2 వేల వరకు ఖర్చు అయ్యేది. అలా బయటికి తీసిన మట్టిని పెం ట కుప్పలపై పోసేవారు. అయితే, ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వ ఆర్‌డబ్ల్యూఎస్,శానిటేషన్ సెక్రటరీ పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వర్యం లో 23 రాష్ట్రాల సీనియర్ ఐఏఎస్ అ«ధికారులు, యూనిసెఫ్, స్వచ్ఛభారత్ అధికారులు గ్రామంలోని టాయిలెట్ల పిట్లను పరిశీలించడానికి వచ్చారు. ఉన్నతస్థాయి అధికారులు పిట్లలోకి దిగి మట్టిగా మారిన మలాన్ని ఎత్తిపోశారు. చేతులతో ఎత్తి పౌడర్‌లా మార్చి కాఫీ పౌడర్‌లా ఉందని, బ్లాక్ గోల్డ్ అని అభివర్ణిం చారు. పిట్స్‌ను ఖాళీ చేయడం, అందులోని మట్టిని పట్టుకోవడంలో ఇబ్బంది ఉండదని వారు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఇది ఆర్గానిక్ మాన్యూర్‌లో పంట చేలకు ఉపయోగపడే పోషకాలు ఉన్నాయని అధికారులు గ్రామస్తులకు వివరిం చారు. ఆ మట్టి శాంపిల్స్‌ను పరీక్షల కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎఫ్‌సీవో ల్యాబ్‌కు పంపారు. అందులో పంట చేలకు ఉపయోగపడే ఎన్‌పీకే(నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం) ఉన్నాయని నిర్ధారించారు.
మారిన రైతుల ఆలోచన...
కేంద్ర అధికారుల బృందం గ్రామానికి వచ్చిన తర్వాత గ్రామస్తుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. స్వయంగా తమ మరుగుదొడ్ల పిట్లను వారే ఖాళీ చేసి పంటచేలలో వేసుకుంటున్నారు. కొందరు బస్తాల్లో నిల్వచేసి పంటచేలకు వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ఎరువు కావాలని పొరుగువారు అడిగినా ఇవ్వడం లేదు. ఇప్పటికే చల్లా పెద్దమల్లయ్య, కూస లింగమూర్తి అనే రైతులు వంకాయ, వరి చేలలో వేసుకున్నారు.