Svacchabharat
-
ఆమె అవసరం
రోడ్డు మీద ఉన్నాం. రద్దీలో ఉన్నాం. అత్యవసరంగా పక్కకు వెళ్లాలి. మగాళ్లయితే ఏదో ఒక పక్కకు వెళ్లొచ్చేస్తారు. ఆడవాళ్ల మాటేమిటి? సిటీల్లో పెద్ద సమస్య ఇది! ‘షీ’ అని ఉన్న చోటును చూసుకుని వచ్చే అవసరమా ఏమన్నానా?! సుష్మకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. బాగా ఆలోచించి.. ‘షీ’నే అవసరం ఉన్న దగ్గరకు రప్పించే మొబైల్ ‘షీ’ టాయ్‌లెట్‌ను ప్లాన్ చేసింది. ఇది ఆమె పరిచయం మాత్రమే కాదు. ‘ఆమె’ పరిచయం కూడా. చదవండి. సుష్మను అభినందించడానికి మీకింకా అనేక కారణాలు కనిపిస్తాయి. సుష్మ కళ్లెంపూడి వైజాగ్‌లో పుట్టి పెరిగింది. గీతం యూనివర్శిటీలో బీటెక్ చేసి హైదరాబాద్‌లో సత్యం కంప్యూటర్స్‌లో ఉద్యోగం. ఇదంతా 2004లో. ఆ తర్వాత ఏడాది కోదాడ కుర్రాడు సుధీర్‌ని పెళ్లి చేసుకుని యూఎస్‌లో అడుగుపెట్టింది. తిరిగి పన్నెండేళ్ల తర్వాత దంపతులు కుటుంబం సహా ఇండియాకి వచ్చారు. ఇండియాకి ఏదైనా చేయాలని వచ్చారు. ‘సంపాదనలో విరామం– సమాజానికి సహాయం’ అని స్టెల్లా అనే అమెరికన్ ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పిన సూక్తిని ఒంటపట్టించుకుని మరీ ఇండియాకి వచ్చారీ దంపతులు. బాగా ఆలోచించాక.. మహిళలకు ఇల్లు దాటి బయటికి వచ్చినప్పుడు ఎదురయ్యే వాష్‌రూమ్ ఇబ్బందికి చెక్ పెట్టడం కోసం ‘షీ మొబైల్ టాయిలెట్’ అనే కాన్సెప్ట్‌ని రూపొందించుకున్నారు సుష్మ. ‘‘అయితే అందుకు బీజం పడింది మాత్రం అమెరికా వెళ్లకముందే..’’ అని చెప్పారామె. పెళ్లికి ముందు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవు రోజుల్లో ఫ్రెండ్స్‌తో కోఠీ వంటి రద్దీగా ఉండే మార్కెట్ స్థలాలకు వెళ్లినప్పుడు ఎదురైన అవసరాన్ని, అసౌకర్యాన్ని గుర్తు చేసుకున్నారు.‘మీ వాష్‌రూమ్ వాడుకుంటాం’ అని దుకాణాలు, రెస్టారెంట్ల వాళ్లను అడగడం ఎంత ఇబ్బందిగా ఉండేదో తలుచుకున్నారు. షిరిడీకి వెళ్లేటప్పుడు బస్ ప్రయాణం కదా అని నీళ్లు తక్కువగా తాగినప్పటికీ ఏసీ బస్సు కావడంతో వాష్‌రూమ్ అవసరం తప్పని సరి అయిన సందర్భాన్ని వివరించారు. హిస్టరెక్టమీ చేయించుకున్న తన అత్తగారు కోదాడ నుంచి హైదరాబాద్‌కి బస్సులో ప్రయాణించేటప్పుడు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితినీ ప్రస్తావించారు. వీటన్నింటి తర్వాత ఇండియాలో.. ఏడేళ్ల కొడుకు వేదాన్ష్ కోదాడ, వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్లో వాష్‌రూమ్ బాగాలేదని మొండికేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన ఎందుకు చేయాలని ప్రశ్నించడంతో ఈ సమస్య తీవ్రతను మరోసారి సమీక్షించుకున్నారు సుష్మ. ఇండియాలో స్వచ్భారత్లు వచ్చినా, నగరాల్లో సులభ్ కాంప్లెక్స్లున్నా వాష్‌రూమ్ అవసరాన్ని భర్తీ చేసే స్థాయిలో సర్వీస్ లేదని గమనించారు. ‘‘పెద్ద మాల్స్‌లో షాపింగ్ చేసే వాళ్లకు ఆ మాల్సే వాష్‌రూమ్ సర్వీస్నిస్తున్నాయి. కానీ సామాన్య మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఆ మహిళలు రోజు వారీ పనులు, కొనుగోళ్ల కోసం కోసం బహిరంగ మార్కెట్ మీదనే ఆధారపడుతున్నారు. మళ్లీ వాళ్లు ఇంటికి వెళ్లే వరకు ఊపిరి బిగపట్టినంత ఆ నరకాన్ని భరిస్తూనే ఉండాలి. వీటన్నిటికీ పరిష్కారంగా నాకు వచ్చిన ఆలోచనే ఈ ‘మొబైల్ షీ టాయిలెట్స్’’ అన్నారు సుష్మ. ఇండియా అంతే... అనుకోరాదు ‘‘ఊహ తెలిసిన తర్వాత అమెరికా సమాజాన్ని మాత్రమే చూసిన మా పెద్దబ్బాయి వేదాన్ష్‌కు భారతీయ సమాజం పరిచయం కావాలనే ఆలోచనతో కార్పొరేట్ స్కూల్ కాకుండా కొంతకాలం పాటు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. ‘మా తాతగారిల్లు, మా నాన్న చదివిన స్కూలు’ అని ఫొటోల్లో చూడడం కాదు, పిల్లలకు ప్రాక్టికల్‌గా అనుభవంలోకి రావాలనేదే మా ఆలోచన. స్కూలుకి వెళ్లిన మొదటి రోజు నుంచి ‘స్కూల్లో వాష్‌రూమ్‌తో మొదలు పెట్టి స్కూల్లో బెంచీల్లేవేంటి, బిల్డింగ్‌కి పగుళ్లున్నాయేంటి’ అని రోజుకో కంప్లయింట్ చేసేవాడు. దాంతో మా మామగారు (జలగం రంగారావు) పూనుకుని స్కూల్ రిపేర్లు, బెంచ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌కు అవసరమైన మెటీరియల్ డొనేట్ చేశారు. మన కళ్ల ముందున్న ప్రతి సమస్యకూ ‘ఇండియాలో ఇంతే’ అని సమాధానం చెప్పుకోవడం కాదు, మనవంతుగా ఓ పరిష్కారాన్ని ఆలోచించాలి’’ అని చెప్పారు సుష్మ. కరెంటు ఉత్పత్తి ఆఫ్రికాలో మొబైల్ టాయిలెట్ వ్యర్థాల నుంచి వాళ్లు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు, హ్యూమన్ వేస్ట్ ఎరువుగా మారే టెక్నాలజీని ఫాలో అవుతున్నారు వాళ్లు. వినడానికి మనకు విచిత్రంగా ఉండవచ్చు కానీ, చైనాలో స్కూళ్లలో పండించే కూరగాయలు, పండ్లకు ఎరువు ఆయా స్కూళ్ల టాయిలెట్ల హ్యూమన్ వేస్టే. మామూలుగా అయితే హ్యూమన్ వేస్ట్ ఎరువుగా మారడానికి ఆరు నెలలు పడుతుంది. పార్థివ దేహాన్ని దహనం చేసే టెక్నాలజీని ఇక్కడ ప్రవేశ పెడితే నిమిషాల్లో బూడిదయిపోతుంది. దానిని హరితహారంలో మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇలా పూర్తి స్థాయిలో ఒక వాహనం తయారు చేయాలంటే పదిలక్షలు ఖర్చవుతుంది. అయితే మొదటగా ప్రాథమికంగా ఉపయోగించుకోగలిగిన పరిస్థితిలో వాహనాన్ని తయారు చేయమని చెప్పారు జీహెచ్ఎంసీ వాళ్లు. నా ఆలోచన సంక్రాంతి నాటికి ఆచరణలోకి వస్తుంది. ఆ తర్వాత షీ టాయిలెట్స్‌ను దేశమంతటికీ విస్తరిస్తాను’’ అని భవిష్యత్తు ప్రణాళిలను వివరించారు సుష్మ. స్కూళ్లను అద్దెకిద్దాం ప్రభుత్వ భవనం లేకపోతే అద్దె భవనంలో స్కూళ్లు నడపడం గురించి మాత్రమే మనకు తెలుసు. సుష్మ మాటల్లో మన పాఠశాలలు అనుసరించదగిన మరో సూచన కూడా తెలియవచ్చింది. ‘‘అమెరికాలో వారాంతాలు, ఇతర సెలవు రోజుల్లో స్కూలు ఆవరణను, గదులను సమావేశాలకు అద్దెకిస్తారు. పాఠశాల భవనాలను చక్కగా నిర్వహించుకుంటే మన దగ్గర కూడా అలా రెంట్కిచ్చి ఆ వచ్చే డబ్బుతో స్కూల్‌కి అవసరమైన పనులు చేసుకోవచ్చు’’ అని తెలిపారు సుష్మ. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి మూడు దేశాల ఆచరణ షీ మొబైల్ టాయిలెట్ వాహనం ‘‘నేను, నా భర్త సుధీర్ అమెరికా, కెనడా, యూకెల్లో ఉద్యోగాలు చేశాం. యూకె టెక్నాలజీ సాయంతో నైరోబీ, ఉగాండా, కెన్యాల్లో టాయిలెట్ల నిర్వహణ తీరును మనదేశంలో షీ టాయిలెట్ల కోసమే స్టడీ చేశాను. ఒక వెహికల్లో టాయిలెట్ కమోడ్, వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఆ వాహనాన్ని అందుబాటులో ఉంచాలనేది మా ఉద్దేశం. మహిళలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక పార్ట్ పుణె నుంచి, మరో పార్ట్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరా బాద్ నుంచి తీసుకు వచ్చాక మరికొంత వర్క్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం జీహెచ్ఎంసీని సంప్రదించాం. అడిషనల్ కమీషనర్ హరిచందన సానుకూలంగా స్పందించారు’’ అని చెప్పారు సుష్మ. కాఫీ విత్ ప్రిన్సిపల్ పిల్లలు వేదాన్ష్, జేష్ణవ్లతో సుష్మ దంపతులు స్కూల్ నిర్వహణ గురించి పూర్తిగా ప్రభుత్వాల మీదనే ఆధారపడడం కాదు, పేరెంట్స్ కూడా బాధ్యత పంచుకోవాలి. అప్పుడే సమస్యలు మొగ్గదశలోనే తీరిపోతాయి. అలా నాకు వచ్చిన ఇంకో ఆలోచనే ‘టీ విత్ హెడ్ మాస్టర్’. యూఎస్‌లో ‘కాఫీ విత్ ప్రిన్సిపల్’ ప్రోగ్రామ్ ఉంటుంది. విద్యార్థుల పేరెంట్స్ తప్పని సరిగా ప్రిన్సిపల్‌ని కలుస్తారు. పేరెంట్స్ స్కూల్‌కి అవసరమైన సర్వీస్ కూడా చేస్తారు. ఇదే కాన్సెప్ట్‌ని మా వెంకటాపురం స్కూల్ నుంచి ‘టీ విత్ హెడ్మాస్టర్’ అని ప్రారంభించామన్నమాట. అలా ఏపీ, తెలంగాణల్లో పాతిక స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ పెట్టి, వాళ్లకు గైడెన్స్ కోసం కొన్ని సమావేశాలకు నేను స్వయంగా హాజరయ్యాను. ఏపీ విద్యామంత్రి, తెలంగాణ విద్యామంత్రిని కలిసి కాన్సెప్ట్ వివరించాం. గత ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్‌ని అడాప్ట్ చేసుకుని బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు వర్తింప చేసింది. – సుష్మ, మొబైల్ షీ టాయిలెట్స్ ఫౌండర్ -
31లోగా ఓడీఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ3
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31 టార్గెట్‌గా పెట్టుకు ని బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలు గా తీర్చేదిద్దే పనిని వేగవంతం చేయాలని ఆదేశించా రు. స్వయం సహాయక సంఘాలు నిధులు సక్రమం గా వినియోగించుకునేలా దృష్టి సారించాలని సెర్ప్ అధికారులను కోరారు. యువతకు ఉపాధి అవకాశా లు కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. ముందుగా తన నియోజకవర్గం పాలకుర్తిలో జాబ్‌మేళా ఏర్పాటు చేయాలని కోరారు. బుధవారం సచివాలయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్), సెర్ప్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆసరా పింఛన్లకు సంబంధించి 57 ఏళ్లు పైబడిన కొత్త లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై అసంతృప్తి.. ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై ఎర్రబెల్లి అసంతృప్తి వ్యక్తం చేశా రు. వారితో సక్రమంగా పనిచేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలన్నారు. తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లను సమీపంలోని కొత్త పంచాయతీల బాధ్యతలు అప్పగించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు పూర్తి వేతనం పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల కార్యాలయ భవనాల నిర్మాణాని కి చర్యలు తీసుకోవాలన్నారు. శ్మశాన వాటికలు లేని గ్రామాల్లో భూసేకరణకు రూ. 2 లక్షలు అందించే యత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆ శాఖ కమిషనర్ నీతూ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థానికి కొత్త అర్థం
మలాన్ని ఎరువుగా మార్చిన గంగదేవిపల్లి ⇒ వ్యక్తిగత మరుగుదొడ్లలో ట్విన్ పిట్ టెక్నాలజీ ⇒ ఇక్కడి అనుభవం.. దేశానికే పాఠం గీసుకొండ(పరకాల): వరంగల్ రూరల్ జిల్లా గంగదేవిపల్లి పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ తన ‘మన్‌కీ బాత్’కార్యక్రమంలో ఈ పల్లెను అభినందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, యునెస్కో, స్వచ్ఛభారత్ ప్రతినిధులు ఈ పల్లె ప్రజలు అవలంబించిన విధానాన్ని మెచ్చుకున్నారు. దేశానికి నిర్దేశం చేసే విధంగా ఇక్కడివారు వ్యక్తిగత మరుగుదొడ్ల ట్విన్‌పిట్ (రెండు గుంతల) టెక్నాలజీ పాటించారు. ఈ గుంతల నుంచి తీసిన మట్టిగా మారిన మలంను పంట చేలకు వేయవచ్చని, పుష్కలమైన పోషకాలు ఉన్న ఎరువుగా ఉపయోగపడుతుందని గుర్తిం చారు. దీంతో గంగదేవిపల్లె.. కొత్త ఆలోచనలకు, సాంకేతికతకు ప్రయోగశాలగా మారిం ది. ఇక్కడి వ్యక్తిగత మరుగుదొడ్ల ట్విన్ పిట్ టెక్నాలజీ దేశప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి.. అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ చెల్లప్ప, కలెక్టర్ ఆదిత్యనాథ్‌దాస్, డీపీవో సురేశ్‌కుమార్‌లు 1999 నవంబర్‌లో గంగదేవిపల్లిని సందర్శించారు. అన్ని కుటుంబాల వారు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు. దీంతో 2000లో గ్రామంలోని అన్ని కుటుంబాల వారు (256) వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తే రూ.500 జరిమానా విధిస్తామని నిబంధన పెట్టారు. దీంతో 2003 నాటికి ప్రజలందరూ బయటకు వెళ్లకుండా వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. ఇలా ఓ గ్రామంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని.. వినియోగిస్తుండడంతో గంగదేవిపల్లి ‘నిర్మల్ గ్రామ పురస్కారానికి ఎంపికైంది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2007 మే 4న ఈ పురస్కారాన్ని అందజేశారు. అలాగే, 2008 నవంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామానికి ‘శుభ్రం’అవార్డును అందజేశారు. ఏమిటీ ఈ ట్విన్‌పిట్ టెక్నాలజీ...? గంగదేవిపల్లిలో ప్రతీ వ్యక్తిగత మరుగుదొడ్డి పక్కనే రెండు గుంతలను తవ్వుకున్నారు. వాటికి సిమెంట్ ఓడలు(రింగ్‌లు) వేసి పైన మూత పెట్టారు. ముందుగా మరుగుదొడ్డి నుంచి మలం వెల్లడానికి రెండింటిలో ఒక దానికి కనెక్షన్ ఇచ్చారు. ఇలా మొదటి పిట్లో 12 సంవత్సరాల తర్వాత మలం నిండడంతో దాని పక్కనే ఉన్న మరో పిట్‌కు కనెక్షన్ ఇచ్చి వాడుకున్నారు. ఏడాది పాటు మలం నిండిన పిట్‌ను అలాగే ఉంచడంతో అందులోని తడి పూర్తిగా ఆరిపోయి, మలం పూర్తిగా మట్టిలా మారిపోయింది. దానిని పంట చేలకు ఎరువుగా వేసుకుంటున్నారు. తొలగిన అపోహ.. మొదటి పిట్లో నిండిన మలంపై గతంలో అపోహలుండేవి. దానిని తోడి బయటకు పోయడానికి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్‌ను తెప్పించేవారు. దీని కోసం రూ. 2 వేల వరకు ఖర్చు అయ్యేది. అలా బయటికి తీసిన మట్టిని పెం ట కుప్పలపై పోసేవారు. అయితే, ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వ ఆర్డబ్ల్యూఎస్,శానిటేషన్ సెక్రటరీ పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వర్యం లో 23 రాష్ట్రాల సీనియర్ ఐఏఎస్ అ«ధికారులు, యూనిసెఫ్, స్వచ్ఛభారత్ అధికారులు గ్రామంలోని టాయిలెట్ల పిట్లను పరిశీలించడానికి వచ్చారు. ఉన్నతస్థాయి అధికారులు పిట్లలోకి దిగి మట్టిగా మారిన మలాన్ని ఎత్తిపోశారు. చేతులతో ఎత్తి పౌడర్లా మార్చి కాఫీ పౌడర్లా ఉందని, బ్లాక్ గోల్డ్ అని అభివర్ణిం చారు. పిట్స్‌ను ఖాళీ చేయడం, అందులోని మట్టిని పట్టుకోవడంలో ఇబ్బంది ఉండదని వారు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఇది ఆర్గానిక్ మాన్యూర్లో పంట చేలకు ఉపయోగపడే పోషకాలు ఉన్నాయని అధికారులు గ్రామస్తులకు వివరిం చారు. ఆ మట్టి శాంపిల్స్‌ను పరీక్షల కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎఫ్సీవో ల్యాబ్‌కు పంపారు. అందులో పంట చేలకు ఉపయోగపడే ఎన్పీకే(నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం) ఉన్నాయని నిర్ధారించారు. మారిన రైతుల ఆలోచన... కేంద్ర అధికారుల బృందం గ్రామానికి వచ్చిన తర్వాత గ్రామస్తుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. స్వయంగా తమ మరుగుదొడ్ల పిట్లను వారే ఖాళీ చేసి పంటచేలలో వేసుకుంటున్నారు. కొందరు బస్తాల్లో నిల్వచేసి పంటచేలకు వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ఎరువు కావాలని పొరుగువారు అడిగినా ఇవ్వడం లేదు. ఇప్పటికే చల్లా పెద్దమల్లయ్య, కూస లింగమూర్తి అనే రైతులు వంకాయ, వరి చేలలో వేసుకున్నారు. -
స్వచ్ఛభారత్‌లో జాతీయ స్థాయి విజేతగా దీప
పులివెందుల రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీలలో పులివెందులకు చెందిన నాగమణి దీప విజేతగా నిలిచింది. సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లెకు చెందిన శేషన్న, పద్మావతి దంపతుల కుమార్తె దీప ప్రస్తుతం విజయవాడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దీప స్వచ్ఛభారత్‌పై తెలుగు మీడియంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గతేడాది రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచింది. ఈ రిపోర్టులను అధికారులు జాతీయస్థాయి ఎంపిక కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరిశీలనలో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచినట్లు తల్లిదండ్రులు తెలిపారు. రాష్ట్రపతి నుంచి అవార్డు స్వీకరణ ఈనెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి విద్యార్థి నాగమణి దీప మెడల్ అందుకున్నారు. మెడల్‌తోపాటు రూ.38 వేలు విలువ చేసే ల్యాప్‌ట్యాప్, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జాతీయ స్థాయిలో రాణించిన దీపను నివేదిత పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్షీ్మనారాయణ, గౌరవ సలహాదారులు ఈశ్వరరెడ్డి, గంగిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు. -
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఆదిలాబాద్ రూరల్ :ఆదిలాబాద్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగా మల, మూత్ర విసర్జన రహిత జిల్లాగా రూపొందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన మరుగుదొడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, శానిటేషన్, కాంట్రాక్టు, రెగ్యులర్ వర్కర్స్ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో వివిధ విడతల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం వివరాలను ఆర్డబ్ల్యూఎస్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. రెండు విడతల్లో 2392 మరుగుదొడ్ల లక్ష్యంగా ఉండగా, ఇందులో 343 పూర్తరుునట్లు చెప్పారు. 740 నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. మిగతా 2049 పూర్తిచేయాల్సి ఉందన్నారు. మొదటి విడతలో 6394 మరుగుదొడ్లు నిర్మించేందుకు లక్ష్యం పెట్టుకోగా 4242 పూర్తి చేయడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లను త్వ రలో పూర్తయ్యేలా చూడాలని, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో జిల్లాను ముందుంచాలని ఆదేశించారు. జిల్లా లో పబ్లిక్ హెల్త్‌వర్కర్స్, పారిశుధ్య కార్మికులు స్వీపర్లుగా పంచాయతీ, బల్దియాల్లో ఫుల్‌టైం పనిచేస్తున్న వారి వివరాలు సేకరించి రిజిస్ట్రర్ ఈ పాస్ వెబ్సైట్ ద్వారా నమోదు చేయాలన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ, లోకల్ బాడీ ద్వారా చదువుతున్న దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ చెల్లింపుల కోసం వివరాలు నమోదు చేసి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ చెల్లింపులు చేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన డబుల్‌బెడ్ రూం నిర్మాణం కోసం అర్హతగల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల ని ర్మా ణం కోసం టెండర్లు వేగవంతం చేయాలని ఆదేశిం చారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మూర్తి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాజేశ్వర్, పీఆర్ ఈఈ మా రుతి, జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, దళిత శాఖ అధికారి కిషన్, మహిళా సంక్షేమ అధికారి ఉమాదేవి పాల్గొన్నారు. -
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్
►జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ►ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ : ప్రతీఒక్కరు స్వచ్ఛత వైపుగా అడుగేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా లు, పట్టణాల్లో స్వచ్చభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తూ యువత ఆదర్శంగా నిలవాలన్నారు. విద్యార్థులు సేవా దృక్పదాన్ని కలిగి ఉండి సమాజా ఉన్నతికి తమవంతు కృషి చేయాలని సూచించారు. భావిభారత పౌ రులు విద్యార్థులేనని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. అనంతరం ఐపీ స్టే డియంలోని పిచ్చిమొక్కలు, మైదానం చుట్టూ ఉన్న పి చ్చిమొక్కలు తొలగించి గుంతలను పూడ్చారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్దన్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త తిరుపతి రెడ్డి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తుల స్వచ్ఛభారత్
కదిరి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుర స్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో న్యాయమూర్తులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. చీపుర్లు చేతబట్టి కోర్టు భవనంతో పాటు ప్రాంగణం శుభ్రపరిచారు. వ్యతిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎస్ఎండీ ఫజులుల్లా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.ఆదినారాయణ అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
మలిన భారత విముక్తి పతాక
కొత్త కోణం భారతదేశ చరిత్ర అంతా అగ్రవర్ణాల చరిత్రేనంటే కొందరికి బాధ కలగొ చ్చుగానీ, అది సత్యం. అలాగే చరిత్రను ఎన్నడూ సమగ్రంగా లిఖించలే దన్నదీ ఒప్పుకోక తప్పని వాస్తవం. దళితుల చరిత్రను, అంటరాని చరిత్రను, పాకీ చరిత్రను, పాచి చరిత్రను ఎవ్వరూ తాకనైనా లేదు. అందుకే దళితు లెప్పుడూ తమ చరిత్రను తామే పునర్లిఖిస్తూ వచ్చారు. చింకి పాతల్లోంచి, మరుగున దాగిన మురుగులోంచి, దేహంనిండా పులుముకున్న మలినా ల్లోంచి, వెలివాడల మూలల్లోంచి, దగాపడ్డ బతుకుల్లోంచి, చెరచబడ్డ మానా ల్లోంచి, మానవ హననాల రక్తసిక్త జీవితాల్లోంచి తమ చరిత్రను తామే రాసు కున్నారు. లిఖిత రూపం దాల్చని ఆ గత చరిత్రను ఇకపై ఏ దళిత జీవితం లోనూ వినరాకుండా చెరిపేయాలనుకుంటున్నారు. వేల ఏళ్లుగా సమాజానికి వెలకట్టలేని సేవలు అందించిన దళితుల మలిన జీవితాల్లోని ఆ అధ్యాయా లను సమూలంగా మార్చేయాలనుకుంటున్నారు. మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే (మాన్యువల్ స్కావెంజింగ్) అమానవీయమైన, నీచాతి నీచమైన, దుర్మార్గ వ్యవస్థను తుడిచిపెట్టేయడం కోసం మూడు దశాబ్దాలకు పైగా ‘సఫాయీ కర్మచారీ ఆందోళన్’లో నిర్విరామ కృషి చేసిన బెజవాడ విల్సన్... పాకీ పని చేసే తల్లిదండ్రుల కడుపు పంట. దళితుల తొలి మెగసెసె ‘‘మాన్యువల్ స్కావెంజింగ్ స్వచ్ఛందంగా ఎన్నుకున్న వృత్తి కాదు. కులం వలన కొందరు బలవంతంగా ఈ వృత్తిలోకి విసిరివేయబడుతున్నారు. ఇది గౌరవప్రదమైన వృత్తికాదు. అనారోగ్యకరమైనది, అపరిశుభ్రమైనది. ఫలానా కులంలో పుట్టడం వల్ల ఈ వృత్తినే ఎన్నుకోవాలనే దుర్మార్గ వివక్ష నుంచి ఇది ఉనికిలోనికి వచ్చింది’’ అంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ నెవి పిళ్లై ప్రకటించారు. మానవ మల మూత్రాలను చేతితో ఎత్తి, తట్టలో వేసి నెత్తిమీద పెట్టుకొని ఊరిబయట పారవేసేవారి బాధలను జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్ళిన దళిత నేతలలో బెజవాడ విల్సన్ ప్రథముడు. ఈ సమస్య పరిష్కారానికి ఐరాస ప్రయత్నించడానికి ప్రేరణగా నిలిచిన వారిలో ఆయన ముఖ్యులు. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనకు విల్సన్ చేస్తున్న కృషికి మన దేశంలో కంటే ప్రపంచ మానవ హక్కుల ఉద్యమాల నుంచి బలమైన మద్దతు లభిస్తున్నది. అందులో భాగంగానే ఆయన 2009లో ‘‘అశోక ఫెలో’’గా ఎన్నిక కావడాన్ని, నేడు ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డుని సొంతం చేసుకోవడాన్ని చూడాలి. ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ మూడవ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరిట ఏటా ఇచ్చే ఈ అవార్డు 2016లో బెజవాడ విల్సన్‌కు దక్కింది. ఇది మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థ నిర్మూలనకోసం పోరాడుతోన్న వారికి ఓ ప్రోత్సాహం. భారతదేశంలో అంటరాని కులాల సమస్యలపై పోరాడుతోన్న నాయకులకు ఈ అవార్డు లభించడం ఇదే మొదటిసారి. అమానుష వ్యవస్థకు శాస్త్రాలు, పురాణల వత్తాసు గతంలో కొన్ని ఇతర దేశాలలో కూడా మాన్యువల్ స్కావెంజింగ్ వంటి విధనాలు ఉన్నా ఒక వర్గమో, కులమో, తెగనో ఈ పనిని చేసేది కాదు. మన దేశంలో ఇది ఒక కులవృత్తిగా మొదలయ్యింది. మలం అంటుకోరానిది కనుక, అంటరాని వారు మాత్రమే చేయదగ్గ పనిగా మానవ మలాన్ని ఎత్తివేసే నికృష్టమైన పనిని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న దళితులకు అంటగట్టారు. అదే పనిలో గత 4,000 ఏళ్లుగా దళితులు మునిగి తేలుతున్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ మనిషిగా పుడతాడు. కులంగా మారతాడు. ఫలానా కులంలో పుట్టినందుకు గౌరవాన్నో, ప్రతిష్టనో లేక అవ మానాన్నో, ఏహ్యభావాన్నో మూటగట్టుకుంటాడు. మనుధర్మం, పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు ఆ మనిషి జీవితాన్ని శాసిస్తాయి. ఇలాగే బ్రతకా లనో, ఇది మాత్రమే తినాలనో, ఈ మలినాలను ఎత్తివేయాలనో, ఏ విషపు బావుల్లోనో దిగి ఊపిరాడక చచ్చి పుణ్యం కట్టుకోవాలనో పురాణాలు బోధి స్తాయి. భారత, రామాయణాల్లోని ఎన్నో ఉపకథల్లో కూడా ఇదే చెప్పారు. అంటే, ఈ పనులు దైవ నిర్దేశిత కార్యాలని నమ్మించారు. దానితో ఆ కులాల వారు తమ తలరాత ఈ విధంగా ఉన్నందువల్లనే, ైదె వం తమను ఈ విధంగా పుట్టించినందునే ఈ వృత్తిలోనే బతుకుతూ, అందులోనే కడతేరి పోవడమే ధర్మమనినమ్మేలా హిందూ ధర్మ శాస్త్రాలు చేయగలిగాయి. పవిత్రత బూటకం...కులం ఆడే నాటకం మహాత్మాగాంధీ లాంటి వాళ్ళు సైతం పాకీ పనిని దేవుని కార్యంగా ప్రచారం చేశారు. తనకు మరో జన్మంటూ ఉంటే భంగి (పాకీపనిచేసే) కులంలో పుట్టాలనుకుంటున్నానని ఆయన ప్రకటించారు. నేటి మన ప్రధాని నరేంద్ర మోదీ సఫాయి పనిని స్వచ్ఛ భారత్‌లో భాగం చేశారు. తెల్ల బట్టలతో రోడ్డు మీదకు వచ్చి చీపుర్లు పట్టుకొని ఫొటోలు దిగి వెళ్ళిపోయారు. కానీ మల మూత్రాలను విసర్జించే డ్రై లెట్రిన్ల దగ్గరికి వెళ్ళి, చేతితో మలం తీసి, తట్టలో తలపైన ఎత్తుకొని పోయి ఉంటే ఇది ఎంతటి పవిత్రమైన కార్యక్రమమో, స్వచ్ఛ భారత్‌కి భారతావని ఎంత దూరంలో ఉన్నదో మోదీకి స్పష్టంగా అర్థమయ్యేది. ‘‘పాకీ పని ఓ పవిత్రమైన పని అని మోదీ ప్రకటించారు సరే.. అది అంత పవిత్రమైనదైతే మోదీని కూడా ఈ పనిచేయమని నా మిత్రులు కొందరన్నారు. కానీ దళితులే కాదు, మోదీ సహా ఏ మనిషీ ఇటువంటి అమా నవీయమైన పనిని చేయాలని నేను కోరుకోవడం లేదు. ఇది మనుషులు చేసే పనికాదు. మనిషి తన శాస్త్రీయ పరిజ్ఞానంతో విశ్వాంతరాళాల్లో విహరిస్తు న్నాడు, అటువంటి మనిషిని అత్యంత నీచమైన పని నుంచి విముక్తిచేసే పరికరాన్ని ఎందుకు కనుగొనలేకపోయాడు?’’ అని విల్సన్ అన్నారు. సఫాయీ, పాకీ పనిపైన రాజకీయంగా ధ్వజమెత్తిన అంబేడ్కర్... కుల వ్యవస్థను సమర్థించే గాంధీ పైన భావజాల యుద్ధాన్ని ప్రకటించారు. ‘‘పాకీ పని పవిత్రమైనదైతే అందరినీ చేయాలని ప్రోత్సహించాలి. కేవలం అంట రాని కులాలను మాత్రమే అందులో ఉండమని, పైగా ఆ పని చేస్తున్నందుకు గర్వించాలని చెప్పడం గాంధీకి ఒక్కడికే సాధ్యం’’ అని ఆయన విమర్శిం చారు. అంతేకాదు, అంటరాని కులాలు పాకీపని నుంచి బయటపడాలని అనేక సార్లు పిలుపునిచ్చారు. కుల వ్యవస్థను, పాకీ పనిని కొనసాగిస్తున్న హిందూ వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంటరానితనం నిర్మూలన కావాలంటే కుల నిర్మూలన జరగాల్సిందేనని కూడా ప్రకటించారు. అయితే 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో అంటరాని కులాలు సాటి మనుషులుగా మనగలగడానికి కొన్ని హక్కులను పొందుపరచారు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధం. అయితే తరతరాల నుంచి దళితులను వారసత్వంగా వెంటాడుతోన్న పాకీ పని మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ సమస్య మీద ఎన్నో సంఘాలు, వ్యక్తులు అంబేడ్కర్ స్ఫూర్తితో ఉద్యమిం చాయి. ఫలితంగానే 1993లో మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధిస్తూ చట్టం వచ్చింది. ఇక్కడ మానవ హక్కుల కార్యకర్తలుగా బెజవాడ విల్సన్ లాంటి వారు ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ చట్టం అమలులోని లోపాలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బయటపెట్టడానికి 1994లో సఫాయి కర్మచారీ ఆందోళన్ ఏర్పడింది. దీని నిర్మాణంలో విల్సన్‌ది కీలక పాత్ర. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ చైర్మన్‌గా ఈ సంస్థ హైదరాబాద్‌లోనే ప్రారంభం కావడం విశేషం. నిజమైన స్వచ్ఛ భారతం ఎంత దూరం? బెజవాడ విల్సన్ కర్ణాటక రాష్ర్ట్రంలోని కోలార్ పట్టణంలో ఒక మాన్యువల్ స్కావెంజింగ్ సఫాయీ కార్మిక కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఈ అమానుష వ్యవస్థలోని దుర్మార్గాన్ని, దానివల్ల కలిగే తీవ్ర అనారోగ్యాన్ని, ఏర్పడే ప్రాణహానిని, మొత్తంగా ఈ వ్యవస్థలోని బానిసత్వ భావజాలాన్ని సహించలేకపోయిన విల్సన్... మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనే జీవన లక్ష్యంగా ఎంచుకున్నారు. 2001లో దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో జరిగిన వర్ణ వివక్ష వ్యతిరేక సదస్సులో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా మలచడా నికి 2003లో ఢిల్లీకి తన కార్యస్థలాన్ని మార్చాడు. మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధిస్తూ చట్టం చేసినా, ఆ అమానుషా వ్యవస్థను నిర్మూలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతు న్నాయంటూ 2004లో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇట్లా ఈ సమస్య పరిష్కారానికి జరుగుతున్న ఉద్యమం సత్ఫలితాలను ఇచ్చింది. ఎంతో మంది పాకీ పని నుంచి విముక్తి పొందడానికి ముందుకు వచ్చారు. 1993కి ముందు 30 లక్షల మంది ఈ పనిలో ఉంటే... ప్రస్తుతం ఆరు లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చూపుతున్నాయి. వీరికి పునరావాసం కల్పించాలని చట్టంలో పేర్కొన్నా ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపడం లేదు. పాకీ పనివారి పునరా వాసం కోసం వంద కోట్లు కూడా కేటాయించలేకపో వడమే స్వచ్ఛ భారత్‌పై వారికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. స్వచ్ఛ భారత్ అంటే రోడ్ల మీద పైపైన ఉండే మామూలు చెత్తని ఊడ్చివేయడం కాదు. తరతరాలుగా చెత్తలో, మురికిలో, మానవ మలంలో మునిగితేలుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిని ఆ పనిలో నుంచి బయట పడేయడం. అదే స్వచ్ఛభారత్‌కి నిజమైన అర్థం కావాలి. పబ్లిక్ టాయ్‌లెట్స్ పేరుతో ప్రభు త్వాలు కడుతున్న అద్దంలాంటి భవనాలలో కూడా వాటిని శుభ్రం చేసేది ఈ అంటరాని కులాలే. అందుకే ఇంకా లక్షలాది మంది నెత్తిమీద మలం మోస్తూనే ఉన్నారు. ఈ అమానవీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే మురికిలో, మలినంలో బతుకుతున్న వారి మధ్య బతకడమే. అది ఒక్క బెజవాడ విల్సన్‌కి మాత్రమే సాధ్యమైంది. అయినా అతనొక్కడే ఈ మహోద్యమాన్ని కొనసాగించలేడు. మరెందరో ఈ దుర్మార్గాన్ని పాతిపెట్టడానికి ముందుకు రావాలి. (వ్యాసకర్త:మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు) మొబైల్ : 97055 66213 -
‘స్వచ్ఛభారత్ ప్రచారంలో బిగ్ బీ’
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులకు సంబంధించి పనామా పేపర్స్‌లో పేరు రావడంతో ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమ ప్రచారంలో భాగం కాలేకపోయిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కేంద్రం మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచారంలో పాలుపంచుకోవాలని అమితాబ్‌ను కోరుతూ కే ంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్20న లేఖ రాసింది. -
‘శుభ్రతపై మా ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కటే’
ముంబై: పర్యావరణం, పరిశుభ్రత విషయంలో తన, ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలు ఒక్కటేనని బాలీవుడ్ నటి కాజోల్ వ్యాఖ్యానించారు. హిందుస్తాన్ యూనీలీవర్ ‘హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ 5’ ప్రచారంలో భాగంగా బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆమె కలిశారు. ‘మోదీ స్వచ్ఛభారత్.. చేతిశుభ్రతపై మేము ప్రారంభించిన కార్యక్రమం రెండూ శుభ్రతకు సంబంధించినవే కావడం యాదృచ్ఛికం. మేము ఒకే దారిలో ఉన్నాం. మా లక్ష్యం కూడా ఒక్కటే’ అని కాజోల్ అన్నారు. -
కళలు సామాన్యులకు చేరాలి: మోదీ
ముంబై: చిత్రలేఖనం, శిల్పం, సంగీతం వంటి కళలు సమయం, కులం, మతం, జాతులకు అతీతమైనవని, వీటికి ఎలాంటి హద్దులు లేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కళలను సామాన్యులకు చేరువ చేయాలని, వీటి ద్వారా స్వచ్ఛభారత్ వంటి సామాజిక అంశాల విషయంలో ప్రజల్లో చైతన్యం నింపాలని ఆయన కోరారు. మాటలకంటే కళారూపాల్లో ఇచ్చే సందేశాలే ప్రజలకు సులభంగా అర్థమవుతాయని మోదీ పేర్కొన్నారు. శనివారం ప్రధాని ముంబైలోని బాంద్రాలో బాంబే ఆర్ట్ గ్యాలరీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కళలు ధనికవర్గాలకే పరిమితం కాకూడదని అన్నారు. సమాజానికి అవి దన్నుగా ఉండాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఉండే ఖాళీ ప్రదేశాల్లో యువకళాకారులు తమ పెయింటింగ్‌లు, ఇతర కళారూపాలను ప్రదర్శించడానికి వీలుకల్పించాలని సూచించారు. ఈ విషయంలో తాను రైల్వే శాఖతో మాట్లాడానని చెప్పారు. తద్వారా సామాజిక సందేశాలను ప్రజలకు చేరువచేయవచ్చని అన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో మాటలకంటే కళారూపాలద్వారానే ప్రజలను చైతన్యపరచడానికి ఎక్కువ అవకాశముంటుందన్నారు. పెయింటింగ్‌లు, ఇతర కళారూపాలను తీర్చిదిద్దే ప్రక్రియలో డిజిటల్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయసులోనే కళలపట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులను తరచూ ఆర్ట్ గ్యాలరీలకు తీసుకెళ్లాలని పాఠశాలలకు సూచించారు. -
కాలుష్య రహిత రహదారులు
- ఐదేళ్లలో రూ.5వేల కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం: గడ్కారీ సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్-కాలుష్య ముక్త్ భారత్ నినాదంతో కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఐదు లక్షల కోట్ల రూపాయలను జాతీయ రహదారుల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో వెచ్చించనున్నామని, అందులో నుంచి ఒక శాతం... ఐదు వేల కోట్లు జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమానికి కేటాయిస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. దీంతో జాతీయ రహదారులు నిర్మాణాలు జరిగే గ్రామాల్లోని రైతు లు, నిరుద్యోగులు, మహిళలకు ఉపాధి కల్పించాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఢిల్లీ లో మంగళవారం నిర్వహించిన హరిత జాతీ య రహదారులవిధానంపై జరిగిన సదస్సులో గడ్కారీ మాట్లాడారు. దేశంలోని 48లక్షల కి.మీ రహదారుల్లో, 96వేల కి.మీ జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. రాను న్న రోజుల్లో 1.50 లక్షల కి.మీ వరకు జాతీయ రహదారులను విస్తరిస్తామన్నారు. దేశంలోని ట్రాఫిక్‌లో 20 శాతం జాతీయ రహదారులపైనే ఉంటోం దని, ప్రతి ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.50 లక్షల మంది చనిపోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన నాలుగు లేన్ల విస్తరణకు చర్యలు చేపట్టనున్నామన్నారు. వాహన కాలుష్య నివారణకు రానున్న రెండేళ్లలో పెట్రో, డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలను రోడ్లపైకి తీసుకురానున్నామన్నారు. మురుగునీటిని రీస్లైకింగ్తో పునర్వినియోగిస్తామన్నారు. పర్యావరణ రక్షణకు కృషి చేసేవారికి జాతీయ స్థాయిలో 3, రాష్ట్రస్థాయిలో ఒక్కోటి చొప్పున అవార్డులను అందచేస్తామని గడ్కరీ చెప్పారు. -
జూన్ చివరికి స్వచ్ఛభారత్‌పై తుది నివేదిక
సబ్ కమిటీ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ అభియాన్‌పై తుది నివేదికను జూన్ చివరి నాటికి కేంద్రానికి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, సబ్ కమిటీ కన్వీనర్ చంద్రబాబు చెప్పారు. నీతి ఆయోగ్‌లో గురువారం స్వచ్ఛభారత్ అభియాన్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఏర్పాటైన సబ్ కమిటీ తొలి సమావేశంలో సీఎంలు చంద్రబాబు, మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), సిద్దరామయ్య (కర్ణాటక) హాజరయ్యారు. సమావేశానికి వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనివార్యకారణాల వల్ల గైర్హాజరయ్యారు. ఏపీ మంత్రి పి.నారాయణ, రాష్ట్రాల మంత్రులు దినేశ్ అగర్వాల్ (ఉత్తరాఖండ్), ఆసిం అహ్మద్ ఖాన్ (ఢిల్లీ), రంజిత్ పాటిల్ (మహారాష్ట్ర) లతో పాటు అధికారులు హాజరయ్యారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛభారత్ విధి విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై చర్చించామన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయడం కోసం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ సమన్వయకర్తగా ఉంటారని, తొమ్మిది రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు వర్కింగ్ గ్రూప్‌లో సభ్యులుగా ఉంటారని, వారు ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తారని చెప్పారు. రెండో సమావేశం ఈ నెల 15న చండీగఢ్‌లో ఉంటుందని, మూడో సమావేశాన్ని దక్షిణాదిన నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర మంత్రులతో భేటీలు: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులతో చంద్ర బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రస్తావించారు.అనంతరం టీడీపీపీ కార్యాలయంలో మంత్రులు సుజనా చౌదరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పార్లమెంటు ప్రాంగణంలో బాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భూసేకరణపై వెల్లువెత్తుతున్న విమర్శలపై అడగ్గా.. రాష్ట్రాభివృద్ధికోసమే భూసేకరణ చేస్తున్నామని, భూమిలేకుండా అభివృద్ధి జరగదన్నారు. రాహుల్‌గాంధీ ఏపీ పర్యటనపై అడగ్గా.. ఆయన పర్యటనతో ఏపీకి ఒరిగేదేమీలేదని ఎద్దేవా చేశారు. జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శన ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతం ఓఖ్లా, తిమార్‌పుర్‌లోని చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. నేడు తూర్పుగోదావరికి చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు మేడే రోజున తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. జిల్లాలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
డ్రైనేజీ బతుకులు
-
డ్రైనేజీ బతుకులు
స్టార్ రిపోర్టర్ - ఉత్తేజ్ నగరంలో అద్దాల్లా మెరిసే రోడ్ల పొడవునా.. భూగర్భంలో పరుచుకున్న అంధకూపాలకు పాలకులు వాళ్లు. తెల్లవారడంతోనే వీరి బతుకులు మురుగులో కూరుకుపోతాయి. పొద్దెక్కే వరకూ అందులోనే మురిగిపోతాయి. ఊపిరి సలపనివ్వని దుర్గంధంలో గంటల తరబడి పని చేస్తే గానీ వారి బతుకులు ముందుకు సాగవు. సాటి మనుషులు ఇదేం పనని మలినంలా చూస్తున్నా.. పొట్టకూటి కోసం మలినంలోనే మసలుతుంటారు. అదే మనుషుల వ్యర్థాలతో పేరుకుపోయిన మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసి.. అందరికీ స్వస్థత చేకూరుస్తారు. మురికిలో మగ్గుతున్న ఆ కార్మికులను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా నటుడు ఉత్తేజ్ పలకరించారు. హలో అంటూ వారితో చేయి కలిపి ఆ మనసులోని మాటలు మన ముందుంచారు. ఉత్తేజ్: స్వచ్ఛ భారత్.. దేశం మొత్తం వినిపిస్తున్న మాట. నిజానికి మనం స్వచ్ఛ బారత్ నినాదాలం మాత్రమే. మీరు స్వచ్ఛ భారత్‌కు పునాదులు. డ్రైనేజ్ క్లీనర్స్.. ఈ మాట పలుకుతుంటేనే ముఖం చిట్లిస్తారు. కానీ, మీరే లేకుంటే మేం రోడ్డుపై ఒక్క నిమిషం నిలబడలేం. మీరు మురికిలో ఉంటూ మమ్మల్ని శుభ్రంగా ఉంచుతున్నారు. చెప్పండి భయ్యా ఎలా ఉన్నారు? యాదయ్య: చూస్తున్నరు కదా సార్! మురికిగుంటల పని చేసుకుంటున్నం. ఉత్తేజ్: మీరు ఈ పనిచేయవట్టే కదా! మేమింత హాయిగా ఉన్నాం. లేదంటే మ్యాన్‌హోల్స్‌లో పడి కాదు.. రోడ్డుపై పారే బురదలో కొట్టుకుపోయే వాళ్లం. వెంకటేష్: మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు సంతోషం సార్. రాములు: అవ్ సార్.. మమ్మల్ని చూసి మా చుట్టాలే దూరం జరుగుతరు. యాదయ్య: పనైపోయినాంక స్నానం చేసే ఇంటికి వోతం. అయినా వాసనొస్తుందంటరు. ఉత్తేజ్: తప్పు భయ్యా.. చిన్న పిల్లల మలమూత్రాలు ఎత్తిపోసే అమ్మ ఎంత గొప్పదో.. వీధుల్లో డ్రైనేజీ క్లీన్ చేసే మీరు అంతేనయ్యా. అంజయ్య: గట్ల అర్థం చేసుకునేటోళ్లు ఎవరు సార్ ! ఉత్తేజ్: బతకడానికి ఎన్నో వృత్తులుండగా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? రాములు: బతకడానికే సార్. గీ పనీ దొరకక బాధలు పడేటోళ్లు చానామందున్నరు. యాదయ్య: సార్ మేం ఉండేది జనగాం దగ్గర. పని చేసేది ఖైరతాబాద్‌లో. ఉత్తేజ్: ఎక్కడ జనగాం.. ఎక్కడ ఖైరతాబాద్ ! పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరుతావు ? యాదయ్య: మూడు గంటలకు సైకిల్ మీద రైలు స్టేషన్‌కు పోత. ఆడ రెలైక్కి సిటీల దిగుత. మళ్లీ బస్సెక్కి ఖైరతాబాద్ చేరుకుంట. ఉత్తేజ్: ఓ మైగాడ్.. ఈ పని చేయడానికా? రాములు: అంతేగా సార్. పొట్టకూటి కోసం.. ఏదో ఒకటి చేసుకోవాలే. ఉత్తేజ్: మీ పని వేళల గురించి చెప్పండి? మహ్మద్ చాద్మియ: పొద్దుగాళ్ల ఏడు గంటలకే షురువైతది. అంతేనా.. ఎప్పుడు ఫోనొస్తే అప్పుడు ఉరకాలే. మేం బండి మీద పని చేసేటోళ్లం. ఏడ కంప్లైంటొస్తే ఆడికి పోతం. ఉత్తేజ్: మురిగునీటిపై వాలిన దోమలు, ఈగలు ఇంట్లోకి వస్తేనే రకరకాల జబ్బులొస్తాయంటారు కదా! అలాంటిది మీరు పొద్దంతా మ్యాన్హోల్స్లోనే ఉంటారు. మరి మీ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? అంజయ్య: జ్వరాలొస్తయ్. దగ్గు, దమ్ము ఉండనే ఉంటయి. చర్మరోగాలు ఎక్కువొస్తుంటయి. ఉత్తేజ్: అలాంటి జబ్బులొచ్చినప్పుడు మీకు ఉచితంగా వైద్యం అందుతుందా? యాదయ్య: ఎన్ని జబ్బులొచ్చినా.. డాక్టర్ కాడికి పోతే సొంతం పైసలే పెట్టుకోవాలే. సర్కార్ నుంచి ఏ సాయం ఉండదు. ఉత్తేజ్: చాలాసార్లు విన్నాను. మీ కార్మికులు పనులు చేస్తూ మ్యాన్‌హోల్‌లో పడి గాయాలపాలైనట్టు.. ప్రాణాలు కోల్పోయినట్టు..! వెంకటేష్: చిన్న చిన్న దెబ్బలు తగిలితే వెంటనే మా ఆఫీసుల మందురాసి కట్టుకట్టేటోళ్లు ఉంటరు సార్. పెద్ద దెబ్బలు తాకితే సర్కార్ దవాఖానకు పోతం. అప్పుడప్పుడూ ఊపిరాడకనో.. దెబ్బ బలంగా తాకో ప్రాణాలే పోతయ్ సార్. ఉత్తేజ్: మ్యాన్‌హోల్‌లో పడి సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వార్తలు పేపర్లో చదువుతుంటాం. దానికి కారణం ఎవరు..? మీరు కాదంటారా ? రాములు: కచ్చితంగా మేం కాదు సార్. రోడ్డుపక్కన షాపుల వాళ్లు వారి షాపు ముందు నిలిచిపోయిన నీళ్లు పోయేందుకు రాత్రి పూట అక్కడున్న మ్యాన్‌హోల్ మూత తీసి పక్కన పెడ్తరు. నీళ్లు పోయినాంక మూత పెట్టరు. మేం చూస్తే మూసేస్తాం. లేదంటే అది గట్లనే ఉంటది. ఈ విషయం తెల్వక అందరూ మమ్మల్ని అంటరు. ఉత్తేజ్: రోడ్డుపై మ్యాన్‌హోల్స్ పక్కన లోపలి నుంచి తీసిన చెత్తను కుప్పగా పెట్టి వదిలేస్తారు? దాని వల్ల దుర్వాసనతో పాటు రోడ్డంతా పాడవుతుంది కదా? వెంకటేష్: అది మా పొరపాటే సార్. దానికీ కారణం ఉంది. మా దగ్గర మ్యాన్‌హోల్స్‌లో దిగి క్లీన్ చేసే ఉద్యోగులు చానమంది ఉన్నరు. చెత్త తీస్కవోయేటోళ్లు, బండ్లు తక్కువున్నయి. మహ్మద్ చాద్మియ: అదొక్కటే కారణం కాదు సార్. గప్పట్ల ఏడపడ్తే ఆడ చెత్తకుండీలు ఉండేటియి. మేం ఎండిపోయిన చెత్తను తీస్కవోయి వాటిల్ల వేసేటోళ్లం. ఇప్పుడు కాలనీలళ్ల చెత్తకుండీలు పెట్టనిస్తలేరు. దాంతో ఎప్పటికప్పుడు చెత్తను తీసేయ్యడం కష్టమైతుంది. ఉత్తేజ్: మీకు జీతాలు ఎట్లుంటయి భయ్యా ? యాదయ్య: ఏదో ఉంటయి సార్. ఐదేళ్లు అనుభవం ఉంటే పది,పదిహేను వేల దాకా వస్తుంది. కానీ ఇప్పటి ఖర్చులకు ఏడ సరిపోతది సార్. ఈ సిటీల సంసారమంటే గీ ైపైసలు ఏడికి రావు. ఉత్తేజ్: మీకు సొంతిళ్లో, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లో ఏమన్న ఉన్నాయా..? రాములు: అందరం అద్దె ఇళ్లల్లనే ఉంటున్నం సార్. ఉత్తేజ్: చివరి ప్రశ్న.. మీరు మందుకొట్టి ఈ పనిచేస్తారని అంటారు నిజమేనా? అంజయ్య: మామూలుగా మ్యాన్‌హోల్ దగ్గరికి వస్తేనే కళ్లు తిరుగుతయ్. గసొంటిది తాగి దాంట్లకు దిగితే మళ్లీ పైకొస్తమా సార్. ఏ మాత్రం తేడా అయినా.. లోపల పడి చస్తం. పని అయినాంక మాత్రం తాగుతం. కష్టం మరచిపోనికి తాగుతం సార్. ఉత్తేజ్: ఓ.. సారీ. నేను ఎక్కడో విని మిమ్మల్ని అడిగాను. మీరు చెప్పిన మాట నిజమే. బుర్ర సరిగా పని చేయనపుడు మ్యాన్‌హోల్ చుట్టుపక్కలకు రావొద్దు. చాలా ప్రమాదం. జగ్గయ్య: అంతేగా సార్. ఉత్తేజ్: రోడ్డుపై నుంచి వెళ్తున్నప్పుడు ఓపెన్ చేసి ఉన్న మ్యాన్‌హోల్ కనిపించగానే కారు అద్దాలు ఎత్తేసుకుంటాం. అలాంటిది అందులోకి దిగి అక్కడ జీవన పోరాటం సాగించే మిమ్మల్ని కలసి మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది భయ్యా. థ్యాంక్యూ. ఉత్తేజ్: ఇక బయలుదేరుతాను.. చెయ్యి ఇవ్వండి యాదయ్య: అయ్యో వద్దుసార్. అంతా బురదవట్టింది. వాసనొస్తది. ఉత్తేజ్: నీ చెయ్యి మురికిగా ఉంది కాబట్టే మేమంతా శుభ్రంగా ఉన్నాం. ఒక్కసారికి ఏం కాదు. -
ఉద్యోగాలిస్తానని.. చీపుర్లు చేతికిచ్చాడు!
మోదీపై రాహుల్ విసుర్లు చాయిబసా(జార్ఖండ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛభారత్ లక్ష్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో అందరికీ ఉద్యోగాలిస్తానంటూ హామీలిచ్చి.. ఇప్పుడు వీధులూడ్చండి అంటూ చీపురుకట్టలు చేతికిస్తున్నాడ’ని మోదీని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల సమయంలో మీ కోసం నేను ఉద్యోగాలు కల్పిస్తా.. ఫ్యాక్టరీలు, రోడ్లు, విమానాశ్రయాలు నిర్మిస్తా అని చెప్పి.. అధికారంలోకి రాగానే మీరు వీధులూడ్చండి, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయారు’ అని పశ్చిమ సింగ్బూమ్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలనేది కాంగ్రెస్ వైఖరి కాగా.. అధికారమే పరమావధిగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీని 10 మంది పారిశ్రామిక వేత్తల ప్రధానిగా రాహుల్ అభివర్ణించారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, భూసేకరణ చట్టాలను రూపొందించి కాంగ్రెస్ ప్రజల సాధికారత కోసం కృషి చేసిందన్నారు. పారిశ్రామికవేత్తల కోసం ఇప్పుడు భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘మనకు కావాల్సింది అభివృద్ధి సాధించే ప్రభుత్వమే కానీ వీధులు శుభ్రపరిచేవారి ప్రభుత్వం కాద’ని వ్యాఖ్యానించారు. -
24 గంటల్లో తేల్చండి
లేదంటే అత్యవసర సేవలు బంద్ ప్రభుత్వానికి జూడాల హెచ్చరిక గాంధీ ఆస్పత్రి : తమ సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వివిధ రూపాల్లో వారు నిరసన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు లేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పడుతున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపజేసింది. తొలుత వారు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, డీఎంఈలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ సందర్భంగా గాంధీ జూడాల సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన భవనం నుంచి ఇందిరా పార్కు వరకు మహార్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి 24 గంటల గ డువుఇస్తామని, అప్పటికీ స్పందించకుంటే తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. జూడాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ రామంతాపూర్: రామంతాపూర్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో పెండింగ్‌లో ఉన్న స్టైపండ్ చెల్లించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం కళాశాల ప్రాంగణంలో చెత్తా చెదారాన్ని తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిప్రతాప్, సందీప్, సంధ్య, లిఖిత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన ఆందోళన సుల్తాన్‌బజార్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాలు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన ఉద్ధృతం చేయనున్నట్లు జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
సుందర నగరంగా సింహపురి
సాక్షి, నెల్లూరు: రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని సుందర సింహపురిగా తీర్చిదిద్దుతానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఆదివారం నెల్లూరులో చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. జాతి నేతల విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు వీధులను ఊడ్చిన తర్వాత ర్యాలీ, సభ నిర్వహించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నెల్లూరు నుంచే మహోద్యమంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహం ఉంటే ప్రోత్సాహం ఉంటుందని, స్వచ్ఛభారత్‌ను జయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యక్తిగత శుభ్రతపై పెడుతున్న దృష్టి ఇల్లు, వీధి, బడి, గుడి, ఊరిపైనా పెట్టి అంతా శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు అధికారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులతో పాటు అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం స్వచ్ఛభారత్‌పై అందరితో ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో నెల్లూరును అభివృద్ధి పథంలో నడుపుతానన్నారు. మా ఊరు నెల్లూరు పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొదట అందరూ కలిసి జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు, అంబేద్కర్, గాంధీ విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు వీధులను ఊడ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కురుగొండ్ల రామకృష్ణ, మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్, టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
పాదయాత్ర చేసి... భరోసానిచ్చి...
బెజవాడలో సీఎంచంద్రబాబు బిజీబిజీ స్వచ్ఛభారత్, ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా పథకాలు ప్రారంభం రాజధానికి రూ.3.60 కోట్ల విరాళాలు సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేశారు.పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నగర శివారు ప్రాంతాల్లో సుమారు గంట సేపు కాన్వాయ్ ద్వారా పర్యటించి రాజధానిలోని ప్రాంతాలు, స్థితిగతులను తెలుసుకున్నారు. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా పథకాలకు గురువారం విజయవాడలో శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వచ్చింది మొదలుకుని తిరిగి వెళ్లేంత వరకు బిజీబిజీగా గడిపారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన నేరుగా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు వెళ్లకుండా విజయవాడ నగర పరిస్థితిని పరిశీలించేందుకు బయలుదేరారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ రూట్‌ను ఎంపిక చేసి సుమారు గంటపాటు సుడిగాలి పర్యటన చేశారు. గన్నవరం నుంచి నిడమానూరు మీదుగా ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఏలూరు రోడ్డు మీదుగా బీఆర్టీఎస్ రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్, పాలప్రొజెక్టు ఫ్లై ఓవర్, వైఎస్సార్(జేఎన్ఎన్యుఆర్ఎం) కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, పైపుల రోడ్డు ప్రాంతాలను కాన్వాయ్ నుంచే కేంద్రమంత్రితో కలిసి పరిశీలించారు. మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సింగ్‌నగర్ పైపుల రోడ్డు సెంటర్లో జాతిపిత విగ్రహానికి పూలమాల వేసిన బాబు నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి మార్గమధ్యంలో పలువురితో మాట్లాడారు. పాదయాత్రతో పాటుగా సీఎం, కేంద్ర మంత్రి సైడుకాల్వల్లో పూడికలు తీసి, రోడ్డు ఊడ్చారు. అనంతరం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మొక్కలు నాటారు. పైపుల రోడ్డుసెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన బాబు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 12 గంటలకు ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్‌ను ప్రారంభించారు. అజిత్‌సింగ్ నగర్లో బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు’ సభలో వెయ్యి రూపాయల పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతుందని, తాను రోజుకో జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరి స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. మధ్నాహ్నభోజన విరామం తర్వాత కొద్దిసేపు విశాంత్రి తీసుకుని అక్కడి నుంచి ఇరిగేషన్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకున్నారు. సాయంత్రం 5.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. భారీగా విరాళాలు.... స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో సీఎంను కలిసిన పలువురు రాజధాని నిర్మాణం కోసం భారీగా విరాళాలు అందజేశారు. కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సోసైటీ చైర్మన్ మండవ జానకి రామయ్య, డెరైక్టర్లు జాస్తి రాధాకృష్ణ, ఆర్జా నరేష్, వల్లభనేని బాబురావు, రత్నగిరి, అంజిరెడ్డి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబుకు రూ .2కోట్ల చెక్కును అందజేశారు. అలాగే పాల ఉత్పత్తిదారుల సొసైటీ రైతులు రూ.1.50 కోట్లు , జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్వరరావు రూ .10 వేలు అందజేశారు. నగరపాలకసంస్థ ఉద్యోగులు, ఇతర సంఘాలవారు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సీఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యేలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, దాసరి బాలవర్థనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.