
సుందర నగరంగా సింహపురి
సాక్షి, నెల్లూరు: రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని సుందర సింహపురిగా తీర్చిదిద్దుతానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఆదివారం నెల్లూరులో చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. జాతి నేతల విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు వీధులను ఊడ్చిన తర్వాత ర్యాలీ, సభ నిర్వహించారు.
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నెల్లూరు నుంచే మహోద్యమంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహం ఉంటే ప్రోత్సాహం ఉంటుందని, స్వచ్ఛభారత్‌ను జయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యక్తిగత శుభ్రతపై పెడుతున్న దృష్టి ఇల్లు, వీధి, బడి, గుడి, ఊరిపైనా పెట్టి అంతా శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు అధికారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులతో పాటు అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
అనంతరం స్వచ్ఛభారత్‌పై అందరితో ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో నెల్లూరును అభివృద్ధి పథంలో నడుపుతానన్నారు. మా ఊరు నెల్లూరు పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొదట అందరూ కలిసి జవహర్‌లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు, అంబేద్కర్, గాంధీ విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు వీధులను ఊడ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కురుగొండ్ల రామకృష్ణ, మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్, టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.