రోడ్డు మీద ఉన్నాం. రద్దీలో ఉన్నాం. అత్యవసరంగా పక్కకు వెళ్లాలి. మగాళ్లయితే ఏదో ఒక పక్కకు వెళ్లొచ్చేస్తారు. ఆడవాళ్ల మాటేమిటి? సిటీల్లో పెద్ద సమస్య ఇది! ‘షీ’ అని ఉన్న చోటును చూసుకుని వచ్చే అవసరమా ఏమన్నానా?! సుష్మకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. బాగా ఆలోచించి.. ‘షీ’నే అవసరం ఉన్న దగ్గరకు రప్పించే మొబైల్ ‘షీ’ టాయ్‌లెట్‌ను ప్లాన్ చేసింది. ఇది ఆమె పరిచయం మాత్రమే కాదు. ‘ఆమె’ పరిచయం కూడా. చదవండి. సుష్మను అభినందించడానికి మీకింకా అనేక కారణాలు కనిపిస్తాయి.
సుష్మ కళ్లెంపూడి వైజాగ్‌లో పుట్టి పెరిగింది. గీతం యూనివర్శిటీలో బీటెక్ చేసి హైదరాబాద్‌లో సత్యం కంప్యూటర్స్‌లో ఉద్యోగం. ఇదంతా 2004లో. ఆ తర్వాత ఏడాది కోదాడ కుర్రాడు సుధీర్‌ని పెళ్లి చేసుకుని యూఎస్‌లో అడుగుపెట్టింది. తిరిగి పన్నెండేళ్ల తర్వాత దంపతులు కుటుంబం సహా ఇండియాకి వచ్చారు. ఇండియాకి ఏదైనా చేయాలని వచ్చారు. ‘సంపాదనలో విరామం– సమాజానికి సహాయం’ అని స్టెల్లా అనే అమెరికన్ ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పిన సూక్తిని ఒంటపట్టించుకుని మరీ ఇండియాకి వచ్చారీ దంపతులు. బాగా ఆలోచించాక.. మహిళలకు ఇల్లు దాటి బయటికి వచ్చినప్పుడు ఎదురయ్యే వాష్‌రూమ్ ఇబ్బందికి చెక్ పెట్టడం కోసం ‘షీ మొబైల్ టాయిలెట్’ అనే కాన్సెప్ట్‌ని రూపొందించుకున్నారు సుష్మ. ‘‘అయితే అందుకు బీజం పడింది మాత్రం అమెరికా వెళ్లకముందే..’’ అని చెప్పారామె.
పెళ్లికి ముందు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవు రోజుల్లో ఫ్రెండ్స్‌తో కోఠీ వంటి రద్దీగా ఉండే మార్కెట్ స్థలాలకు వెళ్లినప్పుడు ఎదురైన అవసరాన్ని, అసౌకర్యాన్ని గుర్తు చేసుకున్నారు.‘మీ వాష్‌రూమ్ వాడుకుంటాం’ అని దుకాణాలు, రెస్టారెంట్‌ల వాళ్లను అడగడం ఎంత ఇబ్బందిగా ఉండేదో తలుచుకున్నారు. షిరిడీకి వెళ్లేటప్పుడు బస్ ప్రయాణం కదా అని నీళ్లు తక్కువగా తాగినప్పటికీ ఏసీ బస్సు కావడంతో వాష్‌రూమ్ అవసరం తప్పని సరి అయిన సందర్భాన్ని వివరించారు. హిస్టరెక్టమీ చేయించుకున్న తన అత్తగారు కోదాడ నుంచి హైదరాబాద్‌కి బస్సులో ప్రయాణించేటప్పుడు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితినీ ప్రస్తావించారు.
వీటన్నింటి తర్వాత ఇండియాలో.. ఏడేళ్ల కొడుకు వేదాన్ష్ కోదాడ, వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో స్కూల్లో వాష్‌రూమ్ బాగాలేదని మొండికేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన ఎందుకు చేయాలని ప్రశ్నించడంతో ఈ సమస్య తీవ్రతను మరోసారి సమీక్షించుకున్నారు సుష్మ. ఇండియాలో స్వచ్‌భారత్‌లు వచ్చినా, నగరాల్లో సులభ్ కాంప్లెక్స్‌లున్నా వాష్‌రూమ్ అవసరాన్ని భర్తీ చేసే స్థాయిలో సర్వీస్ లేదని గమనించారు. ‘‘పెద్ద మాల్స్‌లో షాపింగ్ చేసే వాళ్లకు ఆ మాల్సే వాష్‌రూమ్ సర్వీస్‌నిస్తున్నాయి. కానీ సామాన్య మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఆ మహిళలు రోజు వారీ పనులు, కొనుగోళ్ల కోసం కోసం బహిరంగ మార్కెట్ మీదనే ఆధారపడుతున్నారు. మళ్లీ వాళ్లు ఇంటికి వెళ్లే వరకు ఊపిరి బిగపట్టినంత ఆ నరకాన్ని భరిస్తూనే ఉండాలి. వీటన్నిటికీ పరిష్కారంగా నాకు వచ్చిన ఆలోచనే ఈ ‘మొబైల్ షీ టాయిలెట్స్’’ అన్నారు సుష్మ.
ఇండియా అంతే... అనుకోరాదు
‘‘ఊహ తెలిసిన తర్వాత అమెరికా సమాజాన్ని మాత్రమే చూసిన మా పెద్దబ్బాయి వేదాన్ష్‌కు భారతీయ సమాజం పరిచయం కావాలనే ఆలోచనతో కార్పొరేట్ స్కూల్ కాకుండా కొంతకాలం పాటు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. ‘మా తాతగారిల్లు, మా నాన్న చదివిన స్కూలు’ అని ఫొటోల్లో చూడడం కాదు, పిల్లలకు ప్రాక్టికల్‌గా అనుభవంలోకి రావాలనేదే మా ఆలోచన. స్కూలుకి వెళ్లిన మొదటి రోజు నుంచి ‘స్కూల్లో వాష్‌రూమ్‌తో మొదలు పెట్టి స్కూల్లో బెంచీల్లేవేంటి, బిల్డింగ్‌కి పగుళ్లున్నాయేంటి’ అని రోజుకో కంప్లయింట్ చేసేవాడు. దాంతో మా మామగారు (జలగం రంగారావు) పూనుకుని స్కూల్ రిపేర్‌లు, బెంచ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌కు అవసరమైన మెటీరియల్ డొనేట్ చేశారు. మన కళ్ల ముందున్న ప్రతి సమస్యకూ ‘ఇండియాలో ఇంతే’ అని సమాధానం చెప్పుకోవడం కాదు, మనవంతుగా ఓ పరిష్కారాన్ని ఆలోచించాలి’’ అని చెప్పారు సుష్మ.
కరెంటు ఉత్పత్తి
ఆఫ్రికాలో మొబైల్ టాయిలెట్ వ్యర్థాల నుంచి వాళ్లు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు, హ్యూమన్ వేస్ట్ ఎరువుగా మారే టెక్నాలజీని ఫాలో అవుతున్నారు వాళ్లు. వినడానికి మనకు విచిత్రంగా ఉండవచ్చు కానీ, చైనాలో స్కూళ్లలో పండించే కూరగాయలు, పండ్లకు ఎరువు ఆయా స్కూళ్ల టాయిలెట్‌ల హ్యూమన్ వేస్టే. మామూలుగా అయితే హ్యూమన్ వేస్ట్ ఎరువుగా మారడానికి ఆరు నెలలు పడుతుంది. పార్థివ దేహాన్ని దహనం చేసే టెక్నాలజీని ఇక్కడ ప్రవేశ పెడితే నిమిషాల్లో బూడిదయిపోతుంది. దానిని హరితహారంలో మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇలా పూర్తి స్థాయిలో ఒక వాహనం తయారు చేయాలంటే పదిలక్షలు ఖర్చవుతుంది. అయితే మొదటగా ప్రాథమికంగా ఉపయోగించుకోగలిగిన పరిస్థితిలో వాహనాన్ని తయారు చేయమని చెప్పారు జీహెచ్‌ఎంసీ వాళ్లు. నా ఆలోచన సంక్రాంతి నాటికి ఆచరణలోకి వస్తుంది. ఆ తర్వాత షీ టాయిలెట్స్‌ను దేశమంతటికీ విస్తరిస్తాను’’ అని భవిష్యత్తు ప్రణాళిలను వివరించారు సుష్మ.
స్కూళ్లను అద్దెకిద్దాం
ప్రభుత్వ భవనం లేకపోతే అద్దె భవనంలో స్కూళ్లు నడపడం గురించి మాత్రమే మనకు తెలుసు. సుష్మ మాటల్లో మన పాఠశాలలు అనుసరించదగిన మరో సూచన కూడా తెలియవచ్చింది. ‘‘అమెరికాలో వారాంతాలు, ఇతర సెలవు రోజుల్లో స్కూలు ఆవరణను, గదులను సమావేశాలకు అద్దెకిస్తారు. పాఠశాల భవనాలను చక్కగా నిర్వహించుకుంటే మన దగ్గర కూడా అలా రెంట్‌కిచ్చి ఆ వచ్చే డబ్బుతో స్కూల్‌కి అవసరమైన పనులు చేసుకోవచ్చు’’ అని తెలిపారు సుష్మ.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: మోహనాచారి
మూడు దేశాల ఆచరణ
షీ మొబైల్ టాయిలెట్ వాహనం
‘‘నేను, నా భర్త సుధీర్ అమెరికా, కెనడా, యూకెల్లో ఉద్యోగాలు చేశాం. యూకె టెక్నాలజీ సాయంతో నైరోబీ, ఉగాండా, కెన్యాల్లో టాయిలెట్‌ల నిర్వహణ తీరును మనదేశంలో షీ టాయిలెట్‌ల కోసమే స్టడీ చేశాను. ఒక వెహికల్‌లో టాయిలెట్ కమోడ్, వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఆ వాహనాన్ని అందుబాటులో ఉంచాలనేది మా ఉద్దేశం. మహిళలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక పార్ట్ పుణె నుంచి, మరో పార్ట్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరా బాద్ నుంచి తీసుకు వచ్చాక మరికొంత వర్క్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీని సంప్రదించాం. అడిషనల్ కమీషనర్ హరిచందన సానుకూలంగా స్పందించారు’’ అని చెప్పారు సుష్మ.
కాఫీ విత్ ప్రిన్సిపల్
పిల్లలు వేదాన్ష్, జేష్ణవ్‌లతో సుష్మ దంపతులు
స్కూల్ నిర్వహణ గురించి పూర్తిగా ప్రభుత్వాల మీదనే ఆధారపడడం కాదు, పేరెంట్స్ కూడా బాధ్యత పంచుకోవాలి. అప్పుడే సమస్యలు మొగ్గదశలోనే తీరిపోతాయి. అలా నాకు వచ్చిన ఇంకో ఆలోచనే ‘టీ విత్ హెడ్ మాస్టర్’. యూఎస్‌లో ‘కాఫీ విత్ ప్రిన్సిపల్’ ప్రోగ్రామ్ ఉంటుంది. విద్యార్థుల పేరెంట్స్ తప్పని సరిగా ప్రిన్సిపల్‌ని కలుస్తారు. పేరెంట్స్ స్కూల్‌కి అవసరమైన సర్వీస్ కూడా చేస్తారు. ఇదే కాన్సెప్ట్‌ని మా వెంకటాపురం స్కూల్ నుంచి ‘టీ విత్ హెడ్‌మాస్టర్’ అని ప్రారంభించామన్నమాట. అలా ఏపీ, తెలంగాణల్లో పాతిక స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ పెట్టి, వాళ్లకు గైడెన్స్ కోసం కొన్ని సమావేశాలకు నేను స్వయంగా హాజరయ్యాను. ఏపీ విద్యామంత్రి, తెలంగాణ విద్యామంత్రిని కలిసి కాన్సెప్ట్ వివరించాం. గత ఏపీ ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్‌ని అడాప్ట్ చేసుకుని బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు వర్తింప చేసింది.
– సుష్మ, మొబైల్ షీ టాయిలెట్స్ ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment