
ఉద్యోగాలిస్తానని.. చీపుర్లు చేతికిచ్చాడు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛభారత్ లక్ష్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
- మోదీపై రాహుల్ విసుర్లు
చాయిబసా(జార్ఖండ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛభారత్ లక్ష్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో అందరికీ ఉద్యోగాలిస్తానంటూ హామీలిచ్చి.. ఇప్పుడు వీధులూడ్చండి అంటూ చీపురుకట్టలు చేతికిస్తున్నాడ’ని మోదీని ఎద్దేవా చేశారు.
‘ఎన్నికల సమయంలో మీ కోసం నేను ఉద్యోగాలు కల్పిస్తా.. ఫ్యాక్టరీలు, రోడ్లు, విమానాశ్రయాలు నిర్మిస్తా అని చెప్పి.. అధికారంలోకి రాగానే మీరు వీధులూడ్చండి, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయారు’ అని పశ్చిమ సింగ్బూమ్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలనేది కాంగ్రెస్ వైఖరి కాగా.. అధికారమే పరమావధిగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మోదీని 10 మంది పారిశ్రామిక వేత్తల ప్రధానిగా రాహుల్ అభివర్ణించారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, భూసేకరణ చట్టాలను రూపొందించి కాంగ్రెస్ ప్రజల సాధికారత కోసం కృషి చేసిందన్నారు. పారిశ్రామికవేత్తల కోసం ఇప్పుడు భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘మనకు కావాల్సింది అభివృద్ధి సాధించే ప్రభుత్వమే కానీ వీధులు శుభ్రపరిచేవారి ప్రభుత్వం కాద’ని వ్యాఖ్యానించారు.