కాలుష్య రహిత రహదారులు
- ఐదేళ్లలో రూ.5వేల కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం: గడ్కారీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్-కాలుష్య ముక్త్ భారత్ నినాదంతో కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఐదు లక్షల కోట్ల రూపాయలను జాతీయ రహదారుల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో వెచ్చించనున్నామని, అందులో నుంచి ఒక శాతం... ఐదు వేల కోట్లు జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమానికి కేటాయిస్తామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. దీంతో జాతీయ రహదారులు నిర్మాణాలు జరిగే గ్రామాల్లోని రైతు లు, నిరుద్యోగులు, మహిళలకు ఉపాధి కల్పించాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఢిల్లీ లో మంగళవారం నిర్వహించిన హరిత జాతీ య రహదారులవిధానంపై జరిగిన సదస్సులో గడ్కారీ మాట్లాడారు.
దేశంలోని 48లక్షల కి.మీ రహదారుల్లో, 96వేల కి.మీ జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. రాను న్న రోజుల్లో 1.50 లక్షల కి.మీ వరకు జాతీయ రహదారులను విస్తరిస్తామన్నారు. దేశంలోని ట్రాఫిక్‌లో 20 శాతం జాతీయ రహదారులపైనే ఉంటోం దని, ప్రతి ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.50 లక్షల మంది చనిపోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన నాలుగు లేన్ల విస్తరణకు చర్యలు చేపట్టనున్నామన్నారు. వాహన కాలుష్య నివారణకు రానున్న రెండేళ్లలో పెట్రో, డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలను రోడ్లపైకి తీసుకురానున్నామన్నారు. మురుగునీటిని రీస్లైకింగ్‌తో పునర్వినియోగిస్తామన్నారు. పర్యావరణ రక్షణకు కృషి చేసేవారికి జాతీయ స్థాయిలో 3, రాష్ట్రస్థాయిలో ఒక్కోటి చొప్పున అవార్డులను అందచేస్తామని గడ్కరీ చెప్పారు.