
24 గంటల్లో తేల్చండి
- లేదంటే అత్యవసర సేవలు బంద్
- ప్రభుత్వానికి జూడాల హెచ్చరిక
గాంధీ ఆస్పత్రి : తమ సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వివిధ రూపాల్లో వారు నిరసన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు లేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పడుతున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపజేసింది. తొలుత వారు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం, డీఎంఈలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ సందర్భంగా గాంధీ జూడాల సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన భవనం నుంచి ఇందిరా పార్కు వరకు మహార్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి 24 గంటల గ డువుఇస్తామని, అప్పటికీ స్పందించకుంటే తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు.
జూడాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
రామంతాపూర్: రామంతాపూర్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో పెండింగ్‌లో ఉన్న స్టైపండ్ చెల్లించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం కళాశాల ప్రాంగణంలో చెత్తా చెదారాన్ని తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిప్రతాప్, సందీప్, సంధ్య, లిఖిత, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన ఆందోళన
సుల్తాన్‌బజార్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాలు సాగిస్తున్న ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన ఉద్ధృతం చేయనున్నట్లు జూడాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.