కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న అగ్రనేతలు
సాక్షి, బెంగళూర్ : ఉత్కంఠభరితంగా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరులో అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీలు అలుపెరుగకుండా ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తుండగా, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సైతం ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. విజయపురలో సోనియా తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో చాలాకాలంగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న సోనియా దాదాపు రెండేళ్ల తర్వాత కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. మే 12న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న క్రమంలో ఇక ప్రచారానికి కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు క్యాంపెయిన్‌ను ముమ్మరం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు ర్యాలీల్లో పాల్గొనగా అన్ని జిల్లాలను చుట్టివచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలు మరోవిడత పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇక విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ జేడీ(ఎస్) మద్దతు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పపై కర్ణాటక హైకోర్టు అన్ని కేసుల్లో క్లీన్‌చిట్ ఇవ్వగా, రాహుల్ గాంధీ రూ 5000 కోట్ల స్కామ్‌లో నిందితుడిగా ఉన్నారని బీజేపీ దుయ్యబట్టింది. మరోవైపు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ మోదీ, అమిత్ షాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరువు నష్టం దావా వేశారు.
వేడెక్కిన సోషల్ వార్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్షేత్రస్ధాయిలో పతాకస్థాయికి చేరితే సోషల్ మీడియాలోనూ యూజర్ల మెసేజ్‌లు, సర్వేలు, ఫేక్ న్యూస్, ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తల నిర్ధారణ సంక్లిష్టంగా మారుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోన్న ప్రీ పోల్ సర్వేను తాము నిర్వహించలేదని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ స్పష్టం చేయడంతో నెట్‌లో ఫేక్‌న్యూస్ హడావిడి ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment