బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్
అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన ఇంతకుముందే బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్ (బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా (రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా (సిపాఝర్), జయంత మల్లా బారువా (నల్‌బారి) ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తామంతా ఆకర్షితులం అయ్యామని, అందుకే బీజేపీలో చేరామని వాళ్లంతా చెప్పారు. పార్టీలో ఎవరు చేరాలనుకున్నా వారికి స్వాగతం పలుకుతామని అసోం బీజేపీ అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి తెలిపారు. అసోంలో బీజేపీ ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిపోవడంతో.. 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 69కి పడిపోయింది. అయినా.. మేజిక్ సంఖ్య 63కు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి లోటు లేదు.